త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వాగతం పలికారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.

S

Telangana | Published On Sep 27, 2026, 3.04 pm IST

KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌
Advertisement

2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలు బయటపెట్టాలి
నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలి
హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలి
సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సూటి ప్రశ్నలు

KTR | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వాగతం పలికారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.

రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీల్లో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల అభ్యర్థనల మేరకు, అర్హత ప్రకారం రికార్డులు సవరించామని చెప్పారు.

సిరిసిల్ల ప్రజలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ భూమి? ఏ మండలం? ఏ గ్రామం? ఏ సర్వే నంబరు? ఎవరి పేరుపై ఉంది? ఎంత విస్తీర్ణం? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆరోపణలను రుజువు చేయలేకపోతే సిరిసిల్ల ప్రజలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి

బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ తెలిపారు. స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో పాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు, టెస్కో ద్వారా ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతో పాటు నెలకు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే పరిస్థితి కల్పించామని చెప్పారు.

బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి

సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తుల టర్నోవర్‌ను ఏడాదికి రూ.250 కోట్ల నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పెంచామని, నేతన్నల ఆత్మహత్యలు తగ్గడంతో పాటు వలసలు కూడా నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరో పేరుతో ప్రారంభించినా దాన్ని కేవలం మహిళా సంఘాలకు మాత్రమే పరిమితం చేశారని తెలిపారు.

ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉంది

గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఆర్డర్లను ఇతర పెద్ద పరిశ్రమలు, దళారులకు కేటాయించారని ఆరోపించారు. దీంతో ఏడాది పొడవునా ఉండాల్సిన పని ఆరు నెలల కంటే తక్కువకు పడిపోయిందని తెలిపారు. పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు. నేతన్నలకు చెల్లించిన 10 శాతం యార్న్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? 10 శాతం యార్న్ సబ్సిడీని ఎప్పుడు విడుదల చేస్తారు? స్పష్టమైన తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సిరిసిల్లను కాదని వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు

వస్త్ర పరిశ్రమ ఉన్న సిరిసిల్లను కాదని వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేయడం ద్వారా సిరిసిల్ల నేతన్నలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. వస్త్రోత్పత్తికి రూ.300 కోట్ల విలువైన యార్న్ అవసరం ఉండగా కేవలం రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. సిరిసిల్లలోనే యార్న్ డిపో ఏర్పాటు చేసి అవసరమైన మేరకు యార్న్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుబీమా తరహాలో నేత కార్మికుల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రూ.5 లక్షల నేతన్న బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం కూడా చెల్లించకుండా నిలిపివేసిందని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement