త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sleep Mode | ల్యాప్ టాప్‌లో ఉండే స్లీప్ మోడ్ ఫీచ‌ర్ అంటే ఏమిటి..? దీన్ని ఎలా వాడాలి..?

Sleep Mode | ల్యాప్‌టాప్ వినియోగంలో లేనప్పుడు విద్యుత్‌ను ఆదా చేయడానికి రూపొందించిన ముఖ్యమైన ఫీచర్లలో స్లీప్ మోడ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఆప్షన్‌ను రోజూ ఉపయోగిస్తున్నారు.

S

Technology | Published On Feb 9, 2026, 6.37 am IST

Sleep Mode | ల్యాప్ టాప్‌లో ఉండే స్లీప్ మోడ్ ఫీచ‌ర్ అంటే ఏమిటి..? దీన్ని ఎలా వాడాలి..?
Advertisement

Sleep Mode | ల్యాప్‌టాప్ వినియోగంలో లేనప్పుడు విద్యుత్‌ను ఆదా చేయడానికి రూపొందించిన ముఖ్యమైన ఫీచర్లలో స్లీప్ మోడ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఆప్షన్‌ను రోజూ ఉపయోగిస్తున్నారు. అయితే స్లీప్ మోడ్‌లో ల్యాప్‌టాప్ నిజంగా ఎంత విద్యుత్ వినియోగిస్తుంది? దీనిని తరచూ ఉపయోగించడం వల్ల ల్యాప్‌టాప్ హెల్త్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా? అన్న సందేహాలకు నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌ను స్లీప్ మోడ్‌లో పెట్టినప్పుడు, దాని ప్రధాన భాగాలు చాలా వరకు ఆఫ్ అవుతాయి లేదా అతి తక్కువ విద్యుత్ వినియోగించే స్థితికి మారుతాయి. స్క్రీన్ పూర్తిగా ఆఫ్ అవుతుంది, ప్రాసెసర్ యాక్టివ్ పనులను నిలిపివేస్తుంది, హార్డ్‌డిస్క్ లేదా ఎస్‌ఎస్‌డీ పని చేయకుండా ఉంటుంది. అయితే మీరు చేసిన పని వెంటనే తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన మెమరీని నిలుపుకోవడానికి మాత్రమే ల్యాప్‌టాప్ స్వల్పంగా విద్యుత్‌ను వినియోగిస్తుంది.

ఎంతో స‌మ‌యం ఆదా..

సాధారణంగా స్లీప్ మోడ్‌లో ఉన్న ల్యాప్‌టాప్ 0.5 నుంచి 2 వాట్ల వరకు మాత్రమే విద్యుత్ ఖర్చు చేస్తుంది. ఇది సాధారణ వినియోగంతో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా ఒక ల్యాప్‌టాప్ పని చేస్తున్నప్పుడు 20 నుంచి 60 వాట్ల వరకు విద్యుత్ ను వినియోగిస్తుంది. రాత్రంతా స్లీప్ మోడ్‌లో ఉంచినా ఖర్చయ్యే విద్యుత్ చాలా స్వల్పంగా ఉండి బిల్‌లో పెద్దగా కనిపించదు. ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేస్తే విద్యుత్ వినియోగం పూర్తిగా ఆగిపోతుంది. అయితే స్లీప్ మోడ్ ప్రధాన లాభం సౌలభ్యం, సిస్టమ్‌ను మళ్లీ ఆన్ చేయడానికి బూట్ అవ్వాల్సిన అవసరం లేకుండా, వెంటనే పని కొనసాగించవచ్చు. చిన్న విరామాలు లేదా రాత్రి పూట గ్యాప్ తీసుకుని ఉద‌యాన్నే ప‌నిని ప్రారంభించాల‌నుకునే వారికి, ఒక చోట ఆపిన ప‌నిని మ‌ళ్లీ అక్క‌డి నుంచే కొన‌సాగించ‌డానికి ల్యాప్ టాప్‌ల‌లో ఉండే స్లీప్ మోడ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల ల్యాప్ టాప్ బూట్ అయి మళ్లీ సాఫ్ట్ వేర్‌లు అన్నింటినీ ఓపెన్ చేసి తిరిగి ప‌ని ప్రారంభం అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిన ప‌ని ఉండ‌దు. దీంతో క‌నీసం 10 నుంచి 15 నిమిషాల వ‌ర‌కు స‌మ‌యం ఆదా అవుతుంది. పైగా ల్యాప్ టాప్ స్లీప్ మోడ్‌లో ఉన్న‌ప్పుడు అతి త‌క్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది. క‌నుక నిరభ్యంతరంగా ల్యాప్ టాప్‌ను స్లీప్ మోడ్‌లో పెట్ట‌వ‌చ్చు.

ఎలాంటి న‌ష్టం ఉండ‌దు..

నిత్యం స్లీప్ మోడ్ వాడటం వల్ల ల్యాప్‌టాప్‌కు ఎలాంటి నష్టం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్‌లు, హార్డ్‌వేర్‌లు స్లీప్-యాక్టివ్ మార్పులను సులభంగా తట్టుకునేలా రూపొందించబడ్డాయి. స్లీప్ మోడ్ వలన వేడి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఫ్యాన్లు, ప్రాసెసర్ వంటి భాగాలపై ఒత్తిడి తగ్గి, వాటి లైఫ్‌ పెరగడానికి కూడా ఇది సహాయపడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటరీ ఆరోగ్యంపై కూడా స్లీప్ మోడ్ ప్రతికూల ప్రభావం చూపదు. విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండటంతో బ్యాటరీ నెమ్మదిగా మాత్రమే ఖాళీ అవుతుంది. అయితే, ల్యాప్‌టాప్‌ను ఎన్నో రోజుల పాటు ఛార్జ్ చేయకుండా స్లీప్ మోడ్‌లోనే ఉంచితే బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బ్యాటరీకి మంచిది కాదు. క‌నుక ఎక్కువ కాలం పాటు ల్యాప్ టాప్‌ను వాడ‌క‌పోతే స్లీప్ మోడ్‌లో పెట్ట‌కూడ‌దు. క‌చ్చితంగా ష‌ట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. రోజువారి అవ‌స‌రాల‌కు లేదా చిన్న చిన్న విరామాల‌కు మాత్ర‌మే స్లీప్ మోడ్‌ను ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది.

ఇలా అయితే స్లీప్ మోడ్ వాడ‌కూడ‌దు..

ల్యాప్‌టాప్‌ను కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించకపోతే, స్లీప్ మోడ్‌కన్నా షట్‌డౌన్ చేయడం మంచిది. అలాగే, పెద్ద సిస్టమ్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు లేదా సిస్టమ్ స్లోగా ఉన్నప్పుడు రీస్టార్ట్ చేయడం ద్వారా తాత్కాలిక ఫైళ్లు తొలగిపోయి పనితీరు మెరుగవుతుంది. స్లీప్ మోడ్ చాలా తక్కువ విద్యుత్ ను వినియోగిస్తుంది, ల్యాప్‌టాప్ హెల్త్‌కి ఇది సురక్షితమే. ఇది ఎనర్జీని ఆదా చేస్తుంది, హార్డ్‌వేర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది, పని వెంటనే కొనసాగించేందుకు సహాయపడుతుంది. అందుకే రోజువారీ వినియోగంలో స్లీప్ మోడ్ ను క‌చ్చితంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇందులో ఆందోళ‌న లేదా అనుమానాల‌కు గుర‌వ్వాల్సిన ప‌నిలేదు.

Advertisement
Advertisement