త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | గూగుల్‌కు ఈయూ భారీ షాక్.. రూ.9 వేల కోట్లకుపైగా జరిమానా..

Google | యూరోపియన్ యూనియన్ (ఈయూ) అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌పై 890 మిలియన్ యూరోల‌ (సుమారు రూ.9వేల కోట్లు) జరిమానా విధించింది. ఈ నిర్ణయం అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

S

Technology | Published On Jul 23, 2026, 4.56 pm IST

Google | గూగుల్‌కు ఈయూ భారీ షాక్.. రూ.9 వేల కోట్లకుపైగా జరిమానా..
Advertisement

Google | యూరోపియన్ యూనియన్ (ఈయూ) అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌పై 890 మిలియన్ యూరోల‌ (సుమారు రూ.9వేల కోట్లు) జరిమానా విధించింది. ఈ నిర్ణయం అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయూ తెలిపిన వివ‌రాల ప్రకారం.. గూగుల్ తన సెర్చ్ ఫలితాల్లో ప్రత్యర్థి సేవలకు సమాన అవకాశాలు ఇవ్వకుండా గూగుల్ ఫ్లైట్స్, గూగుల్ హోటల్స్ వంటి సొంత సేవలకే అక్రమంగా ప్రాధాన్యత ఇచ్చింద‌ని తెలిపింది. ఈ ఉల్లంఘనకు గాను కంపెనీపై 460 మిలియన్ యూరోల జరిమానా విధించిన‌ట్లు వివ‌రించింది. అదే విధంగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెలుపల ఉచితంగా అందుబాటులో ఉన్న ఆఫర్లను వినియోగదారులకు చూపించేందుకు యాప్ డెవలపర్లకు అనుమతి ఇవ్వలేదని యూరోపియన్ కమిషన్ పేర్కొంది. ఈ అంశంపై మరో 430 మిలియన్ యూరోల జరిమానా విధించింది.

సొంత సేవ‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్న గూగుల్‌..?

ఈయూ టెక్నాలజీ విభాగం చీఫ్ హెన్నా విర్క్కునెన్ మాట్లాడుతూ ఈ నిర్ణయం ద్వారా మార్కెట్లో మరింత పోటీ పెరగడంతోపాటు ఇతర కంపెనీలకు కూడా కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. గూగుల్ ఇప్పటికీ తన సొంత సేవలకే ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రెండో జరిమానా మాత్రం మార్చి 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్య జరిగిన ఉల్లంఘనలకు సంబంధించినదని వివరించారు. అయితే ఈ నిర్ణయాన్ని గూగుల్ తీవ్రంగా తప్పుబట్టింది. గూగుల్ గ్లోబల్ అఫైర్స్ హెడ్ కెంట్ వాకర్ మాట్లాడుతూ ఈయూ నిబంధనల కారణంగా గూగుల్ ప్లేలోని భద్రతా వ్యవస్థలు బలహీనపడుతున్నాయని, వినియోగదారులు ఇష్టపడే అనేక ఫీచర్లను తొలగించాల్సి వస్తోందని అన్నారు. మంచి ఉత్పత్తులను మెరుగుపరచడం బదులు వాటిని దెబ్బతీసేలా నియంత్రణలు ఉండకూడదని అన్నారు. ఈ జరిమానాలు వాషింగ్టన్-బ్రస్సెల్స్ మధ్య కుదిరిన టారిఫ్ ఒప్పందానికి ఏడాది పూర్తికానున్న కొద్ది రోజుల ముందే రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రంప్ హెచ్చ‌రించినా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గతంలో కూడా అమెరికా టెక్ కంపెనీలను ఈయూ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ, ప్రతీకారంగా సుంకాలు విధించే అవకాశాన్ని హెచ్చరించింది. డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ (డీఎంఏ) కింద ఒకే కంపెనీపై ఇప్పటివరకు విధించిన అత్యధిక జరిమానాల్లో ఇవి ఒకటిగా నిలిచాయి. అంతకుముందు 2025లో మెటాపై 200 మిలియన్ యూరోలు, యాపిల్‌పై 500 మిలియన్ యూరోల‌ జరిమానాలు విధించింది. 2024లో అమల్లోకి వచ్చిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ ఉద్దేశం పెద్ద టెక్ కంపెనీల ఆధిపత్యాన్ని నియంత్రించి, డిజిటల్ మార్కెట్లో సమాన పోటీని ప్రోత్సహించడమే. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన సంస్థలపై వారి ప్రపంచవ్యాప్త వార్షిక ఆదాయంలో 10 శాతం వరకు జరిమానా విధించే అధికారం ఈయూకు ఉంటుంది. కాగా ఓ ఈయూ అధికారి తెలిపిన ప్రకారం.. ప్రస్తుతం గూగుల్‌పై విధించిన జరిమానా కంపెనీ మొత్తం ఆదాయంలో కేవలం 0.22 శాతం మాత్రమేన‌ని అన్నారు. అయితే కంపెనీ 60 రోజుల్లోగా ఈయూ ఆదేశాలను అమలు చేయకపోతే అదనపు రోజువారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంటుందని యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది.

సెర్చ్ ఇంజిన్‌లు నాణ్య‌త‌ను తేల్చ‌లేవు: ఈయూ

ఈయూ పోటీ వ్యవహారాల చీఫ్ తెరెసా రిబెరా మాట్లాడుతూ ఉత్తమ ఉత్పత్తులు తమ నాణ్యత ఆధారంగా విజయం సాధించాలి కానీ సెర్చ్ ఇంజిన్‌ను నిర్వహిస్తున్న కంపెనీ యాజమాన్యం వల్ల కాకూడదని స్పష్టం చేశారు. గూగుల్ మాత్రం ఈయూ తమ సేవలను బలవంతంగా బలహీనపరుస్తోందని ఆరోపించింది. యూరప్‌లో వినియోగదారులు ఇష్టపడే హోటళ్లు, విమానాలు, రెస్టారెంట్లకు సంబంధించిన రియల్‌టైమ్ ధరలు, తక్షణ లభ్యత వంటి సెర్చ్ ఫీచర్లను తొలగించాల్సి వస్తోందని కెంట్ వాకర్ తెలిపారు. ఇది న్యాయమైన పోటీ కాదని అన్నారు. కాగా గూగుల్‌కు ఈయూ జరిమానాలు విధించడం ఇదే తొలిసారి కాదు. 2017 నుంచి 2019 మధ్య మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 8.2 బిలియన్ యూరోల జరిమానాలు విధించింది. అలాగే గతేడాది సెప్టెంబర్‌లో మరో యాంటీట్రస్ట్ కేసులో 2.95 బిలియన్ యూరోల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ట్రంప్ ఈయూపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చ‌ట్టాల‌ను పూర్తిగా అమ‌లు చేస్తాం..

అయితే అమెరికా నుంచి వచ్చే ప్రతిస్పందనపై ఈయూ పెద్దగా ఆందోళన వ్యక్తం చేయడం లేదు. తమ సార్వభౌమ సంస్థలు రూపొందించిన చట్టాలను పూర్తిగా అమలు చేయడం తమ బాధ్యత అని తెరెసా రిబెరా స్పష్టం చేశారు. ఇలాంటి పోటీ వ్యతిరేక వ్యవహారాలపై అమెరికాలో కూడా విచారణలు జరుగుతున్నాయని, అక్కడి అధికారులు కూడా ఇదే తరహా అంశాలను పరిశీలిస్తున్నారని ఆమె చెప్పారు. డిజిటల్ నిబంధనలకు సంబంధించిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ ఏడాది అమెరికా, ఈయూ అంగీకరించినప్పటికీ, ఆ చర్చలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కాగా అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలు ఈయూ డిజిటల్ నిబంధనలు అమెరికా కంపెనీలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపిస్తూ, వాటిపై వాణిజ్య దర్యాప్తులు చేపట్టి అవసరమైతే అధిక సుంకాలు విధించాలని అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. అయితే హెన్నా విర్క్కునెన్ మాత్రం యూరప్ తన చట్టాల అమలులో ఎలాంటి రాజీ పడబోదని, తమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement