త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Political Violence | బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాకాండ.. అవామీ లీగ్ నేతల ఇళ్లకు నిప్పు!

Political Violence | బంగ్లాదేశ్‌లో మ‌రోసారి రాజ‌కీయ హింస భ‌గ్గుమ‌న్న‌ది. నరైల్‌ జిల్లాలో అవామీ లీగ్‌ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. బెండర్‌చార్‌ గ్రామంలో సుమారు 30 ఇళ్లకు నిప్పుపెట్టగా.. పలు ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసి దోచుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

P

International | Published On Nov 22, 2026, 4.07 pm IST

Political Violence | బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాకాండ.. అవామీ లీగ్ నేతల ఇళ్లకు నిప్పు!
Advertisement
  • ఒకే గ్రామంలో 30 ఇళ్లు దగ్ధం.. దోపిడీలు, విధ్వంసం..
  • ఏడు జిల్లాల్లో 95 బీజీబీ ప్లాటూన్ల మోహరింపు

Political Violence | బంగ్లాదేశ్‌లో మ‌రోసారి రాజ‌కీయ హింస భ‌గ్గుమ‌న్న‌ది. నరైల్‌ జిల్లాలో అవామీ లీగ్‌ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. బెండర్‌చార్‌ గ్రామంలో సుమారు 30 ఇళ్లకు నిప్పుపెట్టగా.. పలు ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసి దోచుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కలియా ఉపజిల్లాలోని బెండర్‌చార్‌ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మొదలైన దాడులు కొనసాగినట్లు ప్రోథోమ్‌ అలో వెల్లడించింది. మాజీ ఎంపీ బీఎం కబీరుల్‌ హక్‌ ముక్తి, మాజీ మేయర్‌ ముష్ఫికుర్‌ రెహమాన్‌ లిటన్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణపద ఘోష్‌ల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. రాత్రి 8 గంటల సమయంలో గ్రామంలో 20 నుంచి 30 ఇళ్లు మంటల్లో కాలిపోతున్నట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. సుమారు 50 ఇళ్లు, దుకాణాలపై దాడులు చేసి ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణలను స్థానిక బీఎన్‌పీ నాయకత్వం ఖండించింది. మాజీ ఎంపీ ఇంటితో పాటు పలు ఇళ్లపై దాడులు జరిగాయని, ఐదారు ఇళ్లకు నిప్పుపెట్టారని కలియా ఎగ్జిక్యూటివ్‌ అధికారి మహమ్మద్‌ జిన్నాతుల్‌ ఇస్లాం తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు.

ఇద్దరు బీఎన్‌పీ నేతల హత్యతో ఉద్రిక్తతలు

గత వారం హత్యకు గురైన ఇద్దరు బీఎన్‌పీ నేతల బంధువులు, మద్దతుదారులు శుక్రవారం బెండర్‌చార్‌లో గుమిగూడి.. ఆ హత్యలతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అవామీ లీగ్‌ నేతల ఇళ్లపై దాడులకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. నవంబర్‌ 18న బీఎన్‌పీ నిర్వహించిన మోటార్‌సైకిల్‌ ర్యాలీపై దాడి జరగడం, ఈ ఘటనలో ఇద్దరు నేతలు మరణించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు పటువాఖాలీలో ముగ్గురు మాజీ అవామీ లీగ్‌ ఎంపీల ఇళ్లపై కూడా దాడులు జరిగినట్లు కథనాలు పేర్కొన్నాయి. పబ్నా జిల్లాలోని బెరా మున్సిపాలిటీలో శనివారం బీఎన్‌పీ, అవామీ లీగ్‌ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించినట్లు ది డైలీ స్టార్ తెలిపింది.

ఏడు జిల్లాల్లో 95 బీజీబీ ప్లాటూన్లు

వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతా దళం (బీజీబీ) అప్రమత్తమైంది. ఏడు జిల్లాల్లో మొత్తం 95 ప్లాటూన్లను మోహరించింది. ఢాకా, నారాయణ్‌గంజ్‌, గాజీపూర్‌, గోపాల్‌గంజ్‌, మైమెన్‌సింగ్‌, ఫరీద్‌పూర్‌, కాక్స్‌బజార్‌ జిల్లాల్లో భద్రతను పెంచింది. గోపాల్‌గంజ్‌లో రెండు బెటాలియన్లను ప్రత్యేకంగా మోహరించినట్లు సమాచారం. ముఖ్యమైన ప్రాంతాలు, పారిశ్రామిక వాడల్లో నిఘా పెంచారు. డ్రోన్లు, బాడీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

హసీనా తిరిగి రాకపై కొనసాగుతున్న వివాదం

మాజీ ప్రధాని షేక్‌ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు రావాలన్న అంశం భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హసీనా పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు పునరుద్ధరణకు సంబంధించిన అభ్యర్థనలు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో ఆమె తిరుగు ప్రయాణానికి అవసరమైన పత్రాల కోసం న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్‌ మిషన్‌ను ఆమె తరఫు న్యాయవాదులు సంప్రదించినట్లు కథనాలు పేర్కొన్నాయి. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు.

పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు ర‌ద్దు..

అనంతరం బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేసింది. ఆమెను భారత్‌ నుంచి అప్పగించాలని బంగ్లాదేశ్ నాయ‌క‌త్వం కోరుతూ వ‌స్తోంది. హసీనా తిరిగి రావాలని డిమాండ్‌ చేస్తూ అవామీ లీగ్‌ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. నవంబర్‌ 19న దేశవ్యాప్త బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌లో రాజకీయ ఘర్షణలు, భద్రతాపరమైన ఆందోళనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement