త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Village | ఊరు ఒక‌టే.. కానీ పంచాయ‌తీలు, మండ‌లాలు, జిల్లాలు వేర్వేరు..

Village | సాధారణంగా ఒక ఊరికి (Village) ఒకే పేరు ఉంటుంది. ఆ ఊరు మొత్తం ఒకే మండలం, ఒకే జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ ఈ ఊర్ల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. చూడ్డానికి ఒకే ఊరిలా ఉన్నా.. వేర్వేరు గ్రామ పంచాయ‌తీలుగా, మండ‌లాలు, జిల్లాలుగా విడిపోయాయి.

G

Telangana | Published On Aug 10, 2026, 8.09 am IST

Village | ఊరు ఒక‌టే.. కానీ పంచాయ‌తీలు, మండ‌లాలు, జిల్లాలు వేర్వేరు..
Advertisement

Village | త్రినేత్ర‌.న్యూస్‌: సాధారణంగా ఒక ఊరికి (Village) ఒకే పేరు ఉంటుంది. ఆ ఊరు మొత్తం ఒకే మండలం, ఒకే జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ ఈ ఊర్ల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. చూడ్డానికి ఒకే ఊరిలా ఉన్నా.. వేర్వేరు గ్రామ పంచాయ‌తీలుగా, మండ‌లాలు, జిల్లాలుగా విడిపోయాయి. అవే రంగారెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లాలోని మాల్‌ (Mall), హ‌నుమ‌కొండ‌, ములుగు జిల్లాల్లోని క‌టాక్షాపూర్, మహ్మద్‌‌గౌస్‌‌పల్లి గ్రామాలు. ఇలా ఎదురెదురుగా ఇండ్లు ఉన్న‌ప్ప‌టికీ రెండు గ్రామ‌పంచాయ‌తీలుగా విడిపోయిన గ్రామాలూ ఉన్నాయి. మరోవైపు ఒకే పేరుతో ఉన్న గ్రామాలు ఉమ్మ న‌ల్ల‌గొండ జిల్లాలో ఉన్నాయి. వీట‌న్నిటి విశేషాలు తెలుసుకుందాం..

ఊరు ఒక‌టే.. కానీ జిల్లాలు వేరు..

రంగారెడ్డి జిల్లాలో నాగార్జున సాగ‌ర్ హైవేపై చిన్న టౌన్‌లా ఉంటుంది మాల్ (Mall) గ్రామ‌పంచాయ‌తీ. మొత్తం 9 వేల‌కుపైగా జ‌నాభా ఉన్న ఈ ఊరు రెండు గ్రామ‌పంచాయ‌తీలు, 2 మండలాలు, 2 జిల్లాల్లో విస్తరించి ఉంది. గ్రామంలోని కొంతభాగం రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని యాచారం మండలం మాల్‌ పంచాయతీ పరిధిలో, మిగిలిన భాగం నల్ల‌గొండ (Nalgonda) జిల్లా చింతపల్లి మండలంలోని గొడుకొండ్ల పంచాయతీ పరిధిలో ఉంది. ఈ రెండు ప్రాంతాలను మర్రిగూడ వెళ్లే రోడ్డు విభజిస్తుంది. మాల్​ గ్రామ పంచాయతీలో 12 వార్డులు, 3,639 మంది ఓటర్లు ఉన్నారు. ఇక‌ గొడుకొండ్ల పంచాయతీ పరిధిలో 14 వార్డులు 4,882 మంది ఓటర్లు ఉన్నారు.

మహ్మద్‌‌గౌస్‌‌పల్లి, క‌టాక్షాపూర్‌..

పేరుకు ఊరంతా ఒకటే. అయినా పంచాయతీ కార్యాల‌యాలు, మండలాలు, జిల్లాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. అందులో ఒక‌టి ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని మహ్మద్‌‌గౌస్‌‌పల్లి (Mohammad gousepally). మ‌రొక‌టి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్‌‌ (Katakshapur) గ్రామాలు. ఇవి చూడడానికి ఒకే గ్రామంగా కనిపించినా ఊరి మధ్యలోంచి వెళ్తున్న ఒక చిన్న బార్డ‌ర్ లైన్ వీటిని రెండు పంచాయతీలుగా విభ‌జిస్తున్న‌ది.

కటాక్షపూర్‌లో 1150 జ‌నాభా ఉండ‌గా, ఎనిమిది వార్డులు ఉన్నాయి. ఇక పక్కనే ఉన్న ములుగు జిల్లా మహ్మద్‌‌గౌస్‌‌పల్లిలో 1255 మంది జ‌నాభా ఉన్న‌ది. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉండడంతో అంతా కలిసే ఉంటారు.

ఇలాంటి ఊర్లే పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లంలో కూడా ఉన్నాయి. అవే నాగారం, క‌న్నాల గ్రామాలు. ఎదురెదురుగా ఉన్న ఈ పంచాయ‌తీల్లో నాగారంలో 2,314 మంది, క‌న్నాల‌లో 5,324 మంది జ‌నాభా ఉంది. గోదావ‌రిఖ‌ని ప్ర‌ధాన ర‌హ‌దారికి కుడివైపు నాగారం, ఎడ‌మ‌వైపు క‌న్నాల గ్రామం ఉంది.

ఒకే పేరు.. అనేక ఊర్లు..

ఒకే గ్రామం.. వేర్వేరు పంచాయ‌తీలు, మండ‌లాలు చూశాం. కానీ ఒకే పేరుతో ఏకంగా ఏడు గ్రామాలు ఉన్నాయి. వాటిలో మండ‌ల కేంద్రాలు కూడా ఉండ‌టం విశేషం. అయితే ఇవ‌న్నీ ఒకే ఉమ్మ‌డి జిల్లా ప‌రిధిలో ఉండ‌టం మ‌రో వింత‌!.. అదే తిరుమ‌ల‌గిరి (Tirumalagiri).

నల్లగొండ (Nalgonda) జిల్లాలో తిరుమ‌ల‌గిరి పేరుతో ఏకంగా నాలుగు గ్రామాలు ఉన్నాయి. తిరుమలగిరి (సాగర్) అనే పేరుతో మండల కేంద్రం ఉంది. నార్కెట్‌ప‌ల్లి మండలంలో, నాంపల్లి మండలం, దేవరకొండ నియోజకవర్గంలోని పీఏ పల్లి మండలంలో తిరుమలగిరి పేరుతో గ్రామాలు ఉన్నాయి.

ఇక సూర్యాపేట (Suryapet) జిల్లాలో చివ్వెంల మండ‌లంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తిరుమ‌లగిరి గ్రామం ఉండ‌గా, అదే పేరుతో మండల కేంద్రం ఉంది. ప్రస్తుతం అది మున్సిపాలిటీ కూడా. మ‌రోవైపు యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో కూడా తిరుమలగిరి అనే పేరుతో ఓ గ్రామం ఉంది. ఈ గ్రామానికి స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

గ్రామాల పేర్లు ఒకటే.. రాష్ట్రాలు వేరు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని అల్లిపల్లి (Allipalli) గ్రామం ఉంది. దాని పక్కనే అదే మ‌రో గ్రామం కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఉంటుంది. రెండూ పంచాయతీ కేంద్రాలే.

Advertisement
Advertisement