త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Traffic Challans | ఫేక్ ట్రాఫిక్ చ‌లాన్ల‌తో జాగ్ర‌త్త‌.. ల‌క్ష‌లు పోగొట్టుకుంటున్న బాధితులు..

Fake Traffic Challans | ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ సైబర్ నేర‌స్థులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల్లో ప్ర‌జ‌ల డ‌బ్బును దోచేస్తూనే ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న విధానాల్లో వారు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలో అన్ని చోట్లా ప్ర‌స్తుతం సైబ‌ర్ నేరాలు గ‌ణనీయంగా పెరిగిపోయాయి.

S

Technology | Published On Dec 22, 2025, 2.32 pm IST

Fake Traffic Challans | ఫేక్ ట్రాఫిక్ చ‌లాన్ల‌తో జాగ్ర‌త్త‌.. ల‌క్ష‌లు పోగొట్టుకుంటున్న బాధితులు..
Advertisement

Fake Traffic Challans | ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ సైబర్ నేర‌స్థులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల్లో ప్ర‌జ‌ల డ‌బ్బును దోచేస్తూనే ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న విధానాల్లో వారు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలో అన్ని చోట్లా ప్ర‌స్తుతం సైబ‌ర్ నేరాలు గ‌ణనీయంగా పెరిగిపోయాయి. ఇక తాజాగా పూణెలో ఫేక్ ట్రాఫిక్ చ‌లాన్ల పేరిట సైబ‌ర్ నేర‌స్థులు ప్ర‌జ‌ల డ‌బ్బును కాజేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు వాట్సాప్‌కు మెసేజ్ పంపి ప్ర‌జ‌లు ఆ మెసేజ్‌ల‌ను ఓపెన్ చేసేలా భ‌య‌పెడుతున్నారు. దీంతో ఆ మెసేజ్‌పై క్లిక్ చేయ‌గానే ఫోన్‌లో ఓ యాప్ ఆటోమేటిక్‌గా ఇన్ స్టాల్ అవుతుంది. అనంత‌రం నేర‌స్థులు ఆ ఫోన్‌ను హ్యాక్ చేసి అందులో ఉన్న స‌మాచారం దొంగిలిస్తున్నారు. అలాగే హ్యాక్ చేయ‌బ‌డిన ఫోన్ ద్వారా ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును త‌మ ఖాతాల‌కు పంపించుకుంటూ పెద్ద ఎత్తున మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా నేరాలు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని పూణె పోలీసులు తెలియ‌జేశారు.

ల‌క్ష‌లు పోయాయి..

పూణెలోని సింహ‌గ‌డ్ రోడ్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తికి డిసెంబ‌ర్ 5వ తేదీన వాట్సాప్‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. అందులో ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించార‌ని చెబుతూ చ‌లాన్ క‌ట్టాల‌ని ఉంది. వెంట‌నే మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేసి చ‌లాన్ కట్టాల‌ని, లేదంటే చ‌ట్ట‌రీత్యా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆ మెసేజ్‌లో చెప్పారు. దీంతో భ‌య‌ప‌డ్డ ఆ వ్య‌క్తి వెంట‌నే ఆ మెసేజ్‌ను ఓపెన్ చేయ‌గా అత‌ని ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ అయింది. ఆ త‌రువాత కాసేప‌టికి అత‌ని ఫోన్ హ్యాక్ అయింది. అనంత‌రం అత‌ని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.5 ల‌క్ష‌ల‌ను కోల్పోయిన‌ట్లు గ్ర‌హించాడు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయి పూణె సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే మ‌రో సంఘ‌ట‌న‌లో అక్క‌డి చించ్‌వాడ్ అనే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్య‌క్తికి కూడా ట్రాఫిక్ చ‌లాన్ పేరిట ఓ మెసేజ్ వ‌చ్చింది. అందులో ఓ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాల‌ని చెప్పారు. దీంతో వెంట‌నే ఆ వ్య‌క్తి ఆ మెసేజ్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న యాప్‌ను ఫోన్ లో ఇన్‌స్టాల్ చేశాడు. ఆ త‌రువాత అత‌ని ఫోన్ హ్యాక్ అయి అత‌ని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.49 ల‌క్ష‌ల‌ను నష్ట‌పోయాడు. దీంతో వెంట‌నే అత‌ను కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

వేగంగా కొన‌సాగుతున్న స్కామ్‌..

ప్ర‌స్తుతం ఇలాంటి న‌కిలీ ట్రాఫిక్ చ‌లాన్ మెసేజ్‌లు చాలా మందికి వ‌స్తున్నాయ‌ని, వాటికి భ‌య‌ప‌డి చాలా మంది సైబ‌ర్ నేర‌స్థుల బారిన ప‌డుతున్నార‌ని, దీంతో ల‌క్ష‌ల రూపాయ‌లు పోగొట్టుకుంటున్నార‌ని పూణె పోలీసులు వెల్ల‌డించారు. సాధార‌ణంగా ఒక వ్య‌క్తికి ఇలాంటి మెసేజ్ వ‌చ్చి అత‌ను మోసానికి గురైతే అత‌ని కాంటాక్ట్ లిస్ట్ అప్ప‌టికే హ్యాక‌ర్ల‌కు చేరి ఉంటంది క‌నుక వారు ఆ కాంటాక్ట్‌ల‌కు కూడా అలాంటి మెసేజ్‌ల‌ను పంపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో పెద్ద ఎత్తున చాలా మందికి ఇలాంటి మెసేజ్‌లు ఒకేసారి వ‌స్తుంటాయి. దీని వల్ల ఈ స్కాం వేగంగా జ‌రిగిపోతుంద‌ని పోలీసులు తెలిపారు. క‌నుక ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇలాంటి మెసేజ్‌లు వ‌స్తే స్పందించ‌కూడ‌ద‌ని, కేవ‌లం అధికారిక యాప్ లేదా వెబ్ సైట్‌లోనే ప్ర‌జ‌లు త‌మ వాహ‌నాల‌కు ఉన్న చ‌లాన్ల‌ను చెక్ చేసుకోవాల‌ని, వాట్సాప్‌లో వ‌చ్చే లింక్‌ల‌ను అస‌లు ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని పూణె పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement