త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో దేశంలో దాదాపు 19.7 కోట్ల మంది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుందని గ్రేట్ లేక్స్ అధ్యయనం హెచ్చరించింది.

J

Technology | Published On Oct 13, 2026, 7.00 pm IST

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత

సంక్షిప్త సారాంశం

దేశవ్యాప్తంగా రొటీన్ పనులు చేసే దాదాపు 19.7 కోట్ల మంది ఉద్యోగులపై ఏఐ ఆటోమేషన్ ప్రభావం పడే అవకాశం ఉందని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. అదే సమయంలో, ఏఐని సహాయకంగా వాడుకుని ఉత్పాదకతను పెంచుకునే ఉద్యోగాల్లో కేవలం 4.6 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 15-24 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 55 శాతం మంది సులభంగా ఆటోమేట్ అయ్యే పనుల్లోనే ఉండటంతో వారికి పెను ముప్పు పొంచి ఉంది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కేరళ అత్యధికంగా 42 శాతం ఏఐ ఎక్స్‌పోజర్‌తో తొలి స్థానంలో ఉండగా, పంజాబ్‌లో 44.6 శాతం మంది రొటీన్ టాస్క్ ఉద్యోగాల్లో ఉన్నారు.

Advertisement
  • గ్రేట్ లేక్స్ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

AI Impact on Indian Jobs | త్రినేత్ర న్యూస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తోందో, అంతకంటే వేగంగా ఉద్యోగ రంగంపై దాని ప్రభావం పడుతోంది. భారతదేశంలో రోజువారీ రొటీన్ పనులు చేసే దాదాపు 19.7 కోట్ల (197 మిలియన్లు) ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఆటోమేషన్‌ ముప్పును ఎదుర్కోనున్నాయని సరికొత్త అధ్యయనం వెల్లడించింది. చెన్నైకి చెందిన 'గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్' విడుదల చేసిన "ఏఐ, ఆటోమేషన్ అండ్ ఇండియాస్ వర్క్‌ఫోర్స్" రీసెర్చ్ పేపర్‌లో ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ఉద్యోగాలు పోతాయా? ఏఐ సాయపడుతుందా?

ఈ అధ్యయనం ప్రకారం, దేశ శ్రామికశక్తిలో 24.6 శాతం మంది (దాదాపు 15 కోట్ల మంది) నేరుగా ఏఐ ప్రభావం పరిధిలోకి వచ్చారు. అయితే ఇందులో ఏఐని సాధనంగా ఉపయోగించుకుని తమ ఉత్పాదకతను పెంచుకునే అవకాశాలున్నది కేవలం 4.6 కోట్ల మందికే. మిగిలిన దాదాపు 19.7 కోట్ల మంది సాధారణ రొటీన్ పనులు చేసే విభాగాల్లోనే ఉన్నారు. అంటే ఈ ఉద్యోగాలన్నీ తక్షణం మాయమవుతాయని కాదు కానీ, అందులోని చాలా టాస్క్‌లను ఏఐ సులువుగా భర్తీ చేసే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

పట్టణ యువతకే పెను సవాల్

జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న యువతపై ఈ పరిణామం మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగుల్లో 39.4 శాతం మంది రొటీన్ జాబ్స్‌లోనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఏకంగా 55 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటికే 20-29 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత అధికంగా ఉండగా, ఏకంగా 25 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఏఐ రాక ఈ సంక్షోభాన్ని మరింత పెంచేలా ఉంది.

పురుషుల కంటే మహిళలకే కాస్త రక్షణ?

ఈ అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన అంశం బయటపడింది. ఏఐ ప్రభావం ఉన్న రంగాల్లో పనిచేసే మహిళలు.. పురుషుల కంటే కాస్త సురక్షితమైన స్థానంలో ఉన్నారు. ఏఐకి ఎక్స్‌పోజ్ అయిన మహిళా ఉద్యోగుల్లో 37.6 శాతం మంది పనులకు ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉపయోగపడుతోంది. పురుషుల్లో ఇది 28.4 శాతంగానే ఉంది. మహిళలు అధికంగా విద్య, వైద్య రంగాల్లో నాన్-రొటీన్ పాత్రల్లో పనిచేస్తుండటమే ఇందుకు కారణం. అయితే మొత్తం పెయిడ్ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం కేవలం 18 శాతంగానే ఉండటం గమనార్హం.

రాష్ట్రాల వారీగా ఏఐ ప్రభావం

ఏఐ ఎక్స్‌పోజర్‌లో 42 శాతంతో కేరళ మొదటి స్థానంలో నిలవగా, హర్యానా (37.9%), తమిళనాడు (32.9%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇది అతి తక్కువగా 16.1 శాతంగా నమోదైంది. మరోవైపు పంజాబ్‌లో ఏకంగా 44.6 శాతం మంది ఉద్యోగులు ఆటోమేట్ అయ్యే రొటీన్ పనుల్లోనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని శ్రామికశక్తి కూడా తీవ్రమైన టాస్క్ సబ్‌స్టిట్యూషన్ ఒత్తిడిని ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది.

ముందుచూపే రక్షక కవచం

ఏఐ విప్లవం సృష్టించే ప్రకంపనలను తట్టుకోవాలంటే భారత్ తక్షణమే సిద్ధం కావాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐ విద్యను ప్రవేశపెట్టడం, యువతకు ప్రత్యేక స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం, అత్యాధునిక ఏఐ టూల్స్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలమని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement