త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagtial | నిరీక్ష‌ణ‌కు తెర‌.. రెండు నెల‌ల త‌ర్వాత త‌ల్లిదండ్రుల చెంత‌కు మూడేండ్ల బాలుడు

Jagtial | రెండు నెల‌ల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. కడుపున పుట్టకపోయినా అల్లారుముద్డుగా పెంచుకున్న బిడ్డ దూరమవడంతో.. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది.

G

Telangana | Published On Nov 4, 2026, 8.17 am IST

Jagtial | నిరీక్ష‌ణ‌కు తెర‌.. రెండు నెల‌ల త‌ర్వాత త‌ల్లిదండ్రుల చెంత‌కు మూడేండ్ల బాలుడు
Advertisement

Jagtial | త్రినేత్ర న్యూస్‌: రెండు నెల‌ల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. కడుపున పుట్టకపోయినా అల్లారుముద్డుగా పెంచుకున్న బిడ్డ దూరమవడంతో.. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. దత్తత వివాదంతో పెంచిన తల్లిదండ్రులకు (Adoptive Parents) దూరమైన మూడేండ్ల‌ బాలుడు తిరిగి వారి ఒడికి చేరుకున్నాడు. దీంతో రెండు నెలలగా బోసిపోయిన ఆ ఇంట్లో మ‌ళ్లీ ఆనందం వెళ్లివిరిసింది.

జగిత్యాల (Jagtial) జిల్లాకు చెందిన కాసారపు సరిత, శ్రీనివాస్‌గౌడ్‌ దంపతులు మూడేండ్ల క్రితం ఐదు రోజుల వ‌య‌స్సున్న బాలుడిని హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ద‌త్త‌త తీసుకున్నారు. అప్ప‌టి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. అయితే దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా జ‌రుగ‌లేదంటూ శిశుసంక్షేమ శాఖ అధికారుల‌కు ఆగ‌స్టులో ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు రెండు నెలల క్రితం ఆ బాలుడిని క‌రీంన‌గ‌ర్‌లోని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. దీంతో బాలుడిని త‌మ‌కు అప్ప‌గించాలంటూ ఆ దంప‌తులు హైకోర్టును (High Court) ఆశ్ర‌యించారు. వారి వాద‌న‌ను విన్న న్యాయ‌స్థానం.. బాలుడిని అప్ప‌గించాలంటూ అక్టోబ‌ర్ 16న ఉత్త‌ర్వులు జారీచేసింది. అయిన‌ప్పటికీ అధికారుల జాప్యంతో బాలుడి అప్పగింత ఆలస్యమైంది. ఈ క్ర‌మంలో బాలుడిని చూసేందుకు కరీంనగర్‌లోని శిశు కేంద్రానికి వెళ్లిన వారిని చూసి ‘అమ్మా.. న‌న్ను ఇంటికి తీసుకెళ్లు.. ఇక్క‌డ భయం వేస్తోంది’ అంటూ బాలుడు ఏడ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వెల్లివిరిసిన ఆనందం..

సోమ‌వారం జ‌రిగిన ప్ర‌జావాణిలో (Prajavani) స‌రిత‌, శ్రీనివాస్ దంప‌తులు క‌లెక్ట‌ర్ స‌త్య‌ప్ర‌సాద్‌కు ఫిర్యాదు చేశారు. వారి స‌మ‌స్య‌ను విన్న క‌లెక్ట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటూ అధికారుల‌ను ఆదేశించారు. మ‌రోవైపు ఈ విష‌యం మ‌హిళా క‌మిష‌న్‌, మంత్రి సీత‌క్క (Seethakka) దృష్టికి కూడా వెళ్లింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి బాలుడిని అప్ప‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి మార్గం సుగమమైంది. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో బాలుడు తల్లిదండ్రుల వ‌ద్ద‌కు చేరాడు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. కాగా, శ్రీనివాస్ దంప‌తుల‌కు పిల్ల‌లు లేక‌పోవ‌డంతో.. వారి ఆస్తిపై క‌న్నేసిన బంధువులే శిశు సంక్షేమ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు అణుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ట్యాగ్స్:

Adoptive ParentsHigh CourtJagtialPrajavaniSeethakka
Advertisement
Advertisement