త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మొన్న సంచార్ సాథి యాప్‌.. ఇప్పుడు లొకేష‌న్ ట్రాకింగ్‌.. ప్ర‌జ‌ల‌పై ఎందుకీ బ‌ల‌వంత‌పు నిఘా..? అవ‌స‌ర‌మా..?

S

Technology | Published On Dec 6, 2025, 3.18 pm IST

మొన్న సంచార్ సాథి యాప్‌.. ఇప్పుడు లొకేష‌న్ ట్రాకింగ్‌.. ప్ర‌జ‌ల‌పై ఎందుకీ బ‌ల‌వంత‌పు నిఘా..? అవ‌స‌ర‌మా..?
Advertisement

దేశంలోని ప్ర‌జ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంత‌పు నిఘా పెట్టాల‌ని చూస్తున్న‌దా..? దేశంలోని ప్ర‌తి పౌరుడు ఏం చేస్తున్నాడు, ఎక్క‌డ ఉన్నాడు.. వంటి వివ‌రాల‌ను పిన్ పాయింట్ లొకేష‌న్‌తో స‌హా తెలుసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చూస్తున్న‌దా..? మొన్న సంచార్ సాథి యాప్‌ను తెచ్చారు. విమ‌ర్శ‌లు రావ‌డంతో విర‌మించుకున్నారు. ఇప్పుడు ఆల్వేస్ ఆన్ స్మార్ట్ ఫోన్ లొకేష‌న్ ట్రాకింగ్ ను తేవాల‌ని చూస్తున్నారు.. దీంతో ప్ర‌జ‌ల‌ను రోజుకు 24 గంట‌లూ నిఘా చ‌ట్రంలో బంధించాల‌ని చూస్తున్నారా..? అంటే.. అందుకు అవుననే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఈ బ‌ల‌వంత‌పు విధానాల‌కు ఎందుకు పాల్ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు, నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విధానాల ప‌ట్ల‌ ప్ర‌ముఖ టెక్ సంస్థ‌లైన గూగుల్‌, శాంసంగ్‌, యాపిల్ కూడా విముఖ‌తను వ్యక్తం చేస్తుండ‌డం కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నిస్తోంది.

మ‌రో విధంగా నిఘా..?

దేశంలో ఉన్న పౌరుల స్మార్ట్ ఫోన్ల‌కు భ‌ద్ర‌త‌ను అందించేందుకు, వారు పోగొట్టుకున్న ఫోన్ల‌ను రిక‌వ‌రీ చేసేందుకు, ఒక వ్య‌క్తి పేరు మీద ఎన్ని సిమ్ క‌నెక్ష‌న్లు ఉన్నాయో చెక్ చేసుకునేందుకు గాను సంచార్ సాథి యాప్ ప‌నిచేస్తుంద‌ని చెప్పి ఆ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఈ యాప్‌ను క‌చ్చితంగా అన్ని ఫోన్ల‌లోనూ ప్రీ లోడెడ్‌గా అందించాల‌ని, ఆ యాప్ ను డిసేబుల్ లేదా డిలీట్ చేసే అవ‌కాశం కూడా యూజ‌ర్ల‌కు ఉండొద్ద‌ని ఆదేశిస్తూ స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీల‌కు కేంద్రం 90 రోజుల గడువు ఇచ్చింది. అయితే అన్ని వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డం, పౌరుల ప్రైవ‌సీకి భంగం క‌లిగే అవ‌కాశం ఉంద‌న్న స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీల వాద‌న‌ల‌కు కేంద్రం దిగి వ‌చ్చి ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. ఈ యాప్‌ను అవ‌స‌రం లేద‌నుకుంటే యూజ‌ర్లు డిలీట్ లేదా డిసేబుల్ చేసుకోవ‌చ్చ‌ని, దీన్ని ప్రీలోడెడ్‌గా అందించ‌బోమ‌ని కేంద్రం స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. అయితే ఇప్పుడు మ‌రో విధంగా పౌరుల‌పై 24 గంట‌లూ నిఘా పెట్టేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది.

క‌చ్చిత‌మైన లొకేష‌న్ ట్రాకింగ్‌..

స్మార్ట్ ఫోన్ల‌లో ఉండే లొకేష‌న్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించి నేర‌స్థుల ఫోన్ల‌ను క‌చ్చిత‌మైన లొకేష‌న్‌తో ట్రాక్ చేసి వారిని ప‌ట్టుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఫోన్ల‌లో ఆల్వేస్ ఆన్ స్మార్ట్ ఫోన్ లొకేష‌న్ ట్రాకింగ్ అనే ఫీచ‌ర్‌ను బ‌ల‌వంతంగా తెచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీనిపై ఇప్ప‌టికే టెలికాం కంపెనీల‌ను కేంద్రం వివ‌ర‌ణ అడ‌గ్గా వారు ఫోన్ల‌ను క‌చ్చిత‌మైన లొకేష‌న్‌తో ట్రాక్ చేయాలంటే ఫోన్ల‌లో లొకేష‌న్ ఎల్ల‌ప్పుడూ ఆన్‌లో ఉండాల‌ని, దాన్ని యూజ‌ర్లు ఆఫ్ లేదా డిసేబుల్ చేసే వీలు ఉండ‌కూడ‌ద‌ని, అలా అయితేనే ఫోన్ల‌ను క‌చ్చిత‌మైన లొకేష‌న్‌తో ట్రాక్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపాయి. ఇందుకు గాను ఎ-జీపీఎస్ అనే టెక్నాల‌జీని వాడాల్సి ఉంటుంద‌ని, అయితే దీనికి స్మార్ట్ ఫోన్ త‌యారీదారుల స‌హకారం కూడా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీ ద్వారా ఒక ఫోన్ ఏ సెల్ ట‌వ‌ర్ ప‌రిధిలో ఉంది అనే విష‌యాన్ని మాత్ర‌మే తెలుసుకోవ‌చ్చ‌ని, కానీ ఒక ఫోన్ లొకేష‌న్ మీట‌ర్ల‌తో స‌హా క‌చ్చితంగా ఎక్క‌డ ఉంది అనే విష‌యం తెలియాలంటే ఎ-జీపీఎస్ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నాయి.

ఫోన్ల త‌యారీ సంస్థ‌లు ఏమంటున్నాయి..?

అయితే ఎ-జీపీఎస్ ఫీచ‌ర్‌ను అందించాలంటే స్మార్ట్ ఫోన్ త‌యారీదారులు ఫోన్ ఆపరేటింగ్ సిస్ట‌మ్‌ను భార‌త యూజ‌ర్ల‌కు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. వాస్త‌వానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలా కేవ‌లం ఒక దేశానికే ప‌రిమితం అయ్యేలా ఏ ఫోన్ త‌యారీ సంస్థ కూడా ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌ను రూపొందించ‌డం లేదు. క‌నుక ఇది ఆచ‌ర‌ణలో సాధ్యం కాద‌ని స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ‌లు చెబుతున్నాయి. ముఖ్యంగా గూగుల్‌, యాపిల్ వంటి టెక్ సంస్థ‌లు ఇలా ఒక దేశానికి అనుగుణంగా ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను మార్చి ఇవ్వ‌లేమ‌ని అంటున్నాయి. అలాగే ఆల్వేస్ ఆన్ స్మార్ట్ ఫోన్ లొకేష‌న్ ట్రాకింగ్ అనే ఫీచ‌ర్ వ‌ల్ల యూజ‌ర్ల ప్రైవ‌సీకి భంగం క‌లుగుతుంద‌ని చెబుతున్నాయి. దీని వ‌ల్ల సైబ‌ర్ క్రిమిన‌ల్స్ మ‌రింత సుల‌భంగా యూజ‌ర్ల‌పై దాడులు చేసే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నాయి. అలాగే స‌మాజంలో జ‌ర్న‌లిస్టులు, సైంటిస్టులు, రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, ఉన్న‌త స్థానాల్లో ఉన్న‌వారి లొకేష‌న్లు సుల‌భంగా తెలిసిపోతాయ‌ని, దీన్ని సైబర్ క్రిమిన‌ల్స్ ఆస‌ర‌గా చేసుకుని దాడులు, మోసాల‌కు పాల్ప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

త్వ‌ర‌లో నిర్ణ‌యం..?

ఇక కేవ‌లం నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవాల‌నే ఒక సాకు చూపి కేంద్రం ఇలా ప్ర‌జ‌ల‌పై 24 గంట‌లూ నిఘా పెట్టాల‌ని చూస్తుండ‌డం వెనుక ఉన్న ఉద్దేశ‌మేమిటో అంతుబట్ట‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలకు చెందిన నాయ‌కులు ఆరోపిస్తున్నారు. దీని వ‌ల్ల దేశంలోని పౌరుల భ‌ద్ర‌త‌, ప్రైవ‌సీకి తీవ్ర ముప్పు పొంచి ఉంద‌ని పేర్కొంటున్నారు. అయితే కేంద్రం దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. త్వ‌ర‌లోనే స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ‌లు, టెలికాం ఆప‌రేట‌ర్ల‌తో క‌లిసి ఓ స‌మావేశం నిర్వ‌హించి దీనిపై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement