త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC | టీపీసీసీ ప‌నితీరుపై మీనాక్షి ప్ర‌శంస‌లు

TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పనితీరుపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, ప్రజా ఉద్యమాలను ఆమె ప్రశంసించారు.

P

Telangana | Published On Jul 18, 2026, 3.42 pm IST

TPCC | టీపీసీసీ ప‌నితీరుపై మీనాక్షి ప్ర‌శంస‌లు
Advertisement

TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పనితీరుపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, ప్రజా ఉద్యమాలను ఆమె ప్రశంసించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్, జై బాపు–జై భీమ్, మనగేర కార్యక్రమాలు, డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాలు, ఎస్‌ఐఆర్ శిక్షణా కార్యక్రమాలు, బీఎల్‌ఏల నియామకాలు, డీసీసీ కమిటీల ఏర్పాటు, మండల కమిటీల నియామకం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కనెక్టింగ్ సెంటర్ చైర్మన్ సెంథిల్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కూడా పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర పీసీసీ కార్యాలయ బృందాన్ని అభినందించారు.

ప్రతి నెల రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణ నివేదికను రూపొందించి ఏఐసీసీకి పంపిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్షుడి కార్యాలయ ఇన్‌చార్జ్ పీ ప్రసన్న కుమార్ శర్మ సేవలను మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. జూన్ నెల కార్యాచరణ నివేదికను పరిశీలించిన అనంతరం రాష్ట్ర పార్టీ కార్యకలాపాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీఎల్‌ఏ శిక్షణా కార్యక్రమాలు, జనహిత పాదయాత్ర తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఆమె.. తెలంగాణ పీసీసీ అమలు చేస్తున్న సంస్థాగత విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో దాదాపు 11 రాష్ట్రాల నుంచి ఏఐసీసీ నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తెలంగాణ పీసీసీని అభినందించినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి బీఎల్‌ఏకు ఒక సూపర్వైజర్‌ను నియమించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తెలంగాణ పీసీసీ చేపడుతున్న కార్యక్రమాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు.

అలాగే పార్టీ కార్యాలయ సమన్వయం, కార్యాచరణ నివేదికల తయారీ, సంస్థాగత కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పీ ప్రసన్న కుమార్ శర్మను ప్రత్యేకంగా అభినందించిన మీనాక్షి నటరాజన్.. భవిష్యత్తులో సోషల్ మీడియా, కనెక్టింగ్ సెంటర్, పార్టీ సంస్థాగత కార్యక్రమాలను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గాంధీభవన్ సిబ్బంది సేవలను కూడా ఆమె అభినందించారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్ గౌడ్, ఏఐసీసీ కనెక్టింగ్ సెంటర్ చైర్మన్ సెంతిల్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పీ ప్రసన్న కుమార్ శర్మ, కొప్పుల ప్రవీణ్ కుమార్, గంప వేణుగోపాల్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement