త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Meeting | డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి

BC Meeting | వచ్చే సంవత్సరం జనవరి నెల నుండి దేశవ్యాప్తంగా జరగనున్న జన గణనలో ఓబీసీ కాలం చేర్చి బీసీ కులాల లెక్కలు తేల్చకపోతే జనగణనను బీసీలందరూ మూకుమ్మడిగా బహిష్కరించాలని ఆలోచిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు

S

Telangana | Published On Nov 26, 2026, 6.42 pm IST

BC Meeting | డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి
Advertisement

ఓబీసీ కాలమ్ చేర్చకపోతే బిజెపిని గద్దె దింపడం ఖాయం
రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కులను కేంద్రం కాలరాస్తుంది
బీసీ కులగణ‌ను చేపట్టకపోతే ఓబీసీనని చెప్పుకునే అర్హత ప్రధానికి లేదు
బీసీ కులగణ‌న‌పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ స్పందించాలి
ఓబీసీ కాలం చేర్చకపోతే జాతీయ జనగణనను బహిష్కరిస్తాం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

BC Meeting | త్రినేత్ర న్యూస్ : వచ్చే సంవత్సరం జనవరి నెల నుండి దేశవ్యాప్తంగా జరగనున్న జన గణనలో ఓబీసీ కాలం చేర్చి బీసీ కులాల లెక్కలు తేల్చకపోతే జనగణనను బీసీలందరూ మూకుమ్మడిగా బహిష్కరించాలని ఆలోచిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు

గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో చేపట్టనున్న బీసీల జనభేరి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్ రావుతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఓబీసీ కాలం చేర్చాలని గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా బీసీలు గ‌ల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న మోడీ బీసీలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయాలని ఆలోచన కూడా చేయకపోవడం పచ్చి దుర్మార్గం అన్నారు. బీసీ కులగణ‌నలో ఓబీసీ కాలం చేర్చకపోతే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోదీ ప్రధాని కోల్పోతాడని ఆయన హెచ్చరించారు.

బీసీల ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ జరిపి ఓబీసీ కాలం చేర్పించే బాధ్యత కేంద్ర మంత్రులు తీసుకోవాలని లేని పక్షంలో వారిని రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనివ్వ‌మని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చ‌రించారు. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణ‌న‌ కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోతే దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఏకమై జాతీయ జనగణ‌న‌ను బహిష్కరించాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు మాట్లాడుతూ.. రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో మాదిరిగా ఓబీసీ కులగణ‌న‌ చేపట్టడానికి ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ ఏర్పాటు చేయాలని చట్టబద్ధమైన బీసీ లెక్కలు సేకరించిన అనంతరం జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేసన శంకర్ రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 14న రాంలీలా మైదానంలో జరగనున్న బీసీల జన భేరీకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కుర్మా, బి మని మంజరి, ఈడీగ శ్రీనివాస్ గౌడ్, రావులపాలెం నరేష్ ప్రజాపతి, మేక వెంకటేశ్వరరావు, బొలగాని వెంకట శివ గౌడ్, తారకేశ్వరి, గూడూరు భాస్కర్, ముప్పాల గోపి, బండిగారి రాజు, మహేష్ మేరు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement