త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే.. రియ‌ల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్‌..

realme 16x 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ 16ఎక్స్ 5జిని భార‌త్‌లో విడుద‌ల చేసింది. స్టే స్మూత్. స్టే అన్‌స్టాపబుల్ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ నుంచి మిడ్-రేంజ్ 5జి విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, వేగవంతమైన పనితీరుపై కంపెనీ దృష్టి పెట్టింది.

S

Technology | Published On Aug 12, 2026, 2.56 pm IST

realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే.. రియ‌ల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్‌..
Advertisement

realme 16x 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ 16ఎక్స్ 5జిని భార‌త్‌లో విడుద‌ల చేసింది. స్టే స్మూత్. స్టే అన్‌స్టాపబుల్ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ నుంచి మిడ్-రేంజ్ 5జి విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, వేగవంతమైన పనితీరుపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఎక్కువ పనిభారం ఉన్న సమయంలో ఫోన్ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ప్ర‌త్యేక వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. ఫోన్‌లో గరిష్ఠంగా 6జీబీ ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ గరిష్ఠంగా 256జీబీ వరకు ఉంటుంది.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కంపెనీ అందించింది. బ్యాటరీ ఆరు సంవత్సరాల పాటు పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని రియల్‌మి చెబుతోంది. అలాగే 60 నెలల పాటు ఫోన్ పనితీరు సాఫీగా ఉండేలా ఫ్లూయెన్సీ గ్యారెంటీని కూడా అందిస్తోంది. దీర్ఘకాలం ఫోన్‌ను ఉపయోగించినా పనితీరు స్థిరంగా ఉండేలా ఈ ఫీచర్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్ 45 వాట్ల సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బైపాస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. గరిష్ఠ ఛార్జింగ్ ఉష్ణోగ్రతను తగ్గించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అంతేకాకుండా 6.5 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఫోన్ నుంచి పవర్ అందించవచ్చు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం 8.8 మిల్లీమీటర్లుగానే ఉంది. దీని బరువు 217 గ్రాములుగా ఉంది.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, ఏఐ ఫీచ‌ర్లు..

రియల్‌మి 16ఎక్స్ 5జిలో 6.8 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేని అందించారు. ఇది 720 * 1570 పిక్స‌ల్స్ హెచ్‌డీ ప్ల‌స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 144 హెడ్జ్‌ హై రిఫ్రెష్ రేట్‌తోపాటు గరిష్ఠంగా 1200 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌ను ఈ స్క్రీన్ అందిస్తుంది. డిస్‌ప్లేకు పాండా గ్లాస్ రక్షణ ఉంది. వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్ వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరాను అందించారు. దీనికి అదనంగా మరో కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా వ్యవస్థ ఉంది. ముందు భాగంలో పంచ్-హోల్‌లో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. రియల్‌మీమి 16ఎక్స్ 5జి ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0తో పనిచేస్తుంది. ఇందులో పలు కృత్రిమ మేధస్సు ఆధారిత ఫీచర్లను అందించారు. నేటివ్ జెమిని లైవ్ సపోర్ట్, నోట్స్ కోసం ఏఐ అసిస్టెంట్, ఏఐ ఎరేజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌..

మన్నిక విషయానికి వస్తే ఫోన్‌కు ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. రియల్‌మికి చెందిన ఆర్మర్‌షెల్ స్ట్రక్చరల్ ఛాసిస్‌ను ఇందులో ఉపయోగించారు. షాక్, డ్రాప్ ప్రొటెక్షన్ కోసం మిల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కస్టమైజ్డ్ నోటిఫికేషన్ల కోసం ఏఐ పల్స్ లైట్‌ను అందించారు. ఈ ఫోన్‌ను 4జీబీ, 6జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంది. అంటే రెండు నానో సిమ్ కార్డులు లేదా ఒక నానో సిమ్, ఒక మైక్రోఎస్‌డీ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 ఇందులో ఉంది. యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 1115 అల్ట్రా-లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్, 400 శాతం అల్ట్రా వాల్యూమ్ ఆడియో సదుపాయాలు ఉన్నాయి. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

రియల్‌మి 16ఎక్స్ 5జి 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్‌లతో ఈ వేరియంట్‌ను రూ.23,999కే పొందే అవకాశం ఉంది. 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999 ఉండ‌గా, ఆఫర్ ధర రూ.25,999గా ఉంది. 6జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.30,999 ఉండ‌గా, ఆఫర్ ధర రూ.28,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఆగస్టు 13 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ స్టోర్లలో విక్ర‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement