త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

APK File Frauds | ఏపీకే ఫైల్స్ మోసాల‌తో రెచ్చిపోతున్న సైబ‌ర్ నేర‌స్థులు.. జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే డ‌బ్బులు పోతాయి..

APK File Frauds | డిసెంబ‌ర్ 11వ తేదీన నాంప‌ల్లికి చెందిన ఓ కోర్టు ఉద్యోగికి జ‌ల‌మండ‌లి వారు పంపిన‌ట్లు వారి లోగోతో వాట‌ర్ బిల్లు చెల్లించాల‌ని ఓ వాట్సాప్ మెసేజ్ వ‌చ్చింది. వెంట‌నే బిల్లు చెల్లించాల‌ని, లేదంటే క‌నెక్ష‌న్ క‌ట్ చేస్తామ‌ని ఆ మెసేజ్‌లో హెచ్చ‌రించారు. దీంతో అత‌ను ఆ మెసేజ్ ద్వారా వ‌చ్చిన ఓ రెండు ఏపీకే ఫైల్స్‌ను త‌న ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు.

S

Technology | Published On Dec 27, 2025, 6.02 pm IST

APK File Frauds | ఏపీకే ఫైల్స్ మోసాల‌తో రెచ్చిపోతున్న సైబ‌ర్ నేర‌స్థులు.. జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే డ‌బ్బులు పోతాయి..
Advertisement

APK File Frauds | డిసెంబ‌ర్ 11వ తేదీన నాంప‌ల్లికి చెందిన ఓ కోర్టు ఉద్యోగికి జ‌ల‌మండ‌లి వారు పంపిన‌ట్లు వారి లోగోతో వాట‌ర్ బిల్లు చెల్లించాల‌ని ఓ వాట్సాప్ మెసేజ్ వ‌చ్చింది. వెంట‌నే బిల్లు చెల్లించాల‌ని, లేదంటే క‌నెక్ష‌న్ క‌ట్ చేస్తామ‌ని ఆ మెసేజ్‌లో హెచ్చ‌రించారు. దీంతో అత‌ను ఆ మెసేజ్ ద్వారా వ‌చ్చిన ఓ రెండు ఏపీకే ఫైల్స్‌ను త‌న ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. వాటిల్లో త‌న క్రెడిట్ కార్డు ద్వారా బిల్లు చెల్లించేందుకు స‌మాచారం న‌మోదు చేశాడు. త‌రువ‌వాత అత‌ని క్రెడిట్ కార్డు నుంచి మొత్తం 3 ట్రాన్సాక్ష‌న్లు జ‌ర‌గ్గా రూ.1.36 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకున్నాడు. అలాగే మ‌రో సంఘ‌ట‌న‌లో కొండాపూర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి డిసెంబ‌ర్ 3న వాట్సాప్‌కు ఆర్‌టీవో చ‌లాన్‌.ఏపీకే పేరిట ఓ ఫైల్ మెసేజ్ రూపంలో వ‌చ్చింది. దీంతో అది నిజ‌మే అని న‌మ్మిన ఆ వ్య‌క్తి ఆ ఫైల్‌ను డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశాడు. ఆర్‌టీవో చ‌లాన్ చెల్లింపులు చేసేందుకు య‌త్నించాడు. దీంతో కొన్ని గంట‌ల్లోనే అత‌ని క్రెడిట్ కార్డు నుంచి 3 లావాదేవీలు జ‌రిగాయి. వాటిల్లో అత‌ను మొత్తం రూ.3.49 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకున్నాడు.

ఫోన్ల హ్యాకింగ్‌.. డ‌బ్బు చోరీ..

పైన ఉద‌హ‌రించిన రెండు సంఘ‌ట‌న‌లు ఈమ‌ధ్య కాలంలోనే జ‌రిగాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌స్తుతం త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి. సైబ‌ర్ నేరస్థులు ఏపీకే ఫైల్స్ పేరిట న‌కిలీ యాప్ ల‌ను ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. వాటిని వారు పీఎం కిసాన్‌.ఏపీకే, ఆర్‌టీవో చ‌లాన్‌.ఏపీకే, ఎల‌క్ట్రిసిటీ బిల్‌.ఏపీకే, ఎన్‌సీపీఐ కంప్లెయింట్‌. ఏపీకే, పీఎన్‌బీ వ‌న్‌.ఏపీకే పేరిట పంపిస్తున్నారు. దీంతో ఆయా మెసేజ్ లు నిజ‌మే అని నమ్మిన ప్ర‌జ‌లు వాటిపై ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నారు. దీంతో వెంట‌నే ఆ న‌కిలీ యాప్‌లు ఫోన్ల‌లో ఇన్ స్టాల్ అవుతున్నాయి. త‌రువాత ఆ యాప్‌లు ఫోన్ల‌ను హ్యాక్ చేసి వాటిల్లో ఉన్న స‌మాచారాన్ని హ్యాక‌ర్ల‌కు చేర‌వేస్తున్నాయి. దీంతో కొన్ని నిమిషాలు లేదా గంట‌ల్లోనే నేర‌స్థులు ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న డ‌బ్బును కాజేస్తున్నారు. అలాగే క్రెడిట్ కార్డుల స‌మాచారాన్ని, ఓటీపీల‌ను సైతం హ్యాకింగ్ ద్వారా సేక‌రించి కార్డుల ద్వారా పెద్ద మొత్తంలో డ‌బ్బును దోచేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అనేకం జ‌రుగుతున్నాయ‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు తెలియ‌జేస్తున్నారు.

భారీ మొత్తంలో మోసాలు..

కాగా ఒక్క తెలంగాణ‌లోనే ఏపీకే ఫైల్స్ మోసాల ద్వారా ఈ ఏడాదిలో ప్ర‌జ‌లు ఏకంగా రూ.9.49 కోట్ల‌ను పోగొట్టుకున్నార‌ని తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డీఎస్‌పీ ఎస్‌వీ హ‌రి కృష్ణ వెల్ల‌డించారు. మొత్తం 1505 సంఘ‌ట‌న‌ల్లో ప్ర‌జ‌లు ఆ మొత్తాన్ని కోల్పోయార‌ని అన్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఆగ‌స్టు మ‌ధ్య కాలంలో ప్ర‌జ‌లు సైబ‌ర్ మోసాల ద్వారా భారీ మొత్తంలో డ‌బ్బు న‌ష్ట‌పోయారు. ఉద్యోగాలు, పెట్టుబ‌డుల పేరిట నేర‌స్థులు రూ.242 కోట్లు దోచేయ‌గా, డిజిట‌ల్ అరెస్టు పేరిట రూ.118 కోట్లు, న‌కిలీ క‌స్ట‌మ‌ర్ కేర్‌తో రూ.33.7 కోట్లు, కేవైసీ అప్‌డేట్ పేరిట రూ.4 కోట్లు, రివార్డు పాయింట్ల పేరిట రూ.3.9 కోట్లు, బ్లాక్ మెయిల్ చేసి రూ.2.8 కోట్లు, ఎస్కార్ట్ మోసాల‌తో రూ.1.4 కోట్లు దోచేశార‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు ఏపీకే ఫైల్స్ మోసాల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

ఏపీకే ఫైల్ అంటే..?

ఏపీకే ఫైల్ అంటే.. ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైల్ అని అర్థం వ‌స్తుంది. అంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్ స్టాల్ అయి ఉండే యాప్‌కు చెందిన ఫైల్ అన్న‌మాట‌. ఆ ఫైల్‌ను ఓపెన్ చేస్తే ఫోన్‌లో ఆ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. అయితే ఏపీకే ఫైల్స్ సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌వు. అవి గూగుల్ ప్లే స్టోర్‌లోనే ఉంటాయి. అందులో గూగుల్ ఆ ఫైల్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీ చేస్తుంది. క‌నుక అందులో మోసాల‌కు గురి చేసే యాప్స్‌కు చెందిన ఏపీకే ఫైల్స్‌ను ఉంచ‌లేరు. కాబ‌ట్టి మ‌నం ఏదైనా యాప్‌ను ఇన్ స్టాల్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే ఆ ప‌నిచేయాలి. అంతేకానీ మ‌న‌కు వాట్సాప్ లేదా ఇత‌ర సోష‌ల్ మీడియా ఖాతాలు, మెసేజ్‌ల ద్వారా వ‌చ్చిన ఏపీకే ఫైల్స్‌ను అస‌లు ఇన్ స్టాల్ చేయ‌కూడ‌దు. అవి వైర‌స్‌ల‌ను క‌లిగి ఉంటాయి. మ‌న ఫోన్‌లో అవి ఇన్ స్టాల్ అయిన వెంట‌నే మ‌న ఫోన్‌ను హ్యాక్ చేస్తాయి. అందులో ఉండే వివ‌రాల‌ను నేర‌స్థుల‌కు పంపిస్తాయి. దీంతో వారు మ‌న ఫోన్‌ను ఆధీనంలోకి తీసుకుని దాని ద్వారా బ్యాంకు ఖాతాల్లోని డ‌బ్బును త‌మ ఖాతాల‌కు పంపించుకుంటారు. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా కూడా లావాదేవీలు చేస్తారు. ఇదంతా మ‌న ప్ర‌మేయం లేకుండానే జ‌రుగుతుంది. దీంతో మ‌నం పెద్ద ఎత్తున డ‌బ్బు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం చాలా మంది ఇదే విధంగా మోసాల బారిన ప‌డి భారీ ఎత్తున డ‌బ్బు న‌ష్ట‌పోతున్నారు.

ఈ సూచ‌న‌లు పాటించాలి..

వాట్సాప్ లేదా ఇత‌ర ఏ సోష‌ల్ యాప్ ద్వారా అయినా స‌రే ఎవ‌రైనా అపరిచిత వ్య‌క్తులు ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తే ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని, వాటిని వెంట‌నే డిలీట్ చేయాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. దీని వ‌ల్ల మోసాల‌కు గురి కాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాలు, సున్నిత‌మైన స‌మాచారం, బ్యాంకింగ్ వివ‌రాలు, యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్‌, ఫోన్ నంబ‌ర్‌, పాన్ నంబర్‌, ఓటీపీ వంటి స‌మాచారాన్ని ఎవ‌రికీ చెప్ప‌కూడ‌ద‌ని, కేవ‌లం అధికారిక ప్ర‌భుత్వ యాప్‌లు లేదా వెబ్ సైట్ల‌లోనే లావాదేవీల‌ను నిర్వ‌హించాల‌ని సూచిస్తున్నారు. అలాగే పైర‌సీ సినిమాల‌ను చూడవ‌ద్ద‌ని, వాటి వ‌ల్ల బెట్టింగ్ యాడ్స్‌ మాయ‌లో ప‌డి డ‌బ్బుల‌ను న‌ష్ట‌పోతార‌ని కూడా హెచ్చ‌రించారు. ఇక ఆర్‌బీఐ సూచించిన‌ట్లుగా చాలా మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌లు, పెట్టుబడుల యాడ్స్ క‌నిపిస్తున్నాయ‌ని, వాటికి స్పందించ‌వ‌ద్ద‌ని, ఆయాచితంగా వ‌చ్చే డ‌బ్బుకు ఆశ ప‌డ‌కూడ‌ద‌ని వారు సూచించారు. ప్ర‌జ‌లు త‌మ ఫోన్ల‌లో యాంటీ వైర‌స్ యాప్ ల‌ను ఇన్ స్టాల్ చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు స్కాన్ చేసుకోవాల‌ని, ఫోన్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ చేసుకోవాల‌ని, ఏమైనా స‌మ‌స్య‌ల‌పై లేదా మోసాల‌పై ఫిర్యాదు చేయ‌ద‌లిస్తే 1930 ఫోన్ నంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement