త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Galaxy Book 6 Series | గెలాక్సీ బుక్‌6 సిరీస్‌లో శాంసంగ్ కొత్త ల్యాప్ టాప్ లు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

Galaxy Book 6 Series | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న ల్యాప్‌టాప్ మోడ‌ల్స్‌ను భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. గెలాక్సీ బుక్‌6 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ బుక్‌6 అల్ట్రా, గెలాక్సీ బుక్‌6 ప్రొ, గెలాక్సీ బుక్‌6 పేరుతో మూడు మోడ‌ళ్ల‌ను శాంసంగ్ విడుద‌ల చేసింది.

S

Technology | Published On Mar 28, 2026, 4.00 pm IST

Galaxy Book 6 Series | గెలాక్సీ బుక్‌6 సిరీస్‌లో శాంసంగ్ కొత్త ల్యాప్ టాప్ లు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!
Advertisement

Galaxy Book 6 Series | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న ల్యాప్‌టాప్ మోడ‌ల్స్‌ను భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. గెలాక్సీ బుక్‌6 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ బుక్‌6 అల్ట్రా, గెలాక్సీ బుక్‌6 ప్రొ, గెలాక్సీ బుక్‌6 పేరుతో మూడు మోడ‌ళ్ల‌ను శాంసంగ్ విడుద‌ల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ల‌లో అద్భుత‌మైన డిస్‌ప్లేల‌ను అందించ‌డంతోపాటు అధునాత‌న కూలింగ్ సిస్ట‌మ్‌లు, గెలాక్సీ ఏఐతో అనుసంధానం వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. రోజువారి ప‌నుల‌తోపాటు గ్రాఫిక్స్ వ‌ర్క్స్ చేసేవారికి, క్రియేట‌ర్ల‌కు కూడా ఈ ల్యాప్‌టాప్‌లు ఉప‌యుక్తంగా ఉంటాయ‌ని శాంసంగ్ తెలియ‌జేసింది.

ఆక‌ట్టుకునే స్లిమ్ లుక్‌..

గెలాక్సీ బుక్‌6 సిరీస్ ల్యాప్ టాప్‌ల‌ను శాంసంగ్ అధునాత‌నంగా డిజైన్ చేసింది. వీటిల్లో పూర్తిగా కొత్త నిర్మాణంతో కూడిన చాసిస్‌ను ఇచ్చారు. విస్తృత‌మైన వేప‌ర్ చాంబ‌ర్‌, ప‌లుచ‌ని ఫ్యాన్లు, అధునాత‌న హింజ్‌ల‌ను ఇచ్చారు. దీని వ‌ల్ల ల్యాప్ టాప్ ల‌కు స్లిమ్ లుక్ వ‌చ్చింది. గెలాక్సీ బుక్‌6 అల్ట్రా ల్యాప్ టాప్ 15.4 మిల్లీమీట‌ర్ల మందాన్ని క‌లిగి ఉండ‌గా, గెలాక్సీ బుక్‌6 ప్రొ 16 ఇంచుల మోడ‌ల్ కేవ‌లం 11.9 ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి ఉంది. డిజైన్‌లో భాగంగా స‌మాన‌మైన మూల‌లు, మ‌ధ్య‌లో లోగో, రెండు క‌ల‌ర్స్‌తో కూడిన కీబోర్డు, హ్యాప్టిక్ ట‌చ్ ప్యాడ్‌ల‌ను ఇచ్చారు. ఇవి వాడ‌కంలో ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి.

అద్భుత‌మైన డిస్‌ప్లే, ప‌వ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్‌..

ఈ ల్యాప్ టాప్‌ల‌లో డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ట‌చ్ స్క్రీన్ క‌లిగిన డిస్‌ప్లేల‌ను ఇచ్చారు. 1000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చినందున సూర్య‌కాంతిలోనూ ఈ ల్యాప్ టాప్ తెర‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ఎస్‌డీ మోడ్‌లో అయితే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తాయి. ఇక ఈ తెర‌ల‌కు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది క‌నుక అద్భుత‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అలాగే డిస్‌ప్లేల‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను కూడా ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్‌ల‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెస‌ర్‌ల‌ను ఇచ్చారు. ఇవి 16 కోర్‌ల‌ను క‌లిగి అత్యంత వేగంగా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ల్యాప్‌టాప్‌లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాయి. ఈ ల్యాప్ టాప్‌ల‌లో ఏఐ ప‌నుల కోసం ప్ర‌త్యేకంగా ఎన్‌పీయూ ను ఇచ్చారు. అందువ‌ల్ల ఏఐ ప‌నులు కూడా వేగంగా పూర్త‌వుతాయి. గెలాక్సీ బుక్‌6 అల్ట్రా మోడ‌ల్ లో అద‌నంగా ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5070 గ్రాఫిక్ కార్డును కూడా ఇచ్చారు. అందువ‌ల్ల ఇది మ‌రింత అడ్వాన్స్‌డ్‌గా ప‌నిచేస్తుంది.

ఎక్కువ బ్యాట‌రీ బ్యాక‌ప్‌, మ‌రింత కూలింగ్‌..

ఈ ల్యాప్‌టాప్‌ల‌లో బ్యాట‌రీ, కూలింగ్ ప‌రంగా కూడా స‌దుపాయాల‌ను ఇచ్చారు. వీడియోల‌ను చూస్తే 30 గంట‌ల వ‌ర‌కు బ్యాక‌ప్‌ను ఇస్తాయి. గెలాక్సీ బుక్‌6 అల్ట్రా ల్యాప్ టాప్‌కు ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. దీని వ‌ల్ల ఈ డివైస్‌ను 30 నిమిషాల్లోనే 63 శాతం వ‌ర‌కు చార్జింగ్ చేసుకోవ‌చ్చు. కూలింగ్ సిస్ట‌మ్‌లో ప్ర‌త్యేక‌మైన పెద్ద సైజు క‌లిగిన వేప‌ర్ చాంబ‌ర్‌, మెరుగైన ఫిన్స్ ఉన్నాయి. అందువ‌ల్ల ల్యాప్ టాప్‌ల నుంచి ఉత్ప‌న్నం అయ్యే వేడి ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లిపోయి ల్యాప్ టాప్‌లు కూల్‌గా ఉంటాయి. దీని వ‌ల్ల డివైస్‌ల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌న్నిక‌గా ఉంటాయి. అల్ట్రా మోడ‌ల్‌లో డ్యుయ‌ల్ పాత్ అవుట్‌లెట్ ఫ్యాన్‌, ఆప్టిమైజ్డ్ హీట్ సింక్‌, కొత్త ఎయిర్‌ఫ్లో డిజైన్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల వేడిని ఇది మ‌రింత మెరుగ్గా బ‌య‌ట‌కు పంపిస్తుంది.

ధ‌ర వివ‌రాలు..

గెలాక్సీ బుక్‌6 అల్ట్రాలో 6 స్పీక‌ర్లు ఇచ్చారు. డాల్బీ అట్మోస్‌కు స‌పోర్ట్ లభిస్తుంది. అందువ‌ల్ల ఆడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అలాగే శాంసంగ్‌కు చెందిన నాక్స్ సెక్యూరిటీ సిస్ట‌మ్‌ను ఈ డివైస్‌ల‌లో అందించారు. అందువ‌ల్ల ల్యాప్ టాప్‌లు హ్యాకింగ్ నుంచి సుర‌క్షితంగా ఉంటాయి. ఈ డివైస్‌ల‌లో విండోస్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. ప‌లు ఏఐ ఫీచ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ బుక్‌6 సిరీస్ ల్యాప్‌టాప్‌ల‌ను గ్రే, సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, రిటెయిల్ స్టోర్లు, ఆథ‌రైజ్డ్ పార్ట్‌న‌ర్ స్టోర్‌ల‌లో ఈ ల్యాప్‌టాప్‌ల‌ను విక్ర‌యిస్తున్నారు. గెలాక్సీ బుక్‌6 ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.1,27,990 ఉండ‌గా, గెలాక్సీ బుక్‌6 ప్రొ ప్రారంభ ధ‌ర రూ.1,78,990గా ఉంది. అలాగే గెలాక్సీ బుక్‌6 అల్ట్రా ల్యాప్ టాప్ ప్రారంభ ధ‌ర‌ను రూ.2,42,990గా నిర్ణ‌యించారు. ఈ డివైస్‌ల‌ను 24 నెల‌ల వ‌ర‌కు ఎలాంటి వ‌డ్డీ లేకుండా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే స‌దుపాయం అందిస్తున్నారు. అల్ట్రా, ప్రొ మోడ‌ల్స్‌పై రూ.5వేల వ‌ర‌కు అద‌న‌పు క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నారు. ఎంట్రీ మోడ‌ల్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. స్టూడెంట్స్ అయితే 10 శాతం వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement