త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Surveillance | ఇళ్లలో ఏఐ నిఘాపై కేంద్రం ఫోకస్.. హోమ్ స‌ర్వీస్ యాప్స్‌పై ప్ర‌త్యేక దృష్టి..

AI Surveillance | ఇళ్లలో జరిగే కార్యకలాపాల రికార్డింగ్‌లపై ఏఐ ఆధారిత ప్రయోగాలు చేస్తున్న హోమ్-సర్వీసెస్ స్టార్టప్‌ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, ఏఐ ట్రైనింగ్ కోసం ఇళ్లలో సేకరించే డేటా వినియోగంపై తీవ్ర విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

S

Technology | Published On May 25, 2026, 3.00 pm IST

AI Surveillance | ఇళ్లలో ఏఐ నిఘాపై కేంద్రం ఫోకస్.. హోమ్ స‌ర్వీస్ యాప్స్‌పై ప్ర‌త్యేక దృష్టి..
Advertisement

AI Surveillance | ఇళ్లలో జరిగే కార్యకలాపాల రికార్డింగ్‌లపై ఏఐ ఆధారిత ప్రయోగాలు చేస్తున్న హోమ్-సర్వీసెస్ స్టార్టప్‌ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, ఏఐ ట్రైనింగ్ కోసం ఇళ్లలో సేకరించే డేటా వినియోగంపై తీవ్ర విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో హోమ్-సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో (Pronto) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇళ్లలో క్లీనింగ్, కిచెన్ పనుల సమయంలో వేరబుల్ కెమెరాల ద్వారా పరిమిత స్థాయిలో రికార్డింగ్‌లు నిర్వహించిన పైలట్ ప్రోగ్రామ్ వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా, టెక్ రంగాల్లో విమర్శలు పెరిగాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కూడా దృష్టి సారించినట్లు సమాచారం. దేశంలో రూపుదిద్దుకుంటున్న డేటా ప్రొటెక్షన్, ప్రైవసీ చట్టాల కింద ఇళ్లలో సేకరించే డేటా ఎలా నియంత్రించబడుతోంది అన్న అంశంపై ఆందోళనలు పెరగడంతో మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కంపెనీకి అధికారిక నోటీసు లేదా కమ్యూనికేషన్ ఏదీ అందలేదని పరిణామాలకు దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి.

ఏఐని మ‌రింత మెరుగ్గా మార్చేందుకే..

కంపెనీ వర్గాల ప్రకారం, ఈ నిర్ణయం తొందరపాటులో తీసుకోలేదని, ఇది కేవలం చాలా చిన్న యూజర్ సెగ్మెంట్‌కే పరిమితమని, సాధారణ వినియోగదారులపై ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం లేదా ఇతర విభాగాలు వివరాలు తెలుసుకోవాలనుకుంటే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. ఈ వివాదం కేవలం ఒక కంపెనీకి పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థలు రియల్ వరల్డ్ హ్యూమన్ యాక్టివిటీ డేటా కోసం పోటీ పడుతున్న పెద్ద మార్పుకు ఇది సంకేతమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇళ్లలో జరిగే పనులు, శారీరక కదలికలు, పునరావృత కార్యకలాపాలు వంటి డేటా భవిష్యత్తులో ఏఐ సిస్టమ్‌లను మరింత తెలివిగా మార్చేందుకు కీలకంగా మారుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. హోమ్-సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌లకు క్లీనింగ్, పాత్రలు కడగడం, కిచెన్ పనుల వంటి కార్యకలాపాల డేటా ఉద్యోగుల ట్రైనింగ్, ఆపరేషనల్ ఎఫిషెన్సీ, వర్క్‌ఫ్లో ఇంటెలిజెన్స్ మెరుగుపరచడంలో ఉపయోగపడే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. రియల్ వరల్డ్ వాతావరణాల్లో సేకరించే వీడియోలు, రికార్డింగ్‌లు భవిష్యత్తు ఏఐ మోడళ్లకు విలువైన డేటాసెట్‌లుగా మారుతున్నాయని అంటున్నారు.

కొత్త ఆదాయ మార్గాలు ఏర్ప‌డే అవ‌కాశం..

ఏఐ ఆధారిత ఈ ప్రయత్నాలను దీర్ఘకాలిక వ్యాపార అవకాశంగా కూడా చూస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ఏఐ ల్యాబ్‌లతో భాగస్వామ్యాలు ఏర్పడితే కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చని, ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే పార్ట్‌నర్‌లకు మెరుగైన చెల్లింపులు అందించవచ్చని, వినియోగదారులకు ధరలు పోటీ స్థాయిలో ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంద‌ని పేర్కొంటున్నారు. కాగా దేశంలో ఇన్‌స్టంట్ హోమ్-సర్వీసెస్ రంగం వేగంగా విస్తరిస్తోంది. అర్బ‌న్ కంపెనీ, ప్రోంటో, స్నాబిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లను మొత్తం కలిపి నెలవారీ యాక్టివ్ యూజర్‌లు ఈ ఏడాది ప్రారంభంలో 10 మిలియన్లను దాటినట్లు పరిశ్రమ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ కంపెనీలు ఇటీవల విస్తరణ కోసం కొత్త పెట్టుబడుల‌ను కూడా సమీకరించాయి.

నిఘా అవ‌స‌రం..

దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రైవసీ వ్యవస్థలు ఇళ్లలో సేకరించే ఏఐ రికార్డింగ్‌లను ఎలా నిల్వ చేస్తారు, తిరిగి ఎలా ఉపయోగిస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు అనే అంశాలను సమర్థంగా నియంత్రించేందుకు ఇంకా సరిపోవడం లేదని పాలసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు రికార్డింగ్‌లు తాత్కాలికమని, ఆప్షనల్ అని లేదా కొంతకాలం తర్వాత డిలీట్ చేస్తామని చెప్పినా, వాస్తవంగా ఆ డేటా ఎలా నిర్వహించబడుతోంది అనే విషయంలో వినియోగదారులకు స్వతంత్రంగా ధ్రువీకరించే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. డిలీట్ చేసిన తర్వాత కూడా ఆ డేటాలోని భాగాలు ఏఐ సిస్టమ్‌ల ట్రైనింగ్‌లో ఉపయోగపడుతున్నాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement