త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil Palm | ఆ పామాయిల్ కంపెనీల జోన్ల‌ను ర‌ద్దు చేయండి..

Oil Palm | రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేద‌ని, వెంట‌నే అక్క‌డున్న‌టువంటి పామాయిల్ కంపెనీల జోన్ల‌ను ర‌ద్దు చేసి, ఆస‌క్తి క‌లిగిన ఇత‌ర కంపెనీల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఆదేశించారు.

S

Telangana | Published On Jan 22, 2026, 4.48 pm IST

Oil Palm | ఆ పామాయిల్ కంపెనీల జోన్ల‌ను ర‌ద్దు చేయండి..
Advertisement

ఆయిల్ పామ్ విస్తీర్ణ‌ణాన్ని పెంచ‌డ‌మే ప్ర‌భుత్వం ఉద్దేశం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను నియ‌మించుకోండి..
పామాయిల్ సాగుకు అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు అందిస్తాం..
50 శాతం రాయితీతో ఫర్టిలైజ‌ర్లు పంపిణీ చేస్తాం..
ప్రైవేటు సంస్థ‌ల‌కు ధీటుగా విత్త‌నాలు ఉత్ప‌త్తి చేయాలి
ఆయిల్, మార్క్ ఫెడ్, విత్త‌నోత్ప‌త్తి సంస్థ‌ల అధికారుల‌కు మంత్రి తుమ్మ‌ల కీల‌క ఆదేశాలు

Oil Palm | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేద‌ని, వెంట‌నే అక్క‌డున్న‌టువంటి పామాయిల్ కంపెనీల జోన్ల‌ను ర‌ద్దు చేసి, ఆస‌క్తి క‌లిగిన ఇత‌ర కంపెనీల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఆదేశించారు. గురువారం స‌చివాల‌యంలో టీజీ ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్త‌నోత్ప‌త్తి సంస్థ‌ల అధికారుల‌తో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల మాట్లాడుతూ.. క‌రీంన‌గ‌ర్, ఆసిఫాబాద్, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల్లో త‌మ‌కు కేటాయించిన ల‌క్ష్యాల‌ను చేరుకోక‌పోవ‌డంతో.. ప్ర‌యివేటు పామాయిల్ కంపెనీల‌కు సంబంధించిన జోన్ల ర‌ద్దును ఇప్ప‌టికే ఆయిల్ ఫెడ్ సంస్థ‌కు అప్ప‌గించిన‌ట్లు గుర్తు చేశారు. ఒకవేళ నిర్ధిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ సంస్థ కూడా విఫలమైతే ఆ సంస్థకు సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామన్నారు. ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడమే ప్రభుత్వం ఉద్దేశ్యం అని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైన తీసుకుంటామన్నారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ త్వరితగతిన విస్తరణ కోసం అవసరమైన చోట అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను చేర్చుకోవాలని ఆయిల్ ఫెడ్ ఎండీకి సూచించారు.

50 శాతం స‌బ్సిడీతో ఫ‌ర్టిలైజ‌ర్లు పంపిణీ

ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగం చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు సూచించారు. దీంతో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సాగు ఖర్చు ఆదా అవుతుందని అన్నారు. రైతులు సాగు కోసం చేసే ఖర్చును తగ్గించడానికి అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అనంతరం వచ్చే వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తులను తయారుచేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కల్లూరుగూడం, బీచుపల్లిలోని ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగులో దిగుబడి పెంచడం కోసం ఆయిల్ పామ్ రైతులకు ట్రైకోడర్మా, గానోడెర్మా నిరోధక బయో ఫర్టిలైజర్లు అయిన వీఏఎం, మెగ్నీషియం, సల్ఫర్ మొదలైన వాటిని 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర సేవల కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను పామాయిల్ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయిల్ ఫెడ్ ఎండీకి మంత్రి తుమ్మ‌ల‌ సూచించారు.

దిగుమతి సుంకం 44 శాతానికి పెంచాలి..

ఆయిల్ పామ్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పామాయిల్‌పై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకం 16.5 శాతం నుండి గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహన్, పియూష్ గోయల్‌తో పాటు ప్రధాన మంత్రి మోదీకి కూడా లేఖ రాసినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

జొన్న‌, మొక్క‌జొన్న ధాన్యాన్ని విక్ర‌యించండి..

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న ధాన్యానికి వెంటనే టెండర్లు పిలిచి అమ్మాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రొక్యూర్‌మెంట్, సీడ్ వెరైటీలు, స్టోరేజీల నిర్వహణలకు సంబంధించి ఇంకా పాత పద్ధతులనే అవలంభిస్తున్నామని, పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కేవలం మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, రైతులకు నష్టం రావొద్దనే ఉద్దేశ్యంతేనే చేస్తున్నప్పటికి, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లకుండా ఉండేలా ప్రణాళికలు తయారుచేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములలో ఎక్కువ కాలం స్టోరేజీ చేయకుండా, పంట పాడవకముందే మంచి రేటు రాగానే అమ్ముకోవాలని అన్నారు.

ప్రైవేటు సంస్థ‌ల‌కు ధీటుగా విత్త‌నాలు ఉత్ప‌త్తి చేయాలి..

విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యత కలిగిన అధిక దిగుబడి వచ్చే విత్తనాలను తయారుచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని విత్తనాభివృద్ధి సంస్థ ఎండీకి సూచించారు. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా విత్తనాభివృద్ధి సంస్థ కూడా విత్తనాలను ఉత్పత్తి చేయాలన్నారు. సీజన్‌కు ముందే రైతు సాగు చేసే విస్తీర్ణాన్ని అంచనా వేసి, అందుకు అనుగుణంగా విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు విత్తనాభివృద్ధి సంస్థ తయారుచేసే విత్తనాలనే కొనుగోలు చేసేలా వారిలో నమ్మకం కల్పించాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొవాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థల ఎండి యాస్మిన్ బాషా, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement