త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | స‌మాచారం దాచిపెట్ట‌డం స‌రికాదు.. మండ‌లిలో ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్

MLC Dasoju Sravan | పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హక్కు చట్టం (RTI Act) అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు.

S

Telangana | Published On Mar 18, 2026, 4.05 pm IST

MLC Dasoju Sravan | స‌మాచారం దాచిపెట్ట‌డం స‌రికాదు.. మండ‌లిలో ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్
Advertisement

MLC Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హక్కు చట్టం (RTI Act) అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ప్రజలకు సమాచారం అందే వ్యవస్థలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు.

ఆర్‌టీఐ చట్టం ప్రకారం ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌లో కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులు (GOs) అందుబాటులో లేవని తెలిపారు. చిన్నచిన్న బదిలీలు లేదా పరిమిత అంశాలకు సంబంధించిన జీవోలు మాత్రమే ఉంచి, ముఖ్యమైన టెండర్లు, నిధుల కేటాయింపులు వంటి కీలక జీవోలను “క్లాసిఫైడ్”, “కాన్ఫిడెన్షియల్” పేరుతో ప్రజలకు అందకుండా దాచిపెట్టడం సరైంది కాదని ఆయన విమర్శించారు. దీంతో ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు తెలియకుండా గోప్యంగా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు.

రాష్ట్రంలోని అనేక శాఖల్లో ఆర్‌టీఐ దరఖాస్తులలో 95 నుంచి 98 శాతం వరకు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమాచారం ఇవ్వాలనే చట్టబద్ధమైన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించకపోవడమేనని విమర్శించారు.

ఆర్‌టీఐ చట్టం కింద ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ పోర్టల్ సక్రమంగా అమలు కావడం లేదని కూడా ఆయన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 12,000కు పైగా ప్రజా సమాచారం అధికారులు ఉన్నప్పటికీ, కేవలం 200కు తక్కువ శాఖలే ఆన్‌లైన్‌లో నమోదు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో, కృత్రిమ మేధస్సు (AI) గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ప్రజలకు సమాచారం సులభంగా అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆన్‌బోర్డ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధులుగా తాము ఆర్‌టీఐ కింద సమాచారం కోరినా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. HMDA, GHMC, HYDRA వంటి సంస్థల వద్ద సమాచారం కోరినా సమాధానం రావడం లేదని తెలిపారు. ఇది ప్రజాప్రతినిధుల బాధ్యతలను నిర్వర్తించడంలో అడ్డంకిగా మారుతోందని అన్నారు.

ప్రజలు తమ సమస్యలతో వచ్చి వినతిపత్రాలు ఇచ్చినప్పుడు, వాటిని ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపినా కనీసం అంగీకార పత్రం కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ప్రజాప్రతినిధుల లేఖలకు స్పందించకపోవడం Representation of the People Act ఆత్మకు విరుద్ధమని అన్నారు.

ఫోన్ కాల్స్ ఎత్తకపోవడం, లేఖలకు సమాధానం ఇవ్వకపోవడం వంటి పరిస్థితులు కేవలం తనకే కాకుండా మండలిలో ఉన్న అనేక మంది సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలేనని తెలిపారు. శాసన మండలి సభ్యులను “ఆరో వేలు”లా తీసిపారేయడం తగదు. ఈ పరిస్థితిపై శాసన మండలి చైర్మన్ దృష్టి సారించి, ప్రభుత్వాన్ని కఠినంగా ఆదేశించి ఆర్‌టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement