త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | ఐఫోన్ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు చెల్లిస్తున్న యాపిల్‌.. ఎందుకంటే..?

Apple | అమెరికాలోని ఐఫోన్ వినియోగదారులకు సిరి ప్రైవసీ వివాదానికి సంబంధించిన సెటిల్‌మెంట్ డబ్బులు చేరడం ప్రారంభమైంది. సిరి వాయిస్ అసిస్టెంట్ అనుకోకుండా సంభాషణలను రికార్డ్ చేసిందన్న ఆరోపణలపై దాఖలైన క్లాస్ యాక్షన్ కేసులో భాగంగా, ఆపిల్ 95 మిలియన్ డాలర్ల పరిహారానికి అంగీకరించింది.

S

Technology | Published On Jan 26, 2026, 9.25 am IST

Apple | ఐఫోన్ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు చెల్లిస్తున్న యాపిల్‌.. ఎందుకంటే..?
Advertisement

Apple | అమెరికాలోని ఐఫోన్ వినియోగదారులకు సిరి ప్రైవసీ వివాదానికి సంబంధించిన సెటిల్‌మెంట్ డబ్బులు చేరడం ప్రారంభమైంది. సిరి వాయిస్ అసిస్టెంట్ అనుకోకుండా సంభాషణలను రికార్డ్ చేసిందన్న ఆరోపణలపై దాఖలైన క్లాస్ యాక్షన్ కేసులో భాగంగా, ఆపిల్ 95 మిలియన్ డాలర్ల పరిహారానికి అంగీకరించింది. ఈ సెటిల్‌మెంట్ కింద అర్హులైన వినియోగదారులకు ఈ వారం నుంచే డైరెక్ట్ డిపాజిట్ రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని పలువురు వినియోగదారులు వెల్లడించారు. తప్పు చేసినట్లు ఒప్పుకోకపోయినా, కేసును ముగించేందుకు గత ఏడాది యాపిల్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. 2025 మధ్యలో యూజర్ల దావాలను ఆమోదించిన తరువాత, ఇప్పుడు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది.

2019లో క‌థ‌నంతో వెలుగులోకి..

9టు5మ్యాక్ నివేదిక ప్రకారం, గడువులోపు దరఖాస్తు చేసిన అర్హులైన వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో లేదా పేమెంట్ యాప్‌లలో ఇప్పటికే డబ్బులు జమ అవుతున్నాయి. గిఫ్ట్ కార్డులు లేదా చెక్‌ల రూపంలో చెల్లింపులు కోరినవారికి మాత్రం ఇంకా కొంత ఆలస్యం కావచ్చని సెటిల్‌మెంట్ నిర్వాహకులు తెలిపారు. వారు ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లతో పాటు స్పామ్ ఫోల్డర్లు, అలాగే పోస్టల్ మెయిల్‌ను కూడా పరిశీలించాలని సూచించారు. కాగా 2019లో ది గార్డియన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, సిరి పనితీరు మెరుగుపరిచే నిమిత్తం యాపిల్ కాంట్రాక్టర్లు కొన్ని ఆడియో రికార్డింగ్స్‌ను వినేవారని, వాటిలో వ్యక్తిగత సంభాషణలు కూడా ఉండేవని వెల్లడైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, ఆపిల్ స్పందిస్తూ, మొత్తం సిరి ఇంటరాక్షన్లలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే సమీక్షించబడతాయని, అవి వినియోగదారుల గుర్తింపుతో అనుసంధానించబడవని స్పష్టం చేసింది.

ఒక్కో డివైస్‌కు 8 డాల‌ర్లు..

అయితే, ఈ సూట్‌ ప్రధానంగా సిరి అనుకోకుండా యాక్టివేట్ అవడం వల్ల వినియోగదారులు తెలియకుండానే వారి సంభాషణలు రికార్డ్ అయ్యాయన్న అంశంపై కేంద్రీకృతమైంది. ఈ కేసు సెటిల్‌మెంట్‌కు అర్హత పొందాలంటే, వినియోగదారులు 2014 సెప్టెంబర్ 17 నుంచి 2024 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనీసం ఒక సిరి-ఎనేబుల్డ్ యాపిల్ డివైస్‌ను ఉపయోగించి ఉండాలి. అలాగే, ఆ సమయంలో తమ అనుమతి లేకుండా సిరి యాక్టివేట్ అయిందని వారు పేర్కొనాలి. ప్రతి వినియోగదారుడు గరిష్టంగా ఐదు డివైస్‌ల వరకు క్లెయిమ్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. మొత్తం సెటిల్‌మెంట్ మొత్తం 95 మిలియన్ డాలర్లు అయినప్పటికీ, ఒక్కో డివైస్‌కు వచ్చే పరిహారం మొదట అంచనా వేసిన దానికంటే తక్కువగా లెక్కించబడింది. ప్రారంభంలో ఒక్కో డివైస్‌కు 20 డాలర్ల వరకు, గరిష్టంగా 100 డాలర్లు లభిస్తాయని భావించారు. అయితే తరువాత సెటిల్‌మెంట్ నిర్వాహకులు లెక్కలు తేల్చిన ప్రకారం, ఒక్కో డివైస్‌కు సుమారు 8.02 డాలర్లు మాత్రమే చెల్లించనున్నారు. ఐదు డివైస్‌లకు క్లెయిమ్ చేసినవారికి గరిష్టంగా 40.10 డాలర్లు అందనున్నాయి.

ఈ వివాదం తర్వాత యాపిల్ తన విధానాల్లో మార్పులు చేసింది. సిరి రికార్డింగ్‌ల సమీక్షకు వినియోగదారుల స్పష్టమైన అనుమతి (ఆప్ట్-ఇన్) తప్పనిసరి చేసింది. అలాగే, బాహ్య కాంట్రాక్టర్ల ద్వారా ఈ పని చేయడం నిలిపివేసింది. సిరి రికార్డింగ్‌లను ఎప్పుడూ ప్రకటనల కోసం ఉపయోగించలేదని, అవి యాపిల్ ఖాతాలతో అనుసంధానించబడలేదని కంపెనీ పునరుద్ఘాటించింది. అయినప్పటికీ, వివాదానికి ముగింపు పలకడానికి ఈ సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్లు యాపిల్ తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement