త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Online Education | ఆన్‌లైన్‌లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?

ఆన్‌లైన్‌లో అంతా ఫ్రీగా దొరుకుతున్నప్పుడు.. చదువుల పేరిట లక్షలు ఎందుకు ఖర్చు చేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు మనం ఫీజులు కడుతున్నది దేనికి?

J

National | Published On Aug 9, 2026, 11.00 pm IST

Free Online Education | ఆన్‌లైన్‌లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?

సంక్షిప్త సారాంశం

నేడు ఇంటర్నెట్ పుణ్యమా అని విద్య ఉచితంగా లభిస్తోంది. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు మ్యాథ్స్ నుంచి కోడింగ్ వరకు ఏదైనా నేర్చుకోవచ్చు. అంతా ఫ్రీగా ఉన్నప్పుడు.. తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు ఎందుకు పంపుతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. సమాచారాన్ని ఇవ్వడమే కాదు.. క్రమశిక్షణ, నైపుణ్యాలు, సామాజికత, సాటివారితో కలిసిపోవడం, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ స్కూళ్లే నేర్పుతాయి. భవిష్యత్తులో స్కూళ్లు కేవలం పాఠాలు చెప్పే కేంద్రాలుగా కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్, హైబ్రిడ్ లెర్నింగ్‌ (Hybrid learning) పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Free Online Education | త్రినేత్ర.న్యూస్ : భారతీయ తల్లిదండ్రులకు (Indian parents) ఇప్పుడు చదువు అంటే కేవలం నెలవారీ స్కూల్ ఫీజు మాత్రమే కాదు. ట్యూషన్, బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్‌పోర్ట్, కోచింగ్, ఎక్స్‌ట్రా క్లాసులు... ఆ తర్వాత కాలేజీ. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల కోసం (job-ready) అదనపు ఖర్చు. ఇలా చదువుల ఖర్చు తడిసి మోపెడవుతోంది.

కానీ, ఈ రోజుల్లో ఓ పిల్లాడు మ్యాథ్స్, కోడింగ్, లాంగ్వేజెస్, సైన్స్, ప్రోగ్రామింగ్, చివరికి యూనివర్సిటీ స్థాయి సబ్జెక్టులను కూడా మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఇందులో చాలా వరకు కంటెంట్ ఇంటర్నెట్‌లో ఫ్రీగానే దొరుకుతుంది. అంతా ఉచితంగా లభిస్తుంటే... చదువు మాత్రం ఎందుకు ఖరీదవుతోంది? ఇదో పెద్ద ఐరనీ! అసలు తల్లిదండ్రులు దేనికోసం ఇంతలా డబ్బులు కడుతున్నారు?

నిజంగా మనం డబ్బులు కడుతున్నది దేనికి?

స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన (Pawan Kumar Chandana) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అన్నీ అందుబాటులో ఉన్నాయి, కాబట్టి చదువు ప్రాక్టికల్‌గా ఫ్రీ అయిపోయింది" అన్నారు. ఇక స్పేస్‌ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ (Elon Musk) అయితే.. కాలేజీలు అంటే నేర్చుకునే ప్రదేశాలు కావని.. అవి కేవలం 'ఫన్' కోసమేనని తేల్చేశారు. విద్యార్థులు తమ బాధ్యతలను పూర్తి చేయగలరని నిరూపించుకోవడానికే కాలేజీలు ఉపయోగపడతాయన్నారు. చాలా వరకు పీహెచ్‌డీ రీసెర్చ్ పేపర్లు పనికిరానివని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కామెంట్స్ వినడానికి కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా అనిపించినా, ఇందులో ఒక వాలిడ్ పాయింట్ ఉంది. సమాచారం ఫ్రీగా దొరుకుతున్నప్పుడు.. ఫార్మల్ ఎడ్యుకేషన్‌కు ఎందుకింత ఖర్చవుతోంది? అసలు విద్యావ్యవస్థ (traditional education system).. పిల్లలకు భవిష్యత్తులో నిజంగా అవసరమైన స్కిల్స్ నేర్పుతోందా?

కంటెంట్ ఉచితం.. కానీ మార్గదర్శకత్వం?

ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్, ప్రాంతం, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇంటర్నెట్ ఆ సమీకరణాలను మార్చేసింది. యూట్యూబ్, ఎన్‌పీటీఈఎల్ (NPTEL), స్వయం (SWAYAM), దీక్ష (DIKSHA), పీఎం ఈ-విద్య (PM eVIDYA) లాంటి ఎన్నో ప్లాట్‌ఫామ్స్ ద్వారా అత్యుత్తమ కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వేల సంఖ్యలో స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (Atal Tinkering Labs) రోబోటిక్స్, 3D ప్రింటర్స్ లాంటివి తీసుకొచ్చాయి.

కానీ సమస్య ఎక్కడంటే.. ఆ సమాచారాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి వీడియో చూసినంత మాత్రాన దాన్ని ఉపయోగించి ఏమైనా తయారు చేయగలుగుతారా? కోడింగ్ ట్యుటోరియల్స్ చూసినంత మాత్రాన ప్రోగ్రామర్ (Programmer) అయిపోలేరు కదా.

స్కూళ్లు ఎందుకు ముఖ్యం?

కంటెంట్ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు.. కేవలం సమాచారాన్ని ఇవ్వడమే స్కూళ్ల పని కాకూడదు. ఒక విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో టీచర్ గుర్తించగలరు. తోటి విద్యార్థులతో కలిసి ఎలా పనిచేయాలో స్కూల్ వాతావరణం నేర్పుతుంది. క్రమశిక్షణ, కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ (social skills) నేర్పించడం స్కూళ్ల వల్లనే సాధ్యమవుతుంది.

టీచ్ ఫర్ ఇండియా (Teach For India) ప్రతినిధి అశ్వంత్ భరత్ (Ashwath Bharath) ఏమంటారంటే.. దయ గురించి యూట్యూబ్‌లో వీడియో చూసిన పిల్లాడు.. స్కూల్‌లో తోటి పిల్లాడిని ఏడిపించవచ్చు. ఇలాంటివి యూట్యూబ్ వీడియోలు పరిష్కరించలేవు. అందరితో కలిసిమెలిసి ఉండటం స్కూల్ మాత్రమే నేర్పగలదు.

డిగ్రీనా? స్కిల్సా?

భారతదేశంలో ఇప్పటికీ సర్టిఫికెట్లకు, డిగ్రీలకు చాలా విలువ ఉంది. కానీ మన విద్యావ్యవస్థ ఎక్కువగా పరీక్షల (exam-driven) చుట్టూ తిరుగుతోంది. విద్యార్థులు కేవలం మార్కుల కోసమే చదువుతున్నారు. కానీ కంపెనీలకు కావాల్సింది అది కాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, డిజిటల్ స్కిల్స్, కొత్తవి నేర్చుకునే ఆసక్తి ఉన్నవారే వారికి కావాలి. అందుకే "డిగ్రీకి తోడు స్కిల్స్ (degree plus skills)" అనేది ఇప్పటి అవసరం.

హైబ్రిడ్ లెర్నింగ్.. ఇదే ఫ్యూచర్

కంటెంట్ ఫ్రీగా ఉన్నంత మాత్రాన అందరూ హోమ్‌స్కూలింగ్ (Homeschooling) వైపు వెళ్తారనుకోలేం. దానికి చాలా సమయం, గైడెన్స్ అవసరం. అందుకే భవిష్యత్తు 'హైబ్రిడ్ లెర్నింగ్' (Hybrid learning) దే అని నిపుణులు భావిస్తున్నారు. పిల్లాడు ఉదయం స్కూల్‌కి వెళ్తాడు.. మిగతా టైమ్‌లో ఆన్‌లైన్‌లో కోడింగ్, లాంగ్వేజెస్ నేర్చుకుంటాడు. ఈ మోడల్ మన దేశానికి బాగా సూట్ అవుతుంది.

సమాచారం ఉచితమైనప్పుడు.. "మీ పిల్లాడికి మేము ఏ సమాచారం ఇవ్వగలం?" అనే ప్రశ్నను స్కూళ్లు ఇకపై అడగకూడదు. "మీ పిల్లాడిని ఎలా తీర్చిదిద్దగలం?" అన్నదానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే స్కూల్ ఫీజుల రూపంలో తాము కడుతున్న లక్షల రూపాయలకు సరైన విలువ దక్కిందని తల్లిదండ్రులు భావిస్తారు.

Advertisement
Advertisement