త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Android Malware | డిలీట్ చేసినా మళ్లీ వస్తున్న ఆండ్రాయిడ్ మాల్‌వేర్.. ఫోన్ యూజర్లకు కొత్త ముప్పు..

Android Malware | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మాల్‌వేర్ వేరియంట్ సైబర్ భద్రత నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా హానికర యాప్‌లు డిలీట్ చేసిన తర్వాత తొలగిపోతాయి. అయితే ఈ కొత్త మాల్‌వేర్ మాత్రం ఒకసారి ఫోన్‌లోకి ప్రవేశించిన తర్వాత మళ్లీ తిరిగి ఇన్‌స్టాల్ అవుతూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతోంది.

S

Technology | Published On Jun 22, 2026, 4.15 pm IST

Android Malware | డిలీట్ చేసినా మళ్లీ వస్తున్న ఆండ్రాయిడ్ మాల్‌వేర్.. ఫోన్ యూజర్లకు కొత్త ముప్పు..
Advertisement

Android Malware | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మాల్‌వేర్ వేరియంట్ సైబర్ భద్రత నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా హానికర యాప్‌లు డిలీట్ చేసిన తర్వాత తొలగిపోతాయి. అయితే ఈ కొత్త మాల్‌వేర్ మాత్రం ఒకసారి ఫోన్‌లోకి ప్రవేశించిన తర్వాత మళ్లీ తిరిగి ఇన్‌స్టాల్ అవుతూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతోంది. మొబైల్ మాల్‌వేర్ మరింత అధునాతనంగా మారుతూ, తొలగించడం కష్టతరంగా మారుతున్న పరిస్థితిని ఈ ముప్పు మరోసారి గుర్తు చేస్తోంది. ఈ మాల్‌వేర్‌ను మరింత ప్రమాదకరంగా మార్చుతున్న‌ది దాని మోసపూరిత స్వభావం. ఇది సాధారణ యాప్‌లా కనిపించడం వల్ల వినియోగదారులు అనుమానం లేకుండా ఇన్‌స్టాల్ చేస్తారు. ముఖ్యంగా థర్డ్ పార్టీ ఏపీకే ఫైళ్లు, ఫిషింగ్ లింకులు లేదా ఇతరుల ద్వారా షేర్ చేసిన యాప్‌ల ద్వారా ఇది ఫోన్‌లలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వినియోగదారులు సమస్యను గుర్తించే సమయానికి మాల్‌వేర్ అప్పటికే పని ప్రారంభించి ఇన్‌ఫెక్ట్ అవుతుంది.

యాక్సెసిబిలిటీ ప‌ర్మిష‌న్ల‌తో ఫోన్‌పై నియంత్ర‌ణ‌..

ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇది తెలివిగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా యాక్సెసిబిలిటీ పర్మిషన్లను కోరడం దీని ప్రధాన వ్యూహాల్లో ఒకటి. అనేక సాధారణ యాప్‌లు కూడా ఇలాంటి అనుమతులు కోరుతుండటంతో వినియోగదారులు పెద్దగా అనుమానించ‌రు. కానీ ఒకసారి ఈ అనుమతులు ఇచ్చిన తర్వాత మాల్‌వేర్‌కు ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ లభిస్తుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో చర్యలు చేపట్టడం, సెట్టింగ్‌లను మార్చడం, కొన్ని సందర్భాల్లో డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్లీ తనను తాను ఇన్‌స్టాల్ చేసుకోవడం వంటి పనులు చేస్తుంది. అంతటితో ఆగకుండా కొన్ని వెర్షన్‌లు బ్యాకప్, రీస్టోర్ ఫీచర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నాయి. వినియోగదారు యాప్‌ను తొలగించినా బ్యాకప్‌లో దాచిన ఆనవాళ్ల ద్వారా సాధారణ సింక్ ప్రక్రియలో మళ్లీ ఫోన్‌లోకి చేరే అవకాశం ఉంటుంది. మరికొన్ని వెర్షన్‌లు సిస్టమ్ ప్రాసెస్‌లలో దాగి పనిచేస్తూ గుర్తించడం లేదా తొలగించడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి.

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..

ఈ మాల్‌వేర్ ప్రభావానికి గురైన ఫోన్‌లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. యాక్సెసిబిలిటీ పర్మిషన్ల కోసం పదేపదే నోటిఫికేషన్‌లు రావడం, తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయమని అభ్యర్థనలు కనిపించడం ముఖ్య సంకేతాలు. అకస్మాత్తుగా బ్యాటరీ వేగంగా ఖాళీ కావడం, అనవసర పాప్-అప్‌లు కనిపించడం, యూజ‌ర్ ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఫోన్‌లో ప్రత్యక్షమవడం కూడా ప్రమాద సూచికలుగా పరిగణించాలి. అలాగే మొబైల్ డేటా వినియోగం పెరగడం, ఫోన్ పనితీరు మందగించడం, సందేశాలు లేదా కాల్‌లకు అనధికార ప్రాప్యత ల‌భించ‌డం వంటి అనుమానాస్పద చర్యలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఒకేసారి కనిపిస్తే మాల్‌వేర్ దాడి జరిగి ఉంటుంద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయాలి..

మీ ఫోన్ ప్రభావితమైందని అనుమానం ఉంటే ముందుగా ఇంటర్నెట్ కనెక్షన్‌ను నిలిపివేయాలి. దీంతో మాల్‌వేర్ బాహ్య సర్వర్‌లతో కమ్యూనికేట్ చేయకుండా అడ్డుకోవచ్చు. అనంతరం ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీస్టార్ట్ చేయాలి. ఈ మోడ్‌లో థర్డ్ పార్టీ యాప్‌లు పనిచేయవు. తర్వాత ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల జాబితాను జాగ్రత్తగా పరిశీలించి గుర్తు లేని యాప్‌లను తొలగించాలి. యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లలోకి వెళ్లి అవసరం లేని యాప్‌లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. అలాగే డివైస్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్‌ను పరిశీలించి తెలియని యాప్‌లకు ఉంటే నిలిపివేయాలి. అనుమానాస్పద యాప్‌లకు సంబంధించిన బ్యాకప్ డేటాను కూడా తొలగించడం ముఖ్యం. ఆటోమేటిక్ రీస్టోర్ ఫీచర్‌ను తాత్కాలికంగా ఆఫ్ చేయడం మంచిది. విశ్వసనీయ సెక్యూరిటీ స్కాన్ నిర్వహించడం ద్వారా దాగి ఉన్న మాల్‌వేర్ భాగాలను గుర్తించే అవకాశం ఉంటుంది. సమస్య కొనసాగితే చివరి మార్గంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయ‌వ‌చ్చు.

థ‌ర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ వ‌ద్దు..

అయితే ఫ్యాక్టరీ రీసెట్‌కు ముందు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలి. కానీ మాల్‌వేర్ మళ్లీ తిరిగి వచ్చే ప్రమాదం ఉన్నందున పాత యాప్‌లు లేదా సెట్టింగ్‌లను రీస్టోర్ చేయకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తులో ఇలాంటి ముప్పుల నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ ప్లే వంటి విశ్వసనీయ ఫ్లాట్‌ఫామ్‌ల‌ నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వనరుల నుంచి ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకూడదు. యాప్‌లు కోరే పర్మిషన్లను జాగ్రత్తగా పరిశీలించడం, అలాగే సెక్యూరిటీ ప్యాచ్‌లతో డివైస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం అవసరం. దీని వ‌ల్ల ఫోన్లు సురక్షితంగా ఉంటాయి.

Advertisement
Advertisement