త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్

Eatala Rajender | జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్ప‌ష్టం చేశారు.

G

Hyderabad | Published On Oct 29, 2026, 12.11 pm IST

Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
Advertisement

Eatala Rajender | త్రినేత్ర న్యూస్‌: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్ప‌ష్టం చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును (Jawahar Nagar Dumping Yard) తరలించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన `జవహర్‌నగర్ జన సంకల్ప యాత్ర` మూడో రోజు కీసర నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయనకు బాధితులు, స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

డంపింగ్ యార్డు నుంచి వెలువడే లీచేట్‌ నీటితో చెరువులు కలుషితమయ్యాయని, బోర్లలోనూ పచ్చటి నీరు వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నార‌ని వెల్ల‌డించారు. డంపింగ్ యార్డు నిర్వహణను చేపడుతున్న రాంకీ (Ramky) సంస్థ పనితీరుపైనా ఆయన విమర్శలు చేశారు. చెత్త నిర్వహణను కేవలం ఆదాయ, వ్యయాల కోణంలో కాకుండా ప్రజారోగ్య కోణంలో చూడాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చెత్త నుంచి సంపద సృష్టించే సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయని, ఒక్క గ్రాము చెత్త కూడా వృథా కాకుండా రీసైక్లింగ్ చేసే విధానాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.

రాజకీయ కోణంలో చూడకుండా..

ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న తాను జవహర్‌నగర్ సమస్య పరిష్కారానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. `సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెంటనే డీపీఆర్‌ తయారు చేయించాలి. నిధులు ఇప్పించే బాధ్యత నాది. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందనే నమ్మకంతోనే ఈ పాదయాత్ర ప్రారంభించాను` అని పేర్కొన్నారు. డంపింగ్ యార్డు తొలగింపునకు సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం, రూ.లక్ష కోట్లతో మూసీ ప్రక్షాళన ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యను రాజకీయాల కోణంలో చూడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమస్యకు పరిష్కారం లభించే వరకు..

డంపింగ్ యార్డు (Dumping Yard) పరిసర ప్రాంతాల్లోని పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పిల్లలు, వృద్ధులు సహా స్థానిక ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు వారి సమస్యలను పట్టించుకోవాలని, ప్రజలను నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకుని వదిలేయకూడదని వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్ బాధితుల కోసం చేపట్టిన పోరాటం డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం లభించే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు బాధితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ పోరాటానికి మద్దతివ్వాలన్నారు. శుక్ర‌వారం జవహర్‌నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Advertisement
Advertisement