త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta Cloud Computing | అమెజాన్, గూగుల్‌కు ఫేస్‌బుక్ కంపెనీ చెక్! 8 వేల మందిని తీసేసి.. ఆ భారీ మార్కెట్‌పై కన్నేసిన జుకర్‌బర్గ్

8 వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా.. ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లకు గట్టి పోటీ ఇస్తూ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

J

Technology | Published On May 28, 2026, 11.30 pm IST

Meta Cloud Computing | అమెజాన్, గూగుల్‌కు ఫేస్‌బుక్ కంపెనీ చెక్! 8 వేల మందిని తీసేసి.. ఆ భారీ మార్కెట్‌పై కన్నేసిన జుకర్‌బర్గ్
Advertisement

Meta Cloud Computing | త్రినేత్ర.న్యూస్ : టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టించే మెటా (Meta) (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మరో భారీ ప్లాన్ వేశారు. కృత్రిమ మేధ (AI) టెక్నాలజీపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన, ఇటీవల ఏకంగా 8,000 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అయితే ఇప్పుడు అదే ఏఐ అడ్వాంటేజ్‌తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్ లాంటి దిగ్గజాలకు పోటీగా 'క్లౌడ్ కంప్యూటింగ్' (Cloud Computing) మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాన్యువల్ షేర్ హోల్డర్స్ సమావేశంలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

కంప్యూట్ పవర్‌కు విపరీతమైన డిమాండ్

మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలు ఇప్పటికే డేటా, సర్వర్, నెట్‌వర్క్ వంటి క్లౌడ్ సేవలు అందిస్తూ కోట్లు గడిస్తున్నాయి. చాట్‌జీపీటీ (ChatGPT), జెమినీ లాంటి ఏఐ టూల్స్ అన్నీ రన్ అయ్యేది ఈ క్లౌడ్‌లోనే. ఈ రేసులో లేని ఏకైక దిగ్గజం మెటా మాత్రమే. అయితే, ఈ బిజినెస్‌పై కన్నేసినట్లు జుకర్‌బర్గ్ హింట్ ఇచ్చారు. "మా దగ్గర ఉన్న కంప్యూట్ పవర్‌ను (Compute power) అమ్ముతారా? మీరు కొన్న ధరకంటే ప్రీమియం చెల్లించేందుకు మేం రెడీ అంటూ ప్రతి వారం ఎన్నో కంపెనీలు మమ్మల్ని అడుగుతున్నాయి" అని ఆయన తెలిపారు.

మిగులు ఉంటే.. ఎంట్రీ గ్యారెంటీ

ప్రస్తుతం తమ అవసరాలకు మించి ఇతరులకు అద్దెకు ఇచ్చేంత అదనపు క్లౌడ్ కెపాసిటీ మెటా వద్ద లేదని జుకర్‌బర్గ్ తెలిపారు. కానీ, ఒకవేళ తాము అవసరానికి మించి సర్వర్లు, నెట్‌వర్క్ (Overbuilt) నిర్మిస్తే మాత్రం.. కచ్చితంగా వాటిని ఇతరులకు విక్రయించి క్లౌడ్ బిజినెస్‌లోకి దిగే అవకాశం (Option on the table) ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ రంగంలో ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఈ ధీమా కూడా ఒక కారణమని వెల్లడించారు.

ఉద్యోగులకు కోత.. ఏఐకి పెద్దపీట

మెటా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే తన పూర్తి దృష్టి పెట్టింది. ఏఐ అవసరాలకు కంప్యూట్ పవర్ ఎంత ప్రాణమో టెక్ నిపుణులకు తెలుసు. అందుకే, ఈ ఒక్క ఏడాదే ఏఐ సంబంధిత ప్రాజెక్టుల కోసం దాదాపు $125 బిలియన్ల నుంచి $145 బిలియన్ల (లక్షల కోట్లు) క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెడుతోంది.

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగానే మే 20న ఏకంగా 8 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటించింది. మరో 7 వేల మందిని ఇంటర్నల్‌గా ఏఐ టీమ్స్‌లోకి బదిలీ చేసింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన మరో 6,000 ఓపెన్ రోల్స్‌ను కూడా క్లోజ్ చేసింది. ఏఐ ప్రాజెక్టులకు నిధులు మళ్లించేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు మెటా వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది ఇకపై ఎలాంటి లేఆఫ్స్ ఉండవని జుకర్‌బర్గ్ గతంలో భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా, మెటా కనుక క్లౌడ్ మార్కెట్లోకి వస్తే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం.

Advertisement

తాజావార్తలు

Advertisement