KCR | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి రామ్ వాంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గత కేసీఆర్ ప్రభుత్వం, దేశానికి గర్వంగా నిలబెట్టిన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి, పద్మ భూషణ్, రామ్ వాంజీ సుతార్ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్ర శేఖర్ రావు గారు సంతాపం ప్రకటించారు. ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి.. ప్రపంచ స్థాయి ప్రతిభను కనబరిచి, శిల్ప కళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన రామ్ సుతార్ శిల్ప కళా సేవలను, బాబా సాహెబ్ అంబేద్కర్ రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వ కారణమని కేసీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్మాణంలో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా, బీఆర్ అంబేద్కర్ స్ఫురద్రూపాన్నీ 125 అడుగుల ఎత్తులో, అత్యంత సుందరంగా మనోహరంగా తీర్చిదిద్దిన, రామ్ సుతార్ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని తెలిపారు. వారి మరణం, శిల్ప కళా రంగానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. నిండు నూరేండ్ల జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించి దివంగతులైన రామ్ వంజీ సుతార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.