RS Praveen Kumar | టామ్ కామ్‌ను టామ్ స్కాం గా మార్చారు
RS Praveen Kumar | ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇపుడు నెలకో స్కాం క్యాలెండర్ చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు.
- జాబ్ క్యాలెండర్ ఇస్తామని.. స్కాం క్యాలెండర్ ఇచ్చారు
- కార్మిక, శక్తి శాఖ ఆధ్వర్యంలో వందలాది మందిని మోసం చేశారు
- మంత్రి వివేక్ పై క్రిమినల్ కేసు, చీటింగ్ కేసులు పెట్టాలి
- బాధితులందరికీ కట్టిన ఫీజు తిరిగి చెల్లించాలి
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇపుడు నెలకో స్కాం క్యాలెండర్ చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెర తీసిన మరో స్కాం టామ్ కామ్ (TOMCOM) స్కాం అన్నారు. కార్మిక, శక్తి శాఖ ఆధ్వర్యంలో వందలాది మందిని మోసం చేశారని.. స్కాంలకు కాంగ్రెస్ చిరునామాగా మారిందన్నారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
జనవరిలో సివిల్ సప్లయ్స్ స్కాం, ఫిబ్రవరిలో ఫ్లై యాష్ స్కాం, మార్చిలో ఇసుక స్కాం, ఏప్రిల్‌లో ఆర్టీసీ కాంట్రాక్ట్, మే లో అమృత్ టెండర్, జూన్ లో ఫోర్త్ సిటీ, జూలైలో లగచర్ల, కంచ గచ్చిబౌళి భూములు, ఆగస్టులో పీజీ మెడికల్, సెప్టెంబర్ లో హిల్ట్, అక్టోబర్‌లో పవర్, నవంబర్‌లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కాంలకు తెర తీశారు. కాంగ్రెస్ పాలనలో వారానికో స్కాం జరుగుతోంది. తెలంగాణ రైజింగ్ కాదిది.. సింకింగ్. టామ్ కామ్ గురించి రోజు టామ్ టామ్ చేస్తూ జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ కూడా ప్రభుత్వ ఖర్చులు వైట్ పాస్ పోర్ట్ తో వెళ్లి వచ్చారు.
తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. రిజిస్టర్ కాని వాళ్లు ఇంకో 5, 10 లక్షల మంది ఉంటారు. ఏ ప్రభుత్వం కూడా వంద శాతం ఉద్యోగాలు కల్పించదు. అందుకే ఇతర దేశాలకు పంపి ఉద్యోగాలిచ్చేందుకు టామ్ కామ్ 2014 లో ఆనాడు కేసిఆర్ ప్రారంభించారు. బ్రోకర్ల ద్వారా మోసాలు, పాస్ పోర్ట్ సీజ్ చేయడం, ఒక జాబ్ అని చెప్పి ఇంకో జాబ్, వర్కింగ్ వీసా అని చేప్పి విజిటింగ్ వీసా ఇస్తూ మోసం జరిగేది. దాని నుండి రక్షణ కల్పించి ప్రభుత్వమే విదేశాలకు పంపాలని ఉద్దేశ్యంతో ఏర్పాటైంది టామ్ కామ్.
కానీ ఇపుడు కాంగ్రెస్ పాలనలో టామ్ కామ్ టామ్ స్కాంగా అయిపోయింది. జర్మనీలో టెక్నికల్ ఉద్యోగాలు, వేర్ హౌస్ ఉద్యోగాలు, నర్సింగ్ ఉద్యోగాలు, ఆస్ బిల్డింగ్, మెకాట్రానిక్స్, డ్రైవింగ్ వంటి ఉద్యోగాల కోసం ప్రభుత్వమే టామ్ కామ్ నోటిఫికేషన్, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని నమ్మి వందలాది మంది ఆంధ్ర నుండి కూడా వచ్చి జాయిన్ అయ్యారు.
మంత్రి వివేక్ బిజినెస్ క్లాస్‌లో జర్మనీ వెళ్లి, స్టార్ హోటల్లో ఉండి, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జపాన్ సౌత్ కొరియాలో కూడా తిరిగొచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది కూడా ఉచితంగా కాదు, ఒక్కొక్కరు 4.1 లక్షలు కట్టాలన్నారు. హై టెక్ సిటీలో 6 నెలల పాటు, గోతే ఇనిస్టిట్యూట్ సాయంతో జర్మనీ భాష నేర్పించారు. వాస్తవంగా గోతే ఇనిస్టిట్యూట్ జర్మనీ ప్రభుత్వ సాయంతో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో జర్మనీ భాష నేర్పిస్తుంది. అభ్యర్థులు చేరిన తర్వాత వారి చేత, క్యాండిడేట్ అగ్రిమెంట్ ఫాం మీద సంతకాలు తీసుకున్నారు. దీని మీద కోవలం ఫేర్ స్ట్రీట్ అనే కంపెనీ పేరు ఉంది. టామ్ కామ్ పేరు లేదు. ఇక్కడే మోసం జరిగింది.
ఫేర్ స్ట్రీట్ పేరే ఉంది..
జర్మనీ భాషలో ఎ1, ఎ2, బి1, బి2 లెవల్స్ ఉంటాయి. జర్మనీ వెళ్లాలంటే బి1 తప్పనిసరి. బి1 లెవల్ ఎగ్జామ్ స్లాట్ బుక్ చేయడానికి మళ్లీ 20 వేలు కట్టమన్నారు. హైదరాబాద్‌లో కాకుండా చెన్నై పంపారు. ఖర్చులన్నీ విద్యార్థులే భరించారు. వందల మంది జాయిన్ అయి బి1 పాస్ అయిన తర్వాత 10 మందిని కూడా జర్మీనీకి పంపలేదు. ఒక వ్యక్తి నవీన్ (పేరు మార్పు) జర్మనీకి వెళ్లిన తర్వాత అతనికి టెక్నికల్ ఉద్యోగం అని చెప్పి.. బీఫ్, పోర్క్, మటన్ కట్ చేయాలని బలవంతం చేశారు. ఇది తట్టుకోలేక ఇండియా తిరిగొచ్చారు. అతన్ని పంపేటపుడు అతనికి ఇచ్చిన ఆర్డర్ కాపీలో కూడా టామ్ కామ్ పేరు లేదు. కేవలం ఫేర్ స్ట్రీట్ పేరు మాత్రమే ఉంది.
సేల్స్ మెన్ ఉద్యోగం అని చెప్పి, గోదాంలో ఉద్యోగం ఇస్తున్నారు, వివేక్ వెంకటస్వామి తమ పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తరా? మోసపోయిన అభ్యర్థులు ఇండియాకు అతి కష్టం మీద తిరిగొచ్చి, మా డబ్బు మాకివ్వాలని టామ్ కామ్ ఆఫీస్‌కి వెళ్తే.. ఫేర్ స్ట్రీట్ ను అడగాలంటున్నారు. ఇపుడు పిల్లలు టామ్ కామ్ కు డబ్బులు కట్టి, ఫేర్ స్ట్రీట్ కంపెనీని వెళ్లి ఎలా వాపస్ ఇవ్వమని అడగుతరు? అసలు ఈ అభ్యర్థులు వివేక్ ను, రేవంత్ ప్రభుత్వాన్ని నమ్మి వచ్చారు. ఫేర్ స్ట్రీట్ ను నమ్మి రాలేదు.
డబ్బులు వాపస్ ఇవ్వాలి
కాంగ్రెస్ మంత్రులు కోటి రూపాయలతో బాత్రూంలు కట్టుకోవచ్చు, రేవంత్ రెడ్డి 200 కోట్లతో ఇల్లు కట్టుకోవచ్చు కానీ, పిల్లలకు డబ్బులు వాపస్ ఇవ్వరా? గతంలో మ్యాజిక్ బిలియన్ కంపెనీ ఉండగా, దాన్ని పక్కకు పెట్టి ఫేర్ స్ట్రీట్ కంపెనీని తెచ్చారు. డ్రైవర్ ఉద్యోగాలను కూడా ఎ1 లెవల్ కావాలని చెప్పి జాయిన్ అయిన తర్వాత బి1 లెవల్ కావాలంటున్నారు. ఇలాంటి మోసాలు, బ్రోకర్లు ఉండద్దని టామ్ కామ్ తెస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వమే నేరుగా మోసం చేస్తుంది. రేవంత్ రెడ్డి పేగులు మెడల వేసుకొనుడు, బోటి కొట్టుడు లాగా పిల్లలను అలా తయారు చేయాలని చూస్తున్నారు.
రేవంత్ రెడ్డి సౌత్ కొరియా వెళ్లి తన సతీమణి పేరు మీద గీతా హ్యూందాయ్ షేర్లు తెచ్చుకున్నరు. కానీ పిల్లలకు ఏం ఇవ్వడం లేదు. కార్మిక శాఖలో 150 కోట్ల ఇన్సురెన్స్ కుంభకోణం. ట్రయల్ బ్లెజర్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. బతికున్న వారిని చనిపోయారని చెప్పి, ఫేక్ ఎఫ్ఐఆర్ లు అప్లోడ్ చేసి లక్షల రూపాయలు దోచుకున్నరు. ఇంత జరిగినా మంత్రి వివేక్, పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు పెట్టలేదు? ఫేక్ ఎఫ్ఐఆర్ల మీద.
కార్మిక శాఖ స్కాంలకు చిరునామాగా మారింది. అసలు మీకు ఏం కావాలో, ఎంత కావాలో చెప్పండి, బడ్జెట్ లో కేటాయించి ప్రజల నుండి నేరుగా వసూలు చేసుకోండి. కానీ ఇలా మోసం చేయకండి. తను ఏజెన్సీ ఎవరిది? కార్మిక శాఖలో ఎక్కడ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కావాలన్నా.. తను ఏజెన్సీ నుండే తీసుకోవాలని మంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తను ఏజెన్సీ మంత్రి ఇలాకా అని తెలిసింది. ఏజెన్సీ పూర్వపరాలు తెలియకుండా, అనుభవం లేకుండా ఎలా కాంట్రాక్టు ఇస్తారు? మిగతా ఏజెన్సీలకు ఎందుకు ఇవ్వరు? దీని మీద మంత్రి నుండి ఎలాంటి స్పందన లేదు.
వివేక్, రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
పేద బిడ్డల నుండి డబ్బులు తీసుకున్నారు. అన్నీ వాపస్ ఇవ్వాలి. ఫేర్ స్ట్రీట్ మీద కేసులు పెట్టాలి. విద్యార్థులను బెదిరిస్తున్న ఉద్యోగులపై కేసు పెట్టాలి. వివేక్, రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే, వివేక్ వెంకట స్వామి తన 10 వేల కోట్ల విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుండి అయినా చెల్లించాలి. ఇలా నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లకు వచ్చినపుడు నిరుద్యోగులు నిలదీయండి. జాబ్ క్యాలెండర్ పోయి, స్కాం క్యాలెండర్ వచ్చింది. బాధితులందరి తరపున న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతం.
చింతిస్తున్నా అంటే సరిపోదు
ప్రభుత్వం మీద చీటింగ్, క్రిమినల్ బ్రీత్ ఆఫ్ ట్రస్ట్, వినియోగదారుల ఫోరంలో కేసులు పెడుతం. నిజంగా ఉద్యోగాలు ఇస్తే వారి వివరాలు బయట పెట్టాలి. ఎవరికి ఇచ్చారు, ఏం ఉద్యోగం ఇచ్చారు, ఏ దేశంలో ఇచ్చారో తెలపాలి. కొండా సురేఖ బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇది తెలంగాణ ప్రజల ఇమేజ్ ని దెబ్బతీయడం. మహిళలందరికీ అవమానకరం. 509 ఐపీసీ ప్రకారం నేరం. చింతిస్తున్నా, అలా అనకుండా ఉండాల్సింది అంటే సరిపోదు అని ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ఈ సమావేశంలో తుంగబాలు, నారాయణ, రఘురాం, అరుణ, యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●RGV | చిక్కుల్లో ఆర్జీవీ - 30 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ లీగల్ నోటీసులు
- ●Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం
- ●Ponnam Prabhakar | "ఓబీసీ కాలమ్" పెట్టాలని అమిత్ షాను అడగాలి
- ●DK Aruna | దేశ భద్రత కోసమే సర్.. యువత ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ
- ●Qualcomm Layoffs November 2026 | క్వాల్కామ్లో మళ్లీ లేఆఫ్స్.. ఇండియాలో వేలాది మంది ఉద్యోగాలకు ఎసరు
- ●Mani Ratnam | అనౌన్స్ చేసిన ఆరు నెలల్లోనే రిలీజ్ - సాయిపల్లవి, మణిరత్నం మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

RGV | చిక్కుల్లో ఆర్జీవీ - 30 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ లీగల్ నోటీసులు

Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం

Ponnam Prabhakar | "ఓబీసీ కాలమ్" పెట్టాలని అమిత్ షాను అడగాలి

DK Aruna | దేశ భద్రత కోసమే సర్.. యువత ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ




