Group 1 Notification | గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే గ్రూప్ 1 కు సంబంధించి మరో నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 564 గ్రూప్ 1 ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరో 250 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ 250 పోస్టుల భర్తీ కోసం పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు టీజీపీఎస్‌సీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మరో 45 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఉద్యోగాలకు ఈ నెలాఖరు లోపు కేబినేట్ ఆమోదం తెలిపితే కొత్త సంవత్సరం కానుకగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, ఆర్టీసీలో ఉద్యోగాలు 50 వేల ఉద్యోగాల్లో భాగంగా 14 వేల అంగన్‌వాడీ టీచర్లు, టీజీఎస్ఆర్టీసీలో 3500 ఉద్యోగాలు, విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్లు 5400, దేవాదాయశాఖలో 1500, 18,000 పోలీస్ కానిస్టేబుళ్లు, 4 వేల స్కూల్ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని, దానితో పాటు దేవాదాయ శాఖ, అంగన్ వాడీ టీచర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 రాసి అర్హత సాధించలేకపోయిన చాలామంది అభ్యర్థులకు మాత్రం ఇది తీపి కబురు అనే చెప్పుకోవాలి. 250 పోస్టులు కాబట్టి మరోసారి గ్రూప్ 1 పోస్ట్ సాధించే అవకాశం త్వరలో రాబోతోంది. గ్రూప్ 1 తో పాటు ఇతర డిపార్ట్‌మెంట్లలో కూడా వరుసగా నోటిఫికేషన్లు వెలువడితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా మరోసారి పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు రెడీ అవ్వనున్నారు.