త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడ‌ల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించే దిశగా ప్రత్యేక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

P

Telangana | Published On May 22, 2026, 7.40 pm IST

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడ‌ల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Advertisement

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించే దిశగా ప్రత్యేక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్ నోవాటెల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్–2026’కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటల్ దిశగా మారుతోందని, సంప్రదాయ వ్యవస్థలను పూర్తిగా పునర్నిర్వచించే సరికొత్త డిజిటల్ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.

ఈ మార్పులను అందిపుచ్చుకునే దేశాలకే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్న మంత్రి, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని తెలిపారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణ ఒక కీలక గ్రోత్ ఇంజన్‌గా ఎదుగుతోందన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, నైపుణ్యాలు, ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే బలమైన ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఒకప్పుడు బుక్ కీపింగ్, ఆడిటింగ్‌కే పరిమితమైన చార్టర్డ్ అకౌంటెంట్లు నేడు కార్పొరేట్ రంగానికి వ్యూహాత్మక సలహాదారులుగా మారారని మంత్రి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక పరిణామాలు ఫైనాన్స్ రంగంలో కొత్త అవకాశాలను తీసుకువస్తూనే, సైబర్ మోసాలు, డీప్‌ఫేక్స్, క్రిప్టో ఫ్రాడ్స్ వంటి సవాళ్లను కూడా పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఏలు కేవలం ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కే పరిమితం కాకుండా ‘సైబర్ అష్యూరెన్స్’పై కూడా దృష్టి సారించాలని సూచించారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐసీఏఐ ప్రతినిధులను ఆయన కోరారు.

కార్యక్రమంలో డిప్యూటీ సీఅండ్‌ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్-ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్థన్, ఆర్బీఐ సీజీఎం శైలజా రాణి జంపాల, ఎన్‌ఎస్‌ఈ సీఐఎస్‌వో రాజేష్ థాపర్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో వినాయక్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement