త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | ఐఫోన్ల‌ను అమ్మేందుకు యాపిల్ పాట్లు.. పెరిగిన ధ‌ర‌ల‌కు కౌంట‌ర్‌గా ఆఫ‌ర్లు..

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే త‌న నూత‌న ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫోన్ల ధ‌ర‌లు భారీగా ఉండ‌డంతోపాటు గత మోడ‌ల్స్ ధ‌ర‌ల‌ను కూడా ఆ సంస్థ పెంచింది. అయితే భార‌త్ వంటి డిమాండ్ ఉన్న మార్కెట్ల‌లో కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షించాలంటే రేట్ల‌ను పెంచ‌కూడ‌దు.

S

Technology | Published On Sep 14, 2026, 3.46 pm IST

Apple | ఐఫోన్ల‌ను అమ్మేందుకు యాపిల్ పాట్లు.. పెరిగిన ధ‌ర‌ల‌కు కౌంట‌ర్‌గా ఆఫ‌ర్లు..
Advertisement

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే త‌న నూత‌న ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫోన్ల ధ‌ర‌లు భారీగా ఉండ‌డంతోపాటు గత మోడ‌ల్స్ ధ‌ర‌ల‌ను కూడా ఆ సంస్థ పెంచింది. అయితే భార‌త్ వంటి డిమాండ్ ఉన్న మార్కెట్ల‌లో కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షించాలంటే రేట్ల‌ను పెంచ‌కూడ‌దు. త‌గ్గించాలి. కానీ తాజాగా అందుకు భిన్నంగా జ‌ర‌గ‌డంతో యాపిల్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. వాస్త‌వానికి ధ‌ర‌ల‌ను పెంచిన‌ప్ప‌టికీ ఆఫర్లు, రాయితీల పేరుతో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతోంది. ధ‌ర‌ల పెంపు వల్ల వినియోగ‌దారుల‌పై ప‌డే భారాన్ని త‌గ్గించేందుకే యాపిల్ ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ క‌స్ట‌మ‌ర్లను ఆక‌ర్షించ‌డం అంత ఆషామాషీ కాద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

అమ్మ‌కాలు త‌గ్గుతాయ‌నే ఆందోళ‌న‌తోనే..

కొత్త ఐఫోన్ మోడ‌ల్స్ రిలీజ్ అయితే సాధార‌ణంగా పాత ఐఫోన్ మోడ‌ల్స్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జ‌రిగింది. అయితే అందుకు కార‌ణం కూడా ఉంది. ఏఐ కార‌ణంగా డేటా సెంట‌ర్ల‌కు చిప్‌ల కొర‌త ఏర్ప‌డుతుండడంతో ఆ ప్ర‌భావం ఫోన్లు, కంప్యూట‌ర్ల‌పైనా ప‌డింది. దీంతో ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. యాపిల్ కూడా గ‌త కొంత కాలంగా ఇదే విష‌య‌మై ఆలోచ‌న‌లో ఉండ‌గా, తాజాగా కొత్త ఐఫోన్ల సిరీస్ లాంచింగ్ అనంతరం పాత ఐఫోన్ మోడ‌ల్స్ ధ‌ర‌ల‌ను అమాంతం పెంచింది. అయితే ధ‌ర‌ల పెంపు వ‌ల్ల అమ్మ‌కాలు భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్న మార్కెట్ వ‌ర్గాల అంచ‌నాల నేప‌థ్యంలో ఇప్పుడు యాపిల్ అమ్మ‌కాల‌ను పెంచుకునేందుకు ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ముఖ్యంగా క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు, ఫోన్ ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌, సుల‌భ ఈఎంఐలు వంటి ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తోంది. దీంతో అమ్మ‌కాల‌ను కాస్త‌యినా పెంచుకోవాల‌ని సంస్థ ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఏయే ఐఫోన్లపై ఆఫ‌ర్లు..

భారత్‌లో ఐఫోన్ల ప్రారంభ ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐఫోన్ కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిందేనంటూ గతంలో వినిపించిన సరదా వ్యాఖ్యలు మరోసారి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఆఫర్ల ప్రకారం ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ డ్యుయో కొనుగోలుపై గరిష్ఠంగా రూ.7వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తోంది. ఐఫోన్ 17పై రూ.5వేల వరకు, ఐఫోన్ ఎయిర్‌పై రూ.4వేల వరకు, ఐఫోన్ 17ఈ, ఐఫోన్ 16పై రూ.3వేల చొప్పున, ఐఫోన్ 15పై రూ.2వేల వరకు నగదు వెనక్కి పొందవచ్చని రిటైల్ వర్గాలు తెలిపాయి. పాత ఫోన్‌ను మార్చి కొత్త ఐఫోన్ తీసుకునే వారికి అదనపు ప్రయోజనం కూడా ఉంటుంది. మార్పిడి చేసే పాత ఫోన్ విలువ ఆధారంగా ఈ ప్రయోజనం మారుతుంది. ఐఫోన్ డ్యుయో, ఐఫోన్ 18 ప్రొ సిరీస్‌కు రూ.10వేల వరకు, ఐఫోన్ 17కు రూ.8వేల వరకు అదనపు మార్పిడి ప్రయోజనం లభించనుంది.

నో కాస్ట్ ఈఎంఐ కూడా..

కొనుగోలు మొత్తాన్ని విడతలుగా చెల్లించేందుకు కూడా యాపిల్ మరిన్ని మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 17ను 18 నెలలు లేదా 24 నెలల వడ్డీ లేని సమాన నెలవారీ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. ఇతర ఐఫోన్ మోడళ్లకు కూడా వేర్వేరు కాలపరిమితులతో ఆర్థిక సదుపాయాలు ఉన్నాయి. కార్డు ద్వారా సమాన నెలవారీ వాయిదా తీసుకుంటే ఆరు నెలల వరకు వడ్డీ ఉండదు. ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే తక్కువ వడ్డీతో చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ప్రాసెసింగ్ రుసుము వర్తిస్తుంది. యాపిల్ అందిస్తున్న మరో సదుపాయం ఐఫోన్ ఫర్ లైఫ్ పథకం. ఇందులో ఫోన్ ధరలో 75 శాతాన్ని 24 నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. మిగిలిన 25 శాతాన్ని రెండేళ్ల తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభ చెల్లింపు అవసరం లేకుండా 24 నెలల వడ్డీ లేని సమాన నెలవారీ వాయిదా సదుపాయం ఇందులో ఉంటుంది.

భారీగా పెరిగిన ధ‌ర‌లు..

భారత్‌లో యాపిల్ పలు ఐఫోన్ మోడళ్ల ధరలను ఈ వారం ప్రారంభంలోనే పెంచింది. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.99,900కు చేరింది. గతంలో ఇది రూ.82,900గా ఉండగా, ఇప్పుడు 20.5 శాతం పెరిగింది. ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధరలు వరుసగా రూ.1,64,900, రూ.1,79,900గా ఉన్నాయి. ఇవి ఐఫోన్ 17 ప్రొ మోడళ్లతో పోలిస్తే వరుసగా 22 శాతం, 20 శాతం అధికం. ఇక యాపిల్ మడతపెట్టే ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టి ఐఫోన్ డ్యుయోను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2,99,900గా ఉంది. ఐఫోన్ ఎయిర్ ధరలు అత్యధికంగా పెరిగాయి. 256 జీబీ, 512 జీబీ మోడళ్ల ధరలు 25 శాతం పెరిగాయి. 1 టెరాబైట్ మోడల్ ధర ఏకంగా 40.6 శాతం పెరిగి రూ.1,59,900 నుంచి రూ.2,24,900కు చేరింది. ఐఫోన్ 17ఈ ధర 23.1 నుంచి 23.6 శాతం వరకు పెరిగింది. 128 జీబీ ఐఫోన్ 16 ధర రూ.89,900కు చేరగా, ఇది 28.6 శాతం పెరుగుదల. ఐఫోన్ 18 ప్రొ 2 టెరాబైట్ మోడల్ ధర రూ.3,14,900 వరకు, ప్రొ మ్యాక్స్ ధర రూ.3,29,900 వరకు, ఐఫోన్ డ్యుయో 2 టెరాబైట్ మోడల్ ధర రూ.4,49,900 వరకు ఉంది.

బ్యాంకుల‌తో ఒప్పందం..

ఈ ఆఫర్ల కోసం యాపిల్ పలు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డు ఆఫర్లకు భాగస్వాములుగా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీబీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, టీవీఎస్ క్రెడిట్ సంస్థలు ఆర్థిక సదుపాయాలను అందిస్తున్నాయి. పాత పరికరాల మార్పిడికి క్యాషిఫై, సర్విఫై భాగస్వాములుగా ఉన్నాయని రిటైల్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఆఫ‌ర్లను యాపిల్ అన‌ధికారికంగానే అమ‌లు చేస్తోంది. ఎక్క‌డా వివ‌రాల‌ను అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధన డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోళ్లలో అందుబాటు ఆఫర్ల ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే అందుబాటు ఆఫర్లు మెరుగుపడ్డాయని, వినియోగదారులు ఇతర ఆఫర్ల కంటే నగదు వెనక్కి ఇచ్చే ఆఫర్లను ఇప్పటికీ ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిపారు. అలాగే వడ్డీ లేని సమాన నెలవారీ వాయిదాలు, పాత ఫోన్ మార్పిడిపై ఆసక్తి పెరుగుతోందన్నారు. ముఖ్యంగా పాత ఫోన్ మార్పిడి రేటు రెండంకెల స్థాయికి చేరిందని, ఐఫోన్ కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది సగటున 18 నెలల వాయిదా కాలాన్ని ఎంచుకుంటున్నారని వివరించారు.

Advertisement
Advertisement