త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తోంది : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs | కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో బీసీల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) నిర‌స‌న చేప‌ట్టారు.

D

Telangana | Published On Mar 26, 2026, 11.05 am IST

BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తోంది : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Advertisement

BRS MLAs | కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో బీసీల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) నిర‌స‌న చేప‌ట్టారు. గ‌న్‌పార్క్ వ‌ద్ద నిర‌స‌న ప్ర‌దర్శ‌న చేశారు. ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం బీసీల‌ను ద‌గా చేస్తోందంటూ నినాదాలు చేశారు. స్థానిక సంస్థ‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల హామీని వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీ కార్పొరేష‌న్ల‌ను త‌క్ష‌ణ‌మే నిధులు విడుద‌ల చేసి ఆదుకోవాల‌ని కోరారు. గొల్ల‌, కురుమ‌ల పొట్ట కొట్టొద్ద‌ని, రెండో విడ‌త గొర్రెల పంపిణీ వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్ర‌కారం బీసీ స‌బ్‌ప్లాన్‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌, గంగ‌పుత్రుల‌ను ఆదుకోవాల‌న్నారు. మ‌త్స్య‌కారుల‌కు ఉచిత చేప పిల్ల‌ల పంపిణీని కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఓట్ల కోసం బీసీల‌ను వాడుకుని వ‌దిలేసింద‌ని ఆరోపించారు. హామీలు నెర‌వేర్చే దాకా పోరాటం చేస్తామ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ప‌ష్టం చేశారు. బీసీల‌ను వంచించిన కాంగ్రెస్ పార్టీ గ‌ద్దె దిగాలంటూ నిన‌దించారు.

"వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మోసం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల‌ను మోసం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పే టైం వ‌చ్చింది. రాబోయే రోజుల్లో బీసీలే కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బొంద పెడ‌తారు. లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్‌లో జ‌న‌ర‌ల్ స్థానాల్లో బీసీలు గెలిచారు. అది దేనికి సంకేత‌మో అర్థం చేసుకోవాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

బీసీ విద్యార్థుల కోసం గురుకులాల‌ను పెద్ద ఎత్తున ఇచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌ది అని ఎమ్మెల్యేలు తెలిపారు. లింగ‌య్య యాద‌వ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపించార‌ని గుర్తు చేశారు. అనేక మంది బీసీ నాయ‌కుల‌కు అత్యున్న‌త ప‌ద‌వులు ఇచ్చిన ఘ‌న‌త కూడా కేసీఆర్‌దే అని నిన‌దించారు. కుల వృత్తుల‌ను ప్రోత్స‌హించిన ఘ‌న‌త కేసీఆర్‌ది అని ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసాల‌ను బీసీలు గ‌మ‌నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లే వారే ఈ ప్ర‌భుత్వాన్ని బొంద పెట్ట‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.

Also Read..

మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

మేడారం గద్దెల వద్ద జారిపడిన రాతిశిల.. బాలుడికి తీవ్ర గాయాలు

టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 13 మంది మృతి

Advertisement

తాజావార్తలు

Advertisement