త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఇక‌పై హోట‌ళ్లు, ఈవెంట్ల‌లో మీ ఫోన్‌తో ఆధార్ వెరిఫై చేయాల్సిందే.. కొత్త రూల్‌ను అమ‌లు చేయ‌నున్న కేంద్రం..

S

Technology | Published On Dec 8, 2025, 10.50 am IST

ఇక‌పై హోట‌ళ్లు, ఈవెంట్ల‌లో మీ ఫోన్‌తో ఆధార్ వెరిఫై చేయాల్సిందే.. కొత్త రూల్‌ను అమ‌లు చేయ‌నున్న కేంద్రం..
Advertisement

భార‌త ప్ర‌భుత్వం దేశ పౌరుల‌కు అందిస్తున్న 12 అంకెల ఆధార్ నంబ‌ర్‌ను ప్ర‌జ‌లు అనేక అవ‌స‌రాల కోసం ఉప‌యోగిస్తున్నారు. దీన్ని ఐడీ, అడ్ర‌స్ ప్రూఫ్ గా వాడుతున్నారు. అలాగే పేద‌, మ‌ధ్య త‌రగ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం ఇచ్చే సంక్షేమ ప‌థ‌కాల కోసం ఉప‌యోగిస్తున్నారు. బ్యాంకు ప‌నులు, ఐటీ రిట‌ర్న్స్ ఫైలింగ్ ఇలా అనేక రంగాల్లో ప్ర‌జ‌లు ఆధార్‌ను వాడుతున్నారు. ఇందులో కార్డు హోల్డ‌ర్‌కు చెందిన డెమొగ్రాఫిక్‌, బ‌యోమెట్రిక్ డేటా ఉంటాయి. వీటిని సుల‌భంగా ప‌రీక్షించి పౌరుడి ఐడెండిటీని వెరిఫై చేస్తారు. అయితే ఆధార్‌కు సంబంధించి త్వ‌ర‌లో కేంద్ర ప్ర‌భుత్వం నూత‌న రూల్‌ను అమ‌లులోకి తేనుంది.

ఆధార్ వెరిఫికేష‌న్ కోసం ప్ర‌స్తుతం హోట‌ళ్ల‌తోపాటు ఈవెంట్లు జ‌రిగే ప్ర‌దేశాల్లో పౌరుల‌కు చెందిన ఆధార్ జిరాక్సులు లేదా ఆధార్ డిజిట‌ల్ ఐడీని నిర్వాహ‌కులు ఫొటో తీసుకుంటున్నారు. అయితే దీని వ‌ల్ల ఆధార్ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ చాలా ఆల‌స్యం అవుతోంది. అలాగే కొంద‌రు త‌ప్పుడు ఆధార్ కార్డుల‌తో ఐడెండిటీని త‌ప్పుగా చూపించి దాన్ని సంఘ విద్రోహ కార్య‌క‌లాపాల‌కు లేదా నేరాల‌కు ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో నేర‌స్తులను గుర్తించ‌డం క‌ష్టంగా మారుతోంది. అలాగే ఆధార్ డేటా కూడా దుర్వినియోగ‌మ‌వుతుంద‌ని కేంద్రం గుర్తించింది. ఈ క్ర‌మంలోనే ఈ నేరాల‌ను అరిక‌ట్టేందుకు గాను ఇక‌పై హోట‌ళ్లు లేదా ఈవెంట్లు జ‌రిగే ప్ర‌దేశాల్లో ఆధార్ వెరిఫికేష‌న్‌ను పేప‌ర్ లేదా జిరాక్స్ ప‌ద్ధ‌తిలో కాకుండా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు గాను పౌరులు త‌మ ఫోన్ ద్వారా ఆధార్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది.

ఇక పౌరులు అలా ఆధార్‌ను వెరిఫై చేసేందుకు గాను ఓ నూత‌న యాప్‌ను ప్ర‌స్తుతం అభివృద్ధి చేస్తున్నామ‌ని UIDAI సీఈవో భువ‌నేష్ కుమార్ ఓ జాతీయ మీడియా చాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హోట‌ళ్లు, ఈవెంట్ల‌లో కొంద‌రు త‌ప్పుడు ఆధార్‌ల‌ను స‌మ‌ర్పిస్తున్నార‌ని, దీని వ‌ల్ల అసలైన పౌరుల‌కు చెందిన ఆధార్ డేటా దుర్వినియోగం అవ‌డమే కాకుండా, అసాంఘిక కార్య‌కలాపాల‌కు, నేరాల‌కు పాల్ప‌డే వారిని గుర్తించ‌డం క‌ష్టంగా మారింద‌ని అన్నారు. అందుక‌నే కేంద్రం కొత్త‌గా ఈ నియ‌మాన్ని అందుబాటులోకి తెస్తుంద‌న్నారు. దీని వ‌ల్ల పౌరులు హోట‌ళ్లు, ఈవెంట్లు జ‌రిగే ప్ర‌దేశాల్లో త‌మ ఫోన్‌లో ఉండే UIDAI యాప్ స‌హాయంతో ముందుగా ఆధార్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సుర‌క్షిత‌మైన‌, వేగవంత‌మైన ప్ర‌క్రియ‌. దీని వ‌ల్ల పౌరులు త‌మ ఆధార్ జిరాక్స్‌ల‌ను ఎవ‌రికీ ఇవ్వాల్సి అవ‌స‌రం ఉండ‌దు. డేటా దుర్వినియోగం అవ‌కుండా ఉంటుంది. అలాగే నేరాలు జ‌రిగిన‌ప్పుడు నేర‌స్థుల‌ను గుర్తించ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. ఈ యాప్ పూర్తిగా UIDAI ఆధీనంలో ఉంటుంది. క‌నుక పౌరుల డేటా, ప్రైవ‌సీకి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.. అని తెలిపారు.

అయితే ప్ర‌స్తుతం ఈ కొత్త UIDAI యాప్ డెవ‌ల‌పింగ్ ద‌శ‌లో ఉంద‌ని, అతి త్వ‌ర‌లోనే పౌరుల‌కు ఈ యాప్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని, దీనిపై త్వ‌ర‌లోనే కేంద్రం అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేస్తుంద‌ని చెప్పారు. కానీ ఈ యాప్ వ‌ల్ల దేశంలో పౌరులు ఎక్క‌డ ఏ హోట‌ల్‌లో ఉంటున్నారు, ఏ ఈవెంట్ల‌లో పాల్గొంటున్నారు అనే వివ‌రాలు కేంద్ర ప్ర‌భుత్వానికి సుల‌భంగా తెలిసిపోతాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement