త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆ చార్జిలు అస‌లైన‌వి కావు.. వెబ్‌సైట్‌లో ఆ స‌మ‌స్య వ‌ల్లే అంతా జ‌రిగింది.. వివ‌ర‌ణ ఇచ్చిన స్టార్ లింక్‌..

S

Technology | Published On Dec 9, 2025, 10.38 am IST

ఆ చార్జిలు అస‌లైన‌వి కావు.. వెబ్‌సైట్‌లో ఆ స‌మ‌స్య వ‌ల్లే అంతా జ‌రిగింది.. వివ‌ర‌ణ ఇచ్చిన స్టార్ లింక్‌..
Advertisement

ప్ర‌ముఖ బిలియ‌నీర్ ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ పేరిట హైస్పీడ్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఈ సేవ‌ల‌ను అందించ‌నున్నారు. అయితే భార‌త్‌లో ఈ సేవ‌ల‌ను ప్రారంభించార‌ని, ముందుగా గృహ వినియోగ‌దారుల‌కు ఈ సేవలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని చెబుతూ నిన్న పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అందుకు బ‌లం చేకూర్చేలా మ‌రోవైపు స్టార్ లింక్ ఇండియా వెబ్‌సైట్‌లోనూ గృహ‌ వినియోగ‌దారుల‌కు నెల‌కు అయ్యే చార్జిల వివ‌రాలు కూడా ప్ర‌త్య‌క్షం అయ్యాయి. అయితే అదంతా వ‌ట్టిదే అని, అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని స్టార్ లింక్ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

స్టార్‌లింక్ బిజినెస్ ఆప‌రేష‌న్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రెయ‌ర్ మాట్లాడుతూ తాము స్టార్ లింక్ ఇండియా వెబ్‌సైట్‌ను టెస్ట్ చేస్తున్నామ‌ని, అందులో భాగంగానే చిన్న గ్లిచ్ ఏర్ప‌డింద‌ని, దీంతో ఆ వెబ్‌సైట్‌లో భార‌త్‌లోని గృహ వినియోగ‌దారుల‌కు చెందిన చార్జిల వివ‌రాలు అంటూ ఒక పేజీ ప్ర‌త్య‌క్ష‌మైంద‌ని, అయితే అది కేవలం టెస్టింగ్ ద‌శ‌లోనే ఉంద‌ని, ఆ చార్జిలు అస‌లైన‌వి కావ‌ని స్ప‌ష్టం చేశారు. వెబ్‌సైట్‌లో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే ఇలా జ‌రిగింద‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు తాము అధికారికంగా ఎలాంటి చార్జిల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేద‌ని అన్నారు. అది కేవ‌లం డ‌మ్మీ డేటా మాత్ర‌మే అని, దాన్ని భార‌త ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌వ‌ద్ద‌ని కోరారు. త‌మ‌కు భార‌త్‌లో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించేందుకు కావ‌ల్సిన లైసెన్స్‌లు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయ‌ని, అవి వ‌స్తేనే తాము ఈ సేవ‌ల‌ను అందిస్తామ‌ని తెలిపారు.

కాగా స్టార్ లింక్ వెబ్‌సైట్‌లో నిన్న గృహ వినియోగ‌దారుల‌కు సంబంధించిన చార్జిలు అంటూ కొన్ని వివ‌రాలు ప్ర‌త్య‌క్షం అయ్యాయి. వినియోగ‌దారులు నెల‌కు రూ.8600 చెల్లించాల్సి ఉంటుంద‌ని, అందులోనే హార్డ్ వేర్ ను అందిస్తామ‌ని, హార్డ్ వేర్ ధ‌ర రూ.34వేల వ‌ర‌కు ఉంటుంద‌ని ప‌లు వివ‌రాలు స్టార్ లింక్ ఇండియా వెబ్ సైట్‌లో ప్ర‌త్య‌క్షం అయ్యాయి. దీంతో నిజంగానే స్టార్ లింక్ త‌న సేవ‌ల‌ను ప్రారంభించింద‌ని అంతా నమ్మారు. కానీ అదంతా వ‌ట్టిదే అని, సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే ఆ వివ‌రాలు ప్ర‌త‌క్ష్యం అయ్యాయ‌ని, సేవ‌లు లాంచ్ అయినప్పుడు అస‌లు చార్జిల వివ‌రాలు తెలుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక స్టార్ లింక్ మ‌న దేశంలో అందించ‌నున్న హైస్పీడ్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ఎక్క‌డ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా పొంద‌వ‌చ్చు. కొండ కోన‌ల్లోనూ 100 శాతం స్పీడ్ వ‌చ్చేలా ఈ సేవ‌ల‌ను అందిస్తామ‌ని స్టార్ లింక్ స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే దేశంలోని చండీగ‌ఢ్‌, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ల‌క్నో, ముంబై, నోయిడాల‌లో ఇప్ప‌టికే ఎర్త్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లోనే ముందుగా స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని స‌మాచారం. దీనిపై కూడా స్టార్ లింక్ స్ప‌ష్ట‌త‌ను ఇవ్వాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement