త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Drive | గూగుల్ డ్రైవ్ స్కానర్‌కు ఏఐ అప్‌గ్రేడ్.. మల్టీ పేజ్ స్కానింగ్‌తో కొత్త ఫీచర్లు..

Google Drive | గూగుల్ తన క్లౌడ్ ఆధారిత ఫైల్ స్టోరేజ్ సేవ అయిన గూగుల్ డ్రైవ్‌లో డాక్యుమెంట్ స్కానర్‌ను మరింత ఆధునికంగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం దశలవారీగా విడుదలవుతున్న ఈ అప్‌డేట్‌లో స్మార్టర్ ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతోపాటు పూర్తిగా కొత్త డిజైన్‌ను అందించింది.

S

Technology | Published On Jun 3, 2026, 3.11 pm IST

Google Drive | గూగుల్ డ్రైవ్ స్కానర్‌కు ఏఐ అప్‌గ్రేడ్.. మల్టీ పేజ్ స్కానింగ్‌తో కొత్త ఫీచర్లు..
Advertisement

Google Drive | గూగుల్ తన క్లౌడ్ ఆధారిత ఫైల్ స్టోరేజ్ సేవ అయిన గూగుల్ డ్రైవ్‌లో డాక్యుమెంట్ స్కానర్‌ను మరింత ఆధునికంగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం దశలవారీగా విడుదలవుతున్న ఈ అప్‌డేట్‌లో స్మార్టర్ ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతోపాటు పూర్తిగా కొత్త డిజైన్‌ను అందించింది. ముఖ్యంగా ఒకేసారి అనేక పేజీలను స్కాన్ చేసే స్మార్ట్ బ్యాచ్ స్కానింగ్ ఫీచర్‌తోపాటు బ్లర్ అయిన ఫోటోలను ఆటోమేటిక్‌గా మెరుగైన చిత్రాలతో భర్తీ చేసే ఆటో-బెస్ట్ ఫ్రేమ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ ప్రెసిడెంట్ స‌మీర్ స‌మ‌త్ ఆండ్రాయిడ్‌లో గూగుల్ డ్రైవ్‌కు కొత్తగా రూపొందించిన డాక్యుమెంట్ స్కానర్ విడుదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త స్కానింగ్ అనుభవాన్ని చూపిస్తూ ఆయన ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియోను కూడా షేర్ చేశారు.

ఒకేసారి అనేక పేజీల స్కానింగ్‌..

కొత్త వెర్షన్‌లో మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ ఆధారంగా మరింత క్లీన్‌గా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందించారు. గతంలో గూగుల్ డ్రైవ్ యాప్‌లో కుడి పైభాగంలో కనిపించే బీకర్ ఐకాన్‌ను తాజా అప్‌డేట్‌లో తొలగించారు. అప్‌గ్రేడ్ చేసిన స్కానర్‌లో ప్రధాన ఆకర్షణ స్మార్ట్ బ్యాచ్ స్కానింగ్ ఫీచర్. దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి అనేక పేజీలను స్కాన్ చేయవచ్చు. స్కాన్ చేసిన పేజీలను సిస్టమ్ స్వయంచాలకంగా విడివిడిగా డాక్యుమెంట్లుగా విభజిస్తుంది. ఇది సాధారణంగా ఒక్కో పేజీకి ఒక్కో ఫోటో తీసే విధానం కాకుండా వీడియో రికార్డింగ్ మాదిరిగా పనిచేస్తుంది. దీంతో పెద్ద డాక్యుమెంట్లను స్కాన్ చేయడం మరింత వేగంగా, సులభంగా మారుతుంది. కొత్త అప్‌డేట్‌లో డూప్లికేషన్ డిటెక్షన్ అనే ఫీచర్‌ను కూడా చేర్చారు. ఒకే పేజీని రెండుసార్లు స్కాన్ చేసే పరిస్థితిని ఇది నివారిస్తుంది. ఇప్పటికే స్కాన్ చేసిన పేజీని సిస్టమ్ వెంటనే గుర్తించి దాన్ని మళ్లీ సేవ్ చేయకుండా స్కిప్ చేస్తుంది.

8జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ల‌కే..

ఆటో-బెస్ట్ ఫ్రేమ్ మరో కీలక ఫీచర్. స్కానింగ్ సమయంలో బ్లర్ అయిన లేదా నాణ్యత తక్కువగా ఉన్న చిత్రాలను ఇది స్వయంచాలకంగా గుర్తించి అందుబాటులో ఉన్న ఉత్తమ నాణ్యత క‌లిగిన ఫ్రేమ్‌తో భర్తీ చేస్తుంది. దీంతో డాక్యుమెంట్ స్కాన్‌ల స్పష్టత గణనీయంగా మెరుగుపడుతుంది. గూగుల్ తెలిపిన‌ ప్రకారం ఈ కొత్త స్కానర్ ప్రస్తుతం కనీసం 8 జీబీ ర్యామ్ ఉన్న హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది నేరుగా గూగుల్ ప్లే సర్వీసెస్ ద్వారా పనిచేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ చేసిన గూగుల్ డ్రైవ్ స్కానర్ పూర్తిగా ఆన్-డివైస్ ప్రాసెసింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఉపయోగించవచ్చు. వినియోగదారుల డేటా పూర్తిగా డివైస్‌లోనే ప్రాసెస్ కావడంతో గోప్యతకు అధిక ప్రాధాన్యం లభిస్తుందని గూగుల్ వెల్లడించింది. అలాగే ఈ కొత్త డాక్యుమెంట్ స్కానర్ ఫైల్స్ బై గూగుల్ యాప్‌లో కూడా ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

Advertisement
Advertisement