త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Water Crisis | హైదరాబాద్‌లో నీటి కొరత ఎఫెక్ట్: కాలేజీలకు ముందే దీపావళి సెలవులు.. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో భారీ రద్దీ

హైదరాబాద్‌లో నీటి ఎద్దడి కారణంగా మాదాపూర్, హైటెక్స్ పరిధిలోని కార్పొరేట్ కాలేజీలకు ముందే దీపావళి సెలవులు ఇచ్చారు. విద్యార్థులు తరలిరావడంతో మెట్రో కిక్కిరిసిపోయింది.

J

Hyderabad | Published On Nov 3, 2026, 10.04 pm IST

Hyderabad Water Crisis | హైదరాబాద్‌లో నీటి కొరత ఎఫెక్ట్: కాలేజీలకు ముందే దీపావళి సెలవులు.. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో భారీ రద్దీ

సంక్షిప్త సారాంశం

నగరంలో తీవ్రమైన నీటి కొరత తలెత్తడంతో మాదాపూర్, హైటెక్స్ పరిసరాల్లోని నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల హాస్టళ్లకు ముందే దీపావళి సెలవులు ప్రకటించారు. సెలవుల సమయంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా దీపావళి వరకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించనున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం నుంచి విద్యార్థులకు ఔటింగ్ ఇవ్వడంతో, సొంతూళ్లకు బయలుదేరిన విద్యార్థులతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఐటీ ఉద్యోగుల పీక్ అవర్స్‌కు విద్యార్థుల రద్దీ కూడా తోడవడంతో టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫారమ్‌ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Hyderabad Water Crisis | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడి కార్పొరేట్ విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, హైటెక్స్ పరిసరాల్లో ఉన్న నారాయణ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల హాస్టళ్లలో నీటి కొరత తీవ్రమవడంతో యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థులకు షెడ్యూల్ కంటే ముందే తాత్కాలికంగా దీపావళి సెలవులు ప్రకటిస్తూ సర్క్యులర్లు జారీ చేశాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వేలాది మంది విద్యార్థులు ఒకేసారి సొంతూళ్లకు బయలుదేరడంతో హైటెక్ సిటీ, మాదాపూర్ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

హాస్టళ్లలో నీటి కష్టాలు.. ఆన్‌లైన్ క్లాసులకు ఆదేశం

నగరవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభం దృష్ట్యా జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు దీపావళి వరకు తాత్కాలిక సెలవులు ఇస్తున్నట్లు నారాయణ ఐఐటీ అకాడమీ (మాదాపూర్, హైటెక్స్-1 డివిజన్లు) అధికారికంగా సర్క్యులర్ విడుదల చేసింది. వేలాది మంది విద్యార్థులు ఉండే రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అయితే విద్యార్థుల అకడమిక్ సిలబస్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పండుగ ముగిసే వరకు రోజూ ఆన్‌లైన్ విధానంలో రెగ్యులర్ క్లాసులు నిర్వహిస్తామని, విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.

హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో అనూహ్య రద్దీ

మంగళవారం సాయంత్రం నుంచే విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇళ్లకు పంపించే ప్రక్రియ (ఔటింగ్) ప్రారంభమైంది. దీంతో వందలాది మంది విద్యార్థులు బ్యాగులు, లగేజీలతో రోడ్లపైకి వచ్చారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) వైపు వెళ్లేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఫలితంగా హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పరిసరాలు విద్యార్థులతో నిండిపోయాయి.

సాయంత్రం ఐటీ కంపెనీల ఉద్యోగులు లాగౌట్ అయ్యే పీక్ అవర్స్ సమయం కావడంతో, ఈ విద్యార్థుల రాకతో మెట్రో స్టేషన్‌ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా మారింది. సెక్యూరిటీ చెకింగ్ పాయింట్లు, టికెట్ వెండింగ్ మిషన్లు, ఎస్కలేటర్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. రైళ్లలో కాలు మోపేందుకు కూడా స్థలం లేక సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కాగా, క్యాంపస్‌లు తిరిగి ఎప్పుడు తెరుస్తారనే వివరాలను దీపావళి పండుగకు ముందే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామని కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్:

Hitech City Metro RushHyderabad Metro Station CrowdHyderabad Private Colleges Online ClassesHyderabad Water CrisisMadhapur Junior College HolidaysNarayana College Diwali HolidaysSri Chaitanya Holidays Water Problem
Advertisement
Advertisement