త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Starlink | స్టార్ లింక్ అనుమ‌తుల‌పై మ‌స్క్ ఘాటు వ్యాఖ్య‌లు.. కేంద్రం క్లారిటీ..

Starlink | శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు అనుమతుల విషయంలో భారత్‌ తన నియంత్రణ వ్యవస్థ న్యాయమైనదేన‌ని, ఎలాంటి వివక్షకు తావులేనిదేనని స్పష్టం చేసింది. భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల ప్రారంభాన్ని కొందరు ఒలిగార్క్‌లు (అధిక సంప‌న్న పారిశ్రామిక వేత్త‌లు) అడ్డుకుంటున్నారని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆరోపించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

S

Technology | Published On Oct 8, 2026, 12.19 pm IST

Starlink | స్టార్ లింక్ అనుమ‌తుల‌పై మ‌స్క్ ఘాటు వ్యాఖ్య‌లు.. కేంద్రం క్లారిటీ..
Advertisement

Starlink | శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు అనుమతుల విషయంలో భారత్‌ తన నియంత్రణ వ్యవస్థ న్యాయమైనదేన‌ని, ఎలాంటి వివక్షకు తావులేనిదేనని స్పష్టం చేసింది. భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల ప్రారంభాన్ని కొందరు ఒలిగార్క్‌లు (అధిక సంప‌న్న పారిశ్రామిక వేత్త‌లు) అడ్డుకుంటున్నారని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆరోపించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలను కొందరు ఒలిగార్క్‌లు అడ్డుకుంటున్నారని, తద్వారా భారత ప్రజలపై తమ గుత్తాధిపత్య పట్టును కొనసాగించుకోవాలని చూస్తున్నారని మస్క్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా వెల్లడించలేదు.

ఖండించిన మంత్రిత్వ శాఖ‌..

భారత టెలికాం మార్కెట్‌ ప్రస్తుతం ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో, సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ వంటి దిగ్గజ సంస్థల ఆధిపత్యంలో ఉంది. ఈ సంస్థలకు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ వ్యాపారాలతోపాటు మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కూడా భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు ప్రారంభ అనుమతులు పొందాయి. అయితే స్పెక్ట్రమ్‌ కేటాయింపు, తుది అనుమతుల కోసం మూడు సంస్థలు ఇంకా ఎదురుచూస్తున్నాయి. భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించిన నియంత్రణ వ్యవస్థపై స్పష్టత ఇచ్చింది. శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించిన భారత నియంత్రణ వ్యవస్థ న్యాయమైనదని, వివక్షారహితమైనదని పేర్కొంది. అన్ని టెలికమ్యూనికేషన్‌ సేవలకు, అందులో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు కూడా భాగమేనని, ఒకే విధమైన న్యాయమైన, వివక్షారహిత అనుమతి వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపింది.

భ‌ద్ర‌తా ప్ర‌మాలు త‌ప్ప‌నిస‌రి..

ప్రభుత్వం తెలిపిన ప్రకారం నాన్‌-జియోస్టేషనరీ శాటిలైట్‌ ఆర్బిట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సేవలను అందించే గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌ సేవల కింద మూడు సంస్థలకు టెలికాం లైసెన్సులు మంజూరయ్యాయి. భారత్‌లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిబద్ధతలో భాగంగానే ఈ అనుమతులు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే లైసెన్సుల నిబంధనల ప్రకారం ప్రతి సంస్థ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు అందించే సేవలు, వారి డేటా సురక్షితంగా ఉండేలా అవసరమైన భద్రతా ప్రమాణాలను సంస్థలు నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ ముగ్గురు లైసెన్సుదారుల భద్రతా అంచనా ప్రక్రియ కొనసాగుతోందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏదైనా ఒక సంస్థకు సంబంధించిన భద్రతా పరిశీలన పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సంస్థ తదుపరి దశలో స్పెక్ట్రమ్‌ కేటాయింపును కోరేందుకు ముందుకు వెళ్తుంద‌ని వివరించింది. ప్రస్తుతం మూడు సంస్థలూ దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల భారత నియంత్రణ వ్యవస్థ అన్యాయమైనదని లేదా వివక్షాపూరితంగా అమలు చేస్తున్నారని చెప్పడం నిరాధారమైనది, తప్పుదోవ పట్టించేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

గ‌తంలోనూ విభేదాలు..

స్టార్‌లింక్‌ విషయంలో మస్క్‌, అంబానీ, మిట్టల్‌ మధ్య విభేదాలు కొత్తవి కావు. భారత్‌లో శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయించాలనే అంశంపై గతంలో మస్క్‌, భారత వ్యాపార దిగ్గజాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే 2025లో ఈ ముగ్గురూ తమ విభేదాలను పక్కన పెట్టి, భారత్‌లో స్టార్‌లింక్‌ పరికరాల పంపిణీకి సంబంధించి వేర్వేరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌ భవిష్యత్తులో భారీ స్థాయికి చేరే అవకాశం ఉంది. డెలాయిట్‌ అంచనా ప్రకారం 2030 నాటికి భారత్‌లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌ విలువ 1.9 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. దీంతో భారత్‌ స్టార్‌లింక్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌గా మారింది.

https://twitter.com/elonmusk/status/2107854307077034294?s=20

ప్రాధాన్య‌త సంత‌రించుకున్న స్టార్ లింక్ ప్ర‌వేశం..

మరోవైపు, స్టార్‌లింక్‌కు భారత్‌లో మార్కెట్‌ ప్రవేశం కల్పించాలన్న అంశానికి అంతర్జాతీయ, దౌత్యపరమైన ప్రాధాన్యత కూడా ఏర్పడింది. టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాలతో వాణిజ్య చర్చల్లో అమెరికా స్టార్‌లింక్‌ మార్కెట్‌ ప్రవేశాన్ని సానుకూల సంబంధాలకు ఒక సూచికగా ముందుకు తెచ్చింది. భారత్‌, అమెరికా మధ్య కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినప్పటికీ, తుది వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఇరు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాగా భారత్‌లో స్టార్‌లింక్‌ పరికరాల లభ్యతపై భద్రతాపరమైన ఆందోళనలు కూడా గతంలో వ్యక్తమయ్యాయి. 2024 చివర్లో రెండు వేర్వేరు ఘటనల్లో స్టార్‌లింక్‌ పరికరాలను భారత అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో పోలీసులు చేపట్టిన మాదకద్రవ్యాల స్వాధీనం చర్యలో ఒకసారి, మణిపూర్‌లో సైన్యం నిర్వహించిన తనిఖీల సందర్భంగా మరోసారి స్టార్‌లింక్‌ పరికరాలు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.

https://twitter.com/PTI_News/status/2108053588614517144?s=20

మ‌స్క్ ఆరోప‌ణ‌లు తిర‌స్క‌ర‌ణ‌..

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో తన శాటిలైట్‌ బీమ్‌లు నిలిపివేశారని, వాస్తవానికి అవి భారత్‌పై ఎప్పుడూ యాక్టివ్‌గా లేవని మస్క్‌ గతంలో వ్యాఖ్య‌లు చేశారు. బుధవారం కూడా ఆయన ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో స్టార్‌లింక్‌ మాత్రమే ఆలస్యం ఎదుర్కొంటోందన్న వాదనను ఖండించింది. భద్రతా పరిశీలన ప్రక్రియ ముగ్గురు లైసెన్సుదారులకూ ఒకే విధంగా కొనసాగుతోందని, భద్రతా అనుమతులు పూర్తయిన తర్వాతే స్పెక్ట్రమ్‌ కేటాయింపు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభం కాకపోవడానికి ప్రభుత్వం ఏకపక్షంగా అడ్డంకులు సృష్టిస్తోందన్న మస్క్‌ ఆరోపణలను కేంద్రం పూర్తిగా తిరస్కరించింది. ప్రస్తుతం స్టార్‌లింక్‌, జియో, ఎయిర్‌టెల్‌ శాటిలైట్‌ సేవల సంస్థలు దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని కేంద్రం చెబుతోంది. భద్రతా అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్పెక్ట్రమ్‌ కేటాయింపు జరుగుతుందని, ఆ తర్వాతే వాణిజ్య సేవల ప్రారంభానికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement