త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Beer Shortage | మద్యం ప్రియులకు షాక్‌.. సింగూరు మ‌ర‌మ్మ‌తుల‌తో రాష్ట్రంలో బీర్ల కొర‌త త‌ప్ప‌దా?!

G

Telangana | Published On Jan 22, 2026, 6.43 am IST

Beer Shortage | మద్యం ప్రియులకు షాక్‌.. సింగూరు మ‌ర‌మ్మ‌తుల‌తో రాష్ట్రంలో బీర్ల కొర‌త త‌ప్ప‌దా?!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ద్యం ప్రియుల‌కు చేదు వార్త‌. మ‌రో వారం ప‌ది రోజుల్లో చ‌లికాలం ముగియ‌నుంది. ఫిబ్ర‌వ‌రి నుంచే ఎండ‌లు దంచికొడ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాలు వేస్తున్న‌ది. దీంతో మండుటెండ‌ల్లో చ‌ల్ల‌ని బీర్లు తాగి (Beer) ఉప‌శ‌మ‌నం పొందాల‌నుకునే వారికి ఈసారి షాక్ త‌ప్పేలా లేదు. వేస‌వి నాటికి రాష్ట్రంలో బీర్ల స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. సింగూరు ప్రాజెక్టుకు (Singur Dam) మ‌ర‌మ్మ‌తులు చేయ‌డ‌మే దీనికి కార‌ణం. బీర్ల కొర‌త‌కు (Beer Shortage), ఈ ప్రాజెక్టుకు సంబంధం ఎంటి? అనేగా మీ సందేహం.. ఉందండి బాబు..

గ‌త వానాకాలం సీజ‌న్‌లో సంగారెడ్డి జిల్లాతోపాటు మంజీరా ప‌రివాహ‌క ప్రాంతంలో కుండ‌పోత‌గా వ‌ర్షాలు కురిశాయి. దీంతో సింగూరు డ్యామ్‌కు భారీ వ‌ర‌ద పోటెత్తింది. ఎప్పుడో 40 ఏండ్ల కింద‌ క‌ట్టిన ఆన‌క‌ట్ట కావ‌డం, పూర్తిస్థాయి సామ‌ర్థ్యం కంటే ఎక్కువ నీటిని నిల్వ ఉంచుతుండ‌టంతో ఆన‌క‌ట్ట‌కు ఇరువైపులా 7 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించిన మ‌ట్టి, రాళ్లు.. నీటి అల‌ల తాకిడికి దాదాపు 900 మీట‌ర్ల మేర దెబ్బ‌తిన్నది. దీంతో నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచ‌న‌ల‌కు అనుగుణంగా డ్యామ్‌కు రిపేర్లు చేయాల‌ని నీటిపారుద‌ల శాఖ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో రానున్న‌ వేసవిలో ప్రాజెక్ట్‌లోని నీటిని ఖాళీ చేసి మరమ్మతులు చేయనున్నారు.

సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్‌ కంపెనీలకు సింగూరు నీరే ప్ర‌ధాన ఆధారం. ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల‌తో ఈ నీటి స‌ర‌ఫ‌రాకు బ్రేక్ ప‌డుతుంది. దీంతో నీటి వనరులు లేక‌పోవ‌డంతో బీర్ల కంపెనీలలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం సింగూరు నుంచి బీర్ల ప‌రిశ్ర‌మ‌ల‌కు రోజుకు 44 లక్ష లీటర్ల నీటి సరఫరా అవుతున్న‌ది. ఈ పంపిణీ ఆగిపోయిన‌ట్ల‌యితే జిల్లాలోని ఫ్యాక్టరీల నుంచి 11 రాష్ట్రాలకు స‌ర‌ఫ‌రా అయ్యే బీర్లపై కూడా ప్ర‌భావం ప‌డ‌నుంది.

మ‌రోవైపు ప్ర‌స్తుతం బీర్ల ఫ్యాక్టరీలకు నామమాత్రపు ధరకే ప్ర‌భుత్వం నీటిని అందిస్తున్నది. ఇప్పుడు అధిక చార్జీలు వసూలు చేసి నీటి సరఫరా చేస్తే బీర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఒక‌వేళ ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేస్తే తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌పై మ‌రింత భారం ప‌డ‌టం ఖాయం. అయితే వేస‌వి డిమాండ్ నేప‌థ్యంలో బీర్ల ఉత్పత్తిని పెంచాల‌ని, కొర‌త లేకుండా చూడాల‌ని ఇప్ప‌టికే బ్రూవ‌రీల‌కు ప్ర‌భుత్వం సూచించింది. సింగూరు నీటి స‌ర‌ఫ‌రా నిలిచి, రాష్ట్రంలో బీర్ల కొర‌త ఏర్ప‌డితే.. మ‌ద్యం ప్రియుల‌కు మాంచి వేస‌విలో అన్‌చిల్డ్ బీర్ తాగినంత చేదుగానే ఉంటుంది ఈ న్యూస్‌..!. చూద్దాం.. ప్ర‌భుత్వం ఏం చేస్తుందో..!!

Advertisement

తాజావార్తలు

Advertisement