త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Party | తెలంగాణ లిఫ్ట్‌ చేసిన నీటి కన్నా.. ఏపీ ఎక్కువ నీటిని త‌ర‌లించింది : వెదిరె శ్రీ‌రామ్

BJP Party | 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఎత్తిపోసిన నీటి కంటే.. ఏపీ ఎక్కువ‌గా నీటిని త‌ర‌లించింద‌ని జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా-గోదావరి నదీ జలాల కేటాయింపులపై ఆయ‌న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

P

Telangana | Published On Jan 6, 2026, 9.08 pm IST

BJP Party | తెలంగాణ లిఫ్ట్‌ చేసిన నీటి కన్నా.. ఏపీ ఎక్కువ నీటిని త‌ర‌లించింది : వెదిరె శ్రీ‌రామ్
Advertisement

BJP Party | 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఎత్తిపోసిన నీటి కంటే.. ఏపీ ఎక్కువ‌గా నీటిని త‌ర‌లించింద‌ని జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా-గోదావరి నదీ జలాల కేటాయింపులపై ఆయ‌న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ‌త‌వారం రోజులుగా ఒక ట్రెండ్ న‌డుస్తుంద‌ని, నీటి స‌మ‌స్య‌పై ప‌వ‌ర్ ప్రజంటేష‌న్స్ సాగుతున్నాయ‌న్నారు. 'రాష్ట్రంలో కృష్టా, గోదావ‌రి బేసిన్‌లు ఉన్నాయి. కృష్టా బేసిన్‌కు సంబంధించిన వివ‌రాలన్నీ మీ ముందుంచుతున్నాం. 2014 కంటే ముందు కాంగ్రెస్, తెలుగు దేశం ప్ర‌భుత్వాలు ఉన్నాయి. 2014 త‌ర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది. బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ఉమ్మ‌డి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ 190 టీఎంసీలు కేటాయించింది. మొత్తంగా 1,005 టీఎంసీలు ఉమ్మ‌డి ఏపీకి కేటాయించారు. కేడ‌బ్ల్యూడీ-2 అవార్డు వ‌చ్చిన స‌మ‌యంలో మూడు ర‌కాలుగా విభ‌జించారు. బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ డిపెండ‌బులిటీ త‌గ్గించారు. ఆ కంప్ల‌ష‌న్ తెలుగు రాష్ట్రాల‌కు రావ‌డం జ‌రిగింది' అన్నారు.

2015 ఏపీ, తెలంగాణ ఒప్పందం..

'2015లో ఏపీ, తెలంగాణ ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం ప్ర‌కారం.. 299 టీఎంసీ వ‌ర‌కు బ‌చావ‌త్ ట్రిబున‌ల్ ఇచ్చింది. టాప్ యూటిలైజేష‌న్ నాగార్జున సాగ‌ర్‌లో 105 టీఎంసీలు, మైన‌ర్ ఇరిగేష‌న్ 89, జూరాల 15, ఆర్డీఎస్ 17 టీఎంసీలుగా ఉన్నాయ‌న్నారు. 2015లో ఏపీ, తెలంగాణ మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం కేవ‌లం ఏడాదికే చేసుకున్నామ‌ని బీఆర్ఎస్ అంటుంద‌ని, ఇది వాస్త‌వ‌మేన‌న్నారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌లో ఒప్పందం జ‌రిగింది. అంత‌కు ముందు బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ 811 టీఎంసీలు ఇవ్వ‌గా.. ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. నీటిని యుటిలైజ్ చేయ‌లేకపోయాం కాబ‌ట్టి.. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిందున త‌ర్వాత ఏ ఒప్పందం జ‌రిగినా వీలైనంత ఎక్కువ‌గా అడ‌గాలి. అయితే, అప్ప‌టి బీఆర్ఎస్ ఒప్పందం స‌ర్‌ప్రైజింగ్‌గా స‌మావేశంలో 299 టీఎంసీలకు ఒప్పుకుంది. అంత‌కుముందు బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ప్ర‌కారం.. 811 టీఎంసీల్లో స‌మైక్యాంధ్ర‌లో 299 టీఎంసీలు వాడాల‌ని ఎక్క‌డా బ‌చావ‌త్ చెప్ప‌లేదు. ఎన్‌బ్లాక్‌గా 811 టీఎంసీలు కేటాయించారు' అని చెప్పారు.

స‌రిదిద్దాల్సిన బాధ్య‌త బీఆర్ఎస్‌పై ఉండే..

'ప్రాజెక్టులుగా వారీగా కేటాయింపులు ఉమ్మ‌డి రాష్ట్రంలో చేసిన స‌మ‌యంలో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింది. దాన్ని స‌రిదిద్దాల్సిన బాధ్య‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఉండే. ఓ బంగారం లాంటి అవ‌కాశాన్ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌దిలేసుకుంది. ఏడాదికి ఒప్పందం చేసుకుంటాం.. ఆ త‌ర్వాత ట్రిబ్యున‌ల్ అవార్డు వ‌స్తుంద‌ని చెప్పారు. కానీ, ఫ‌స్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్‌, చంద్ర‌బాబు సంత‌కాలు చేశారు. ఆ త‌ర్వాత ఒప్పందాన్ని మ‌రో ఏడాది పొడిగించారు. మ‌ళ్లీ రెండో స‌మావేశం 2020లో జ‌రిగింది. 2016 నుంచి 2020 కేఆర్ఎంబీ స‌మావేశంలోనూ ఇదే జ‌రుగుతూ వ‌చ్చింది. బీఆర్ఎస్ ఒక సంవ‌త్స‌రానికి ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్ప‌డం స‌రికాదు. ఎస్ఎల్‌బీసీ 40 టీఎంసీలు, క‌ల్వ‌కుర్తి లిఫ్ట్ 53, నెట్టెంపాడు 25.4, పాల‌మూరు-రంగారెడ్డి 90 టీఎంసీలు, డిండి 30, కోయిల్‌సాగ‌ర్ 3.3 టీఎంసీలు ఇలా.. మొత్తం 241.7 టీఎంసీలు వ‌ర‌ద జ‌లాల‌పైనే అప్ప‌టి స‌మైక్యాంధ్ర ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది' అన్నారు.

అన్యాయం చేసింది కాంగ్రెస్సే..

'ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. అస‌లు తెలంగాణ రాష్ట్రానికి 50-60 ఏళ్లుగా అన్యాయం చేసింది కాంగ్రెస్‌. 2014 ముందుకు ప్రాజెక్టుల‌న్నింటికి ప‌రిపాల‌న అనుమ‌తి ఇచ్చి.. నీటి కేటాయింపులు చేయ‌లేదు. ఒక్క ప్రాజెక్ట్‌కి ఇవ్వ‌లేదు. ఇప్పుడు స‌మైక్యాంధ్ర‌లో అన్నింటిని ప్రారంభించాం.. డీపీఆర్ చేశామ‌ని ఇప్పుడు అంటున్నారు క‌దా..? ఫ‌ండమెంట‌ల్‌గా డీపీఆర్ త‌యారు చేసి.. ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారంటే నీటి కేటాయింపులు చేయాలి. వ‌ర‌ద నీటిపై ఆధార‌ప‌డి క‌డుతుంటే ప్రాజెక్టుల‌న్నా పూర్తి చేయాలి.. అష్యూర్డ్ వాట‌ర్ ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి నీటిని ఇవ్వాలి. 2014లో రాష్ట్రం ఏర్పాట‌య్యే వ‌ర‌కు అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే.. ప్రాజెక్టుల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు ఇచ్చి, నీటి కేటాయించ‌క‌పోవ‌డం. మ‌రొక‌టి వ‌ర‌ద జ‌లాల‌పై చేప‌డుతున్న ప్రాజెక్టుల‌ను నిర్మించ‌లేక‌పోవ‌డం. ఒక్క బీమాకు మాత్రం 20 టీఎంసీలు కేటాయించారు' అని వివ‌రించారు.

ఏడు ప్రాజెక్టుల్లో ఒక్క‌టి పూర్తి చేయ‌లేదు..

'బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ 811 టీఎంసీల్లో చుక్కైనా ప్రాజెక్టుల‌కు ఇవ్వాల్సింది.. లేదంటే ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల్సింది. కాంగ్రెస్ 2014కి ముందు చేయ‌లేదు.. 2024 వ‌ర‌కు కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ఏడు ప్రాజెక్టుల్లో ఒక్క‌టి పూర్తి చేయ‌లేదు. పాల‌మూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌ను మొద‌లుపెట్టి రూ.30వేల‌కోట్లు ఖ‌ర్చు పెట్టారు. రిజ‌ర్వాయ‌ర్లు, డ్యామ్‌లు క‌డుతారు కాని.. డిస్ట్రిబ్యూట‌రీ కెనాల్స్ లేవు. ఇవ‌న్నీ నిర్మించే వ‌ర‌కు అంటే 10-15 ఏళ్లు వ‌ర‌కు నీళ్లు రావు. తాము ఇంత ఖ‌ర్చు చేశామ‌ని బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు చెప్పుకుంటున్నాయ‌ని కానీ.. చిత్త‌శుద్ధి లేదు. పోని 299 టీఎంసీలకు ఒప్ప‌దం చేసుకున్నా.. అది కూడా పూర్తిగా వాడుతున్నామా అంటే అదీ లేదు. ఒక్క సంవ‌త్స‌రం కూడా పూర్తిగా వాడ‌లేక‌పోయాం. కార‌ణం ఏంటంటే.. ప్రాజెక్టులు పూర్తి చేయ‌లేదు. ఎస్ఎల్‌బీసీ నిర్మాణం ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. మిష‌న్ భ‌గీర‌థ అన్నార‌ని.. చెరువులు డ‌బుల్ ట్రిపుల్ అయ్యాయ‌ని అన్నార‌ని.. మ‌రి నీటి వినియోగం ఎక్క‌డ' అని ప్ర‌శ్నించారు.

కేఆర్ఎంబీకి ఏం సంబంధం..

'2017 నుంచి కేఆర్ఎంబీ మీటింగ్‌లో 50ః50శాతం బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అడిగింద‌ని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా అడుగుతుంద‌ని.. కానీ నీటి కేటాయింపులు కేఆర్ఎంబీకి ఏం సంబంధం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నీటి కేటాయింపులు ట్రిబ్యున‌ల్ చేస్తుంది లేక‌పోతే.. రెండు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం ఒప్పందం చేసుకోవాలి. ఒప్పందం చేసుకోకుండా కేఆర్ఎంబీ అని అడుగుతున్నామంటే ఎలా? అన్నారు. 2014కి ముందు ఏపీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో పెన్నా బేసిన్‌కు ఎక్కువ‌గా నీటి కేటాయింపులు వెళ్లాయి. అన్యాయాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం లీగ‌లైజ్ చేసింది. 2014-2024 త‌ర్వాత బీఆర్ఎస్ తెలంగాణ‌కు అన్యాయం చేసింది' అన్నారు.

బాధ్యులు ఎవ‌రు ?

'శ్రీ‌శైలం ప్రాజెక్ట్‌లో ఎడ‌మ‌న తెలంగాణ‌, కుడి వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంటాయి. ఒక్క చుక్క నీటిని బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ శ్రీ‌శైలం నుంచి కేటాయించ‌లేదు. శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌ర్ సాగ‌ర్‌, కృష్టా డెల్టాకు బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌. 1996 నుంచి 1999 వ‌ర‌కు తెలుగు గంగ‌కు 15టీఎంసీలు, శ్రీ‌శైలం కుడి కాలువ పేరుతో 19 టీఎంసీలు కృష్టా డెల్టా మాడ‌రైజేష‌న్ పేరుతో వాడుకుంటామ‌ని చెప్పి.. టీఎస్‌సీ క్లియ‌రెన్స్ ప్ర‌భుత్వం తీసుకుంది. ట్రిబున‌ల్ కేటాయింపులు లేవు కానీ, కేంద్రం అనుమ‌తి ఏపీకి ఉంది. ప్ర‌స్తుతం వెలిగోడు, బ‌న‌క‌చ‌ర్ల‌, రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, తెలుగు గంగ‌, కేసీ కెనాల్‌, పోతిరెడ్డిపాడు, మ‌చ్చుమ‌ర్రి, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ త‌దిత‌ర పేర్లతో 400 టీఎంసీల ఇన్‌ఫ్రా స్ట్ర‌క్చ‌ర్‌ను ఏపీ ప్ర‌భుత్వం పూర్తి చేసింది. 34 టీఎంసీలు కేటాయింపులు అయితే, 400 టీఎంసీల వ‌ర‌కు ఇన్‌ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ క్రియేట్ అయ్యింది. దీనికి బాధ్య‌త ఎవ‌రు. వ‌ర‌ద నీటిపై ఏపీ ప్రాజెక్టులు క‌ట్టినా.. మ‌రి మ‌నం ఏం చేస్తున్నాం. ప్రాజెక్టులకు కావాల్సింది రూ.15-20వేల కోట్లు. కానీ, కాళేశ్వ‌రంపై రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఇందులో క‌నీసం ఐదోవంతు ఖ‌ర్చు చేసినా పాల‌మూరు, రంగారెడ్డి, న‌ల్గొండ జిల్లాల్లో ఇంత హీన‌మైన ప‌రిస్థితి ఉండేది కాదు. తెలంగాణ‌లో కాళేశ్వ‌రం క‌డుతున్న స‌మ‌యంలోనే.. ఏపీలో ప్ర‌భుత్వం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది' అని శ్రీ‌రామ్ వివ‌రించారు.

ఎన్‌జీటీ ఆపింది..

90 శాతం పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఎవరూ ఆపలేదని, ఎన్జీటీ మాత్ర‌మే ఆపింద‌ని శ్రీరామ్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలిక్‌ క్లియరెన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్ లేవ‌ని, ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింద‌ని చెప్పారు. సరైన వివరాలు ఇవ్వకపోవడంతో కేంద్రం తిప్పి పంపింద‌ని.. ఇవ్వాల్సిన లీగల్‌, టెక్నికల్‌ డేటా ఇస్తే 45 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి వస్తుంద‌న్నారు. మిగతా 45 టీఎంసీల కోసం ట్రైబ్యునల్‌లో గట్టిగా వాదిస్తే అనుమతులు వ‌స్తాయ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement