త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుస‌లు కొడుతున్న‌య్ : కేటీఆర్

KTR | ఇవాళ కొన్ని వాన‌పాములు కూడా నాగుపాముల్లాగా బుస‌లు కొడుతున్న‌య్ అని.. అయినా ఏం ప‌ర్వాలేదు.. టైమ్ వ‌స్త‌ది.. టైమ్ వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలో అది చేసి చూపెడుతామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

S

Telangana | Published On Sep 27, 2026, 2.41 pm IST

KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుస‌లు కొడుతున్న‌య్ : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : ఇవాళ కొన్ని వాన‌పాములు కూడా నాగుపాముల్లాగా బుస‌లు కొడుతున్న‌య్ అని.. అయినా ఏం ప‌ర్వాలేదు.. టైమ్ వ‌స్త‌ది.. టైమ్ వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలో అది చేసి చూపెడుతామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ పదిలంగా ఉన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అవినీతితో విసిగిపోయిన ప్రజలు.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో కేటీఆర్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ ముఖ్య నేత‌లు చేరారు. వీరంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మరో నెలలో మూడేండ్లు పూర్తవుతాయ‌న్నారు. గత పది, పదకొండు రోజులుగా హైదరాబాద్‌లో ఒక నేతకు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు. పోలీస్‌ కమిషనర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఏ పాట పెట్టాలి.. ఏ పాట పెట్టకూడదని చెప్పే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు డీజేలను బంద్‌ చేస్తున్నారని అన్నారు. అణచివేత ఎక్కువైతే సందర్భం వచ్చినప్పుడు గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయని హెచ్చరించారు. అందుకే గతంలో సజ్జనార్‌, కిషన్‌రెడ్డి ఎదుట కూడా ‘దేఖ్‌లెంగే’ వంటి పాటలు పెట్టుకొని డ్యాన్స్‌ చేశారని గుర్తుచేశారు.

ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు

‘ది ప్యారడైజ్‌’ సినిమాలో కేసీఆర్‌ పాత్ర నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తమకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చిన నాయకుడిని ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటున్నారో అందులో కనిపిస్తుందని కేటీఆర్‌ అన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల్లోనూ నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

భయాందోళనలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు 

30 శాతం కమీషన్లు తీసుకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో రైలు ఎప్పుడో వచ్చేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మెట్రోకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తిచేశామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఆ టెండర్‌ను రద్దు చేయడమేనని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం భయాందోళనలో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.16 వేల కోట్లతో మూసీని అద్భుతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మురుగునీరు మూసీలోకి రాకుండా 32 ఎస్టీపీలను ఏర్పాటు చేశామని చెప్పారు. జీవో 58 కింద రెండు లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించామని గుర్తుచేశారు.

హైడ్రాకు ఆ ఇళ్లు కనిపించడం లేదా?

హైడ్రాకు వివేక్‌ వెంకటస్వామి, అనుముల తిరుపతిరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఇళ్లు కనిపించడం లేదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు అవుతున్నా ఒక్క ఇటుక పెట్టి ఇల్లు నిర్మించలేదని విమర్శించారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపైనా ఆయన ప్రశ్నలు సంధించారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో చెప్పేది వాస్తవానికి ఫార్మా సిటీకి సంబంధించినదేనని వ్యాఖ్యానించారు.

రెచ్చిపోయి పనులు చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదు

మరో రెండేండ్లలో కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి వస్తారని కేటీఆర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భూదందాలు చేయడానికే.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. రేపు మన ప్రభుత్వం రాగానే.. ఇట్ల రెచ్చిపోయి పనులు చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తమకు తెలుసని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుందని కేటీఆర్‌ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేటీఆర్ కోరారు.

Advertisement
Advertisement