త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్ర‌చారానికి NDSA, CWPRS నివేదిక‌లు చెంప‌పెట్టు : హ‌రీశ్ రావు

Harish Rao | కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ (Kaleshwaram project) పూర్తిగా దెబ్బతిందంటూ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న దుష్ప్రచారానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) అఫిడవిట్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) నివేదికలు గట్టి సమాధానమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు.

D

Telangana | Published On Aug 25, 2026, 10.56 am IST

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్ర‌చారానికి NDSA, CWPRS నివేదిక‌లు చెంప‌పెట్టు : హ‌రీశ్ రావు
Advertisement
  • హ‌స్తం పార్టీ నేత‌లవి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌ని తేలిపోయింది
  • ఏపీకి నీళ్లు వదిలి.. తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారు
  • కేసీఆర్‌ హయాంలో నీటి కొరతను అధిగమించిన తెలంగాణ‌ను..
  • రేవంత్ స‌ర్కార్ నీటి క‌ష్టాల్లోకి నెట్టేసింది

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) అఫిడవిట్, CWPRS (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నివేదికలు గట్టి చెంపపెట్టు అని మాజీ మంత్రి బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు (Harish Rao) విమర్శించారు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలింది, పనికిరాకుండా పోయింది, నీళ్లు ఎత్తలేం అంటూ కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లూ చేసిన అబద్ధపు ప్రచారం ఈ నివేదికలతో పూర్తిగా బట్టబయలైందని పేర్కొన్నారు.

అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్‌ చేసుకోవచ్చని స్వయంగా NDSA అఫిడవిట్‌లో స్పష్టం చేసింద‌ని హ‌రీశ్ రావు చెప్పారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ళ మోటార్లు ఆన్ చేసి నీళ్ళు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. మరోవైపు CWPRS పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్‌ నాణ్యత కూడా బాగుందని వెల్లడైన‌ట్లు చెప్పారు. అయినా రాజ‌కీయ క‌క్ష‌తో కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టి తెలంగాకు వ‌చ్చిన గోదావ‌రి నీటిని వినియోగించుకోకుండా కింద‌కు వ‌దిలేయ‌డం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ క్రిమిన‌ల్ నెగ్లిజెన్స్‌కు నిద‌ర్శ‌న‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఏపీకి నీళ్లు వదిలి.. తెలంగాణ రైతాంగానికి క‌న్నీళ్లు మిగిల్చారు

ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్‌ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాము నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల, నంది పంపులు ఆన్ చేసిన‌ట్లు చెప్పారు. అప్పటికే వరద నీరంతా కిందకి వెళ్లిపోయిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆలస్యంగా పంపులు ఆన్‌ చేసి.. ఆ తర్వాత వెంటనే ఆఫ్‌ చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీకి నీళ్లు వదిలి.. తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చార‌ని రేవంత్ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు.

రాబోయే నీటి సంక్షోభానికి సంకేతం..

ఫ‌లితంగా దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16% ఉండగా.. తెలంగాణలో మాత్రం కేవలం 35.6% మాత్రమేన‌ని పేర్కొన్నారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండటం దారుణమ‌న్నారు. ఇవి కేవలం అంకెలు మాత్ర‌మే కాద‌ని చెప్పారు. తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలని హెచ్చ‌రించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నీటి నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. నేడు జలాశయాల్లో నీటి నిల్వల విషయంలో బీహార్‌తో పోటీ పడే దుస్థితికి చేరింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్రాన్ని నీటి క‌ష్టాల్లోకి నెట్టారు..

ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శన‌మ‌ని హ‌రీశ్ ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్‌ హయాంలో నీటి కొరతను అధిగమించిన తెలంగాణను.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మళ్లీ నీటి కష్టాల్లోకి నెట్టిందని విమ‌ర్శించారు. నిండుగా పారిన గోదావరి, కృష్ణా నీళ్లను కిందకు విడిచిపెట్టి రాష్ట్రానికి చేసిన కాంగ్రెస్ ద్రోహం ఫలితం ఇది అని దుయ్య‌బ‌ట్టారు. కమిషన్లు వేయడానికి, విచారణలు చేయడంపై ఉన్న శ్రద్ధ కిందకి వెళ్లిపోతున్న‌ గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి రైతులకు అందించడంలో ఎందుకు లేదు..? అంటూ ప్ర‌శ్నించారు.

రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి..

ఎల్‌ నినో ప్రభావం, భవిష్యత్‌ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది రాజకీయ కక్షలకు సమయం కాద‌ని.. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన సమయం అని వ్యాఖ్యానించారు. పార్టీలో కుమ్ములాటలు, కొట్లాటలపై ఉన్న‌ శ్రద్ధ పక్కనపెట్టి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి హక్కులు, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చుర‌క‌లంటించారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి, అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాలని, రిజర్వాయర్లు నింపి రైతుల పొలాలకు నీళ్లు అందివ్వాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Also Read..

ప‌శ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ఓటీటీలు, AI యాప్‌ల వాడకం ఉందా?.. మనకు తెలియకుండానే జీతానికి కన్నం వేస్తున్న 'సైలెంట్' సబ్‌స్క్రిప్షన్లు!

ఆన్‌లైన్‌లో ఉమ్మెత్త పండ్లు, విత్త‌నాలు.. అమెజాన్‌, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు ర‌ద్దు

Advertisement
Advertisement