త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | మిస్ ఇన్ఫ‌ర్మేష‌న్ మాఫియాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం..!

P

Telangana | Published On Jan 28, 2026, 5.41 pm IST

Manne Krishank | మిస్ ఇన్ఫ‌ర్మేష‌న్ మాఫియాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం..!
Advertisement
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచార‌ణ‌పై ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేందుకు సీఎంవోలో వాట్సాప్ గ్రూప్‌
  • న‌కిలీ వార్త‌ల‌పై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడుతున్నాం
  • బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్

Manne Krishank | దేశంలోనే అత్యంత మిస్ ఇన్ఫ‌ర్మేష‌న్ మాఫియాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న బుధ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా తోటి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం న‌డిపార‌ని ఆరోపించారు. ఉత్తమ్ వ్యక్తిత్వ హననం విష‌యంలో రేవంత్‌పై బ‌హిరంగంగానే మాట్లాడ‌న్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై జరుగుతున్న సిట్ విచారణపై ఫేక్ వార్తలు ప్రచారం చేసేందుకు సీఎంఓలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంద‌ని, అక్క‌డి నుంచే నకిలీ వార్తలు సర్క్యూలేట్ అవుతున్నాయని తాము ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడుతున్నామ‌న్నారు. 138 సభ్యులున్న సీఎంవో వాట్సాప్ గ్రూప్ నుంచి తెలంగాణ ఉద్యమ కారుడు ఒకరు విజిల్ బ్లోవర్‌గా వ్య‌వ‌హ‌రించి.. స్క్రీన్ షాట్ పంపితే అసలు విషయాలు తెలిశాయ‌న్నారు.

రైజింగ్ టాక్ క‌మ్యూనికేష‌న్ పేరుతో గ్రూప్‌..

తెలంగాణ రైజింగ్ టాక్ కమ్యూనికేషన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ నడుస్తోందని, సీఎం పీఆర్వో ఓ అన్వేష్, మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి సతీష్ మన్నే త‌దిత‌రులు ఈ వాట్సాప్ గ్రూప్‌లో స‌భ్యులుగా ఉన్నార‌ని తెలిపారు. సీఎంవో నుంచే ఈ తతంగం నడుస్తోంద‌ని, సిట్ చీఫ్‌గా సజ్జనార్ ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్‌నించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ ప్రతిపక్షాల మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఆరోపించారు. అన్వేష్ కూడా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలాంటి ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వేల బాట్స్ అకౌంట్స్ సృష్టిస్తూ తప్పుడు ప్రచారం సర్క్యూలేట్ చేస్తున్నార‌ని, సిట్ నుంచి అధికారకంగా రిలీజ్ కాకున్నా బాట్స్ అకౌంట్ ద్వారా బీఆర్ఎస్‌ను బ‌ద‌నాం చేస్తున్నార‌న్నారు. శ్రీరామ్ కర్రీ ఓ క్రిమినల్ అని.. ఆయ‌న‌పై త‌క్ష‌ణం కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. మీడియా డైరెక్టర్ బాధ్య‌త‌ల నుంచి వెంట‌నే త‌ప్పించాల‌న్నారు. ఇది డేంజరస్ మాఫియాగా మారి ఈ వాట్సాప్ గ్రూప్ నడిపిస్తోంద‌ని.. కేటీఆర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు సీఎం రేవంత్ ప్రోద్బ‌లంతో శ్రీరామ్ కర్రీ, అన్వేష్, మన్నే సతీశ్ ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. బాట్స్ అకౌంట్స్ ఉన్న వాళ్లే సీఎం ప్రసంగాలను సోషల్ మీడియాలో అహో ఓహో అని ప్రచారం చేస్తున్నార‌న్నారు.

బీఆర్ఎస్ మీద వండి వార్చిన కథనాలు

బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ దినేశ్ చౌద‌రి మాట్లాడుతూ కాంగ్రెస్ పేరడీ అకౌంట్స్ పేరిట బీఆర్ఎస్ మీద వండి వార్చిన కథనాలు సమాజంలోకి వదులుతున్నార‌ని, కాంగ్రెస్ బాట్స్ ఆర్మీ కాలకేయ సైన్యం కంటే ఘోరంగా తయారైంద‌న్నారు. ఈ వికృత క్రీడను డీజీపీ అరికట్టాల‌న్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ఫేక్ న్యూస్‌ని ప్ర‌భుత్వం అరిక‌ట్టాల‌ని.. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుండి ఫేక్ న్యూస్‌ని బ‌రితెగించి ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. సీఎంవో నుంచే ఈ ఫేక్ న్యూస్ ముఠా నడుస్తోందని, సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామ‌న్నారు. ఎన్నో సార్లు డీజీపీ కి ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ నేతలపై చర్యలు లేవ‌ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బీ ఆర్ ఎస్ మహిళలపై వ్యక్తిత్వహనానికి పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. టీ షాట్‌, బీఆర్‌కే భ‌వ‌న్‌, హ‌కా భ‌వ‌న్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల నుంచి ఈ ఫేక్ ప్ర‌చారం న‌డుస్తోంద‌న్నారు.

ఆధారాలు సమర్పించినా చ‌ర్య‌లు లేవు..

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు 29న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఫేక్ ప్రచారం నడుస్తోందని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేద‌ని ఆరోపించారు. ఆధారాలు సమర్పించినా చర్యలు లేవ‌ని.. వందలాది మంది ప్రభుత్వ అధికారులను బీఆర్ఎస్‌పై దుష్ప్రచారానికి వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. అనుముల రాజ్యాంగంలో బీఆర్ఎస్ చేసిన ఏ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేద‌ని విమ‌ర్శించారు. ఇదో వ్యవస్థీకృతమైన నేరంలా మారింద‌ని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేన‌ని.. అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే.. తాము తీసుకుంటామ‌న్నారు. రాష్ట్రంలో లేని సాంప్రదాయాలను తీసుకొస్తున్నార‌ని.. ప‌ద్ధ‌తి మార్చుకోని అధికారులను తాము అధికారంలోకి వ‌చ్చాక చ‌ట్ట ప‌రిధిలో శిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement