త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengal Tea Farmer Abducted | బెంగాల్ సరిహద్దుల్లో కలకలం: పొలంలో ఉన్న రైతన్నను కంచె దాటించి ఎత్తుకెళ్లిన బంగ్లాదేశీయులు

పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో దారుణం జరిగింది. పొలంలో ఒంటరిగా పురుగుల మందు పిచికారీ చేస్తున్న భారతీయ రైతన్నను బంగ్లాదేశ్ దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లారు.

J

Crime | Published On Aug 9, 2026, 10.00 pm IST

Bengal Tea Farmer Abducted | బెంగాల్ సరిహద్దుల్లో కలకలం: పొలంలో ఉన్న రైతన్నను కంచె దాటించి ఎత్తుకెళ్లిన బంగ్లాదేశీయులు
Advertisement
  • పశ్చిమ బెంగాల్‌ జల్పైగురి జిల్లాలో పొలానికి వెళ్లిన దీపాంకర్ గోపే (35) అనే టీ రైతు కిడ్నాప్
  • సరిహద్దు కంచె దాటి వచ్చిన సుమారు 20 మంది బంగ్లాదేశ్ దుండగులు అతన్ని బలవంతంగా ఎత్తుకెళ్లారు
  • ఇటీవల ఓ బంగ్లాదేశీ చొరబాటుదారుడిని గ్రామస్తులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పట్టుకోవడమే ఈ కిడ్నాప్‌నకు కారణమని అనుమానాలు
  • భారతీయ రైతును విడిపించేందుకు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)తో బీఎస్‌ఎఫ్ (BSF) అధికారుల చర్చలు

Bengal Tea Farmer Abducted | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) సరిహద్దుల్లో దారుణం చోటుచేసుకుంది. జల్పైగురి జిల్లాకు చెందిన ఓ టీ రైతును బంగ్లాదేశీయులు ఏకంగా మన దేశ సరిహద్దులు దాటి వచ్చి మరీ కిడ్నాప్ చేశారు. ఉదయం తన పొలంలో పని చేసుకుంటున్న ఆ రైతన్నను సుమారు 20 మంది దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.

అసలేం జరిగిందంటే?

రాజ్‌గంజ్ బ్లాక్ పరిధిలోని కుకుర్జన్ (Kukurjan) ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చౌల్‌హతి సరిహద్దు గ్రామంలోని తసర్ పారాకు చెందిన 35 ఏళ్ల దీపాంకర్ గోపే.. శనివారం ఉదయం ఇంటర్నేషనల్ బోర్డర్ ఫెన్సింగ్ (Border fencing) అవతల ఉన్న తన ఆరు బిగాల టీ తోటలో పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. అతను తోటలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సుమారు 20 మంది బంగ్లాదేశ్ దుండగులు.. అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చారు. దీపాంకర్‌తో కాసేపు పెనుగులాడి, ఆపై అతన్ని బలవంతంగా బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ (Panchagarh) జిల్లాలోకి ఎత్తుకెళ్లారు.

పగ తీర్చుకునేందుకేనా?

అయితే, ఈ కిడ్నాప్ వెనుక పక్కా స్కెచ్ ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆగస్టు 6న ఓ బంగ్లాదేశ్ జాతీయుడు ముళ్ల కంచెను కత్తిరించి ఇండియాలోకి చొరబడేందుకు (Infiltration attempt) ప్రయత్నించాడు. అప్రమత్తమైన గ్రామస్తులు, బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్ల సాయంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఆ వ్యక్తికి క్రాస్-బోర్డర్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. తమ వాడిని పట్టుకున్నారనే కోపంతో, పగ తీర్చుకునేందుకే బంగ్లాదేశీయులు ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కస్టడీలోనే రైతన్న..

ఈ ఘటనతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యం కంచె సమీపంలోని పొలాలకు, టీ తోటలకు పనుల కోసం వెళ్లే తమ భద్రతకు గ్యారెంటీ ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నాప్ విషయం తెలియగానే హుటాహుటిన రంగంలోకి దిగిన బీఎస్‌ఎఫ్ అధికారులు.. దీపాంకర్‌ను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) అధికారులతో ఫ్లాగ్ మీటింగ్ (Flag meeting) నిర్వహించారు. అయితే, రాత్రి వరకు కూడా మన రైతును వారు విడిచిపెట్టలేదని, ప్రస్తుతం అతను బీజీబీ కస్టడీలోనే ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement