త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anthropic | ఆంథ్రోపిక్ ఏఐపై అమెరికా షాకింగ్ నిర్ణయం.. విదేశీయులకు యాక్సెస్ బ్లాక్..

Anthropic | అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటైన ఆంత్రోపిక్ తన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లైన మైథోస్ 5, ఫేబుల్ 5 వినియోగాన్ని విదేశీ పౌరులకు నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించింది.

S

Technology | Published On Jun 13, 2026, 2.50 pm IST

Anthropic | ఆంథ్రోపిక్ ఏఐపై అమెరికా షాకింగ్ నిర్ణయం.. విదేశీయులకు యాక్సెస్ బ్లాక్..
Advertisement

Anthropic | అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటైన ఆంత్రోపిక్ తన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లైన మైథోస్ 5, ఫేబుల్ 5 వినియోగాన్ని విదేశీ పౌరులకు నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతోపాటు కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది విదేశీ ఉద్యోగులపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రధానంగా అధునాతన కంప్యూటర్ చిప్‌లు వంటి భౌతిక సాంకేతికతల ఎగుమతులను నియంత్రించేవి. అయితే ఈసారి లక్ష్యం సాఫ్ట్‌వేర్. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఏఐ వ్యవస్థల వినియోగంపైనే పరిమితులు విధించడం విశేషంగా మారింది.

విదేశీయులు ఈ మోడ‌ల్స్‌ను వాడలేరు..

అంథ్రోపిక్ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మైథోస్ 5, ఫేబుల్ 5 మోడళ్లకు విదేశీ పౌరుల యాక్సెస్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా వెలుపల ఉన్న వినియోగదారులు ఈ మోడళ్లను ఉపయోగించలేరు. అలాగే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలకు చెందిన ఉద్యోగులు కూడా ఈ సాంకేతికతను వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని అంథ్రోపిక్ బహిరంగంగా విమర్శించింది. ప్రమాదాలను ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని, యాక్సెస్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయన్న దానిపై అమెరికా వాణిజ్య శాఖ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది మైథోస్ 5. సాధారణంగా చాట్‌బాట్‌లు రచన, కోడింగ్, పరిశోధన వంటి పనులకు ఉపయోగపడుతుంటే, మైథోస్ 5 సైబర్ సెక్యూరిటీ రంగంలో అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

సైబ‌ర్ దాడుల కోసం ఉప‌యోగిస్తే..?

కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోని బలహీనతలను గుర్తించే విషయంలో ఈ మోడల్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అంథ్రోపిక్ స్వయంగా పేర్కొంది. అందుకే మొదట్లో కీలక మౌలిక సదుపాయాల భద్రతకు బాధ్యత వహించే కొద్దిమంది సంస్థలకు మాత్రమే దీని యాక్సెస్ ఇచ్చింది. హ్యాకర్లు దుర్వినియోగం చేయకముందే భద్రతా లోపాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. అయితే ఇదే సామర్థ్యం అమెరికా అధికారుల్లో ఆందోళనకు కారణమైంది. ఒక ఏఐ వ్యవస్థ భద్రతా లోపాలను అత్యంత సమర్థవంతంగా గుర్తించగలిగితే, అదే సాంకేతికతను రక్షణ కోసం మాత్రమే కాకుండా దాడుల కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉందనే భయం వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా అధునాతన ఏఐ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించాలనే ఆందోళనలు అమెరికా విధాన నిర్ణేతల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనాకు అధునాతన సెమీకండక్టర్ల ఎగుమతులపై పరిమితులు విధించడం వంటి చర్యలు చేపట్టారు.

పూర్తిగా నిరోధించ‌డం స‌రికాదు..

అయితే తాజా నిర్ణయం మరింత ముందుకెళ్లింది. ఏఐ నిర్మాణానికి అవసరమైన హార్డ్‌వేర్‌ను కాకుండా, నేరుగా ఏఐ ఉత్పత్తిని ఎవరు ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదనే అంశాన్ని ప్రభుత్వం నియంత్రిస్తోంది. భవిష్యత్తులో అధునాతన ఏఐ మోడళ్లను సున్నితమైన సైనిక సాంకేతికతలతో సమానంగా పరిగణిస్తే, వాటి పంపిణీ, వినియోగదారుల అర్హతలు, అమలు చేసే ప్రాంతాలపై మరింత కఠిన నియంత్రణలు వచ్చే అవకాశముంది. ఈ నిర్ణయం పరిశోధకులు, విధాన నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరి అభిప్రాయం ప్రకారం, సైబర్ భద్రత నిపుణులు నెట్‌వర్క్‌లను రక్షించేందుకు ఉపయోగించే సాంకేతికతను హ్యాకర్లు కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ, దాన్ని పూర్తిగా నిరోధించడం సరైన పరిష్కారం కాదని భావిస్తున్నారు. మరోవైపు, ఓపెన్ ఏఐ వంటి ఇతర సంస్థలు కూడా సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు కలిగిన ఏఐ సాధనాలను విడుదల చేసినప్పటికీ, ఇలాంటి ఆంక్షలు ఎదుర్కోలేదని కొందరు గుర్తుచేస్తున్నారు.

భ‌విష్య‌త్తుకు ఇది సూచ‌నా..?

అమెరికాకు చెందిన మాజీ సాంకేతిక, సైబర్ భద్రతా అధికారులు కూడా ఈ నిర్ణయాన్ని అసాధారణంగా విస్తృతమైనదిగా, సమర్థించడం కష్టమైన చర్యగా అభివర్ణించారు. తక్షణ ప్రభావం అంథ్రోపిక్, దాని వినియోగదారులపై పడుతోంది. అయితే ఇది ఒక్కసారి తీసుకున్న నిర్ణయమా లేదా భవిష్యత్తులో అమలు కానున్న కొత్త నియంత్రణ విధానానికి ప్రారంభమా అన్నదే కీల‌కంగా మారింది. అమెరికా ప్రభుత్వం కొన్ని ఏఐ మోడళ్లు స్వేచ్ఛగా పంపిణీ చేయడానికి చాలా శక్తివంతమైనవిగా భావిస్తే, భవిష్యత్తులో ఇతర ఏఐ కంపెనీలు కూడా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏఐ పరిశ్రమ చరిత్రలో కీలక మలుపుగా మారనుంది. ఇప్పటి వరకు కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో ఏం చేయగలదనే చర్చ ఎక్కువగా సాగింది. అయితే అంథ్రోపిక్ ఘటన ద్వారా కొన్ని ఏఐ వ్యవస్థలు ఇప్పటికే అమెరికా లాంటి దేశాల ప్ర‌భుత్వాల‌కే ఆందోళన క‌లిగిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో అస‌లు ఏం జ‌రగ‌నుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement