త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే క‌విత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు

Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే క‌విత్వానికి ఏఐ ప్ర‌త్యామ్నాయం కాలేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మ‌ర‌సం అంటే కేవ‌లం పుస్త‌కాలు, క‌విత్వానికే ప‌రిమితం కాకుండా సామాజిక స‌మ‌స్య‌ల‌పై పోరాడిన గొప్ప చ‌రిత్ర ఈ సంస్థ సొంత‌మ‌న్నారు.

S

Telangana | Published On Oct 2, 2026, 3.08 pm IST

Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే క‌విత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు
Advertisement
  • మ‌ర‌సం అంటే పుస్త‌కాలు, క‌విత్వ‌మే కాదు.. సామాజిక స‌మ‌స్య‌లను పెకిలించిన గొప్ప సంస్థ‌
  • నందిని సిధారెడ్డి అంటే సిద్ధాంతాల‌కు మారు పేరు
  • ‘నాగేటి సాల‌ల్లో నా తెలంగాణ’ పాట‌తో ఉద్య‌మానికి కొత్త దారులేసిండు
  • మంజీరా రచయితల సంఘం మహాసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

Harish Rao | త్రినేత్ర న్యూస్: గుండె లోతుల్లోంచి రాసే క‌విత్వానికి ఏఐ ప్ర‌త్యామ్నాయం కాలేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మ‌ర‌సం అంటే కేవ‌లం పుస్త‌కాలు, క‌విత్వానికే ప‌రిమితం కాకుండా సామాజిక స‌మ‌స్య‌ల‌పై పోరాడిన గొప్ప చ‌రిత్ర ఈ సంస్థ సొంత‌మ‌న్నారు. పదవులు, పైసల కంటే సిద్ధాంతమే ముఖ్య‌మ‌ని న‌మ్మిన ఆద‌ర్శ‌ప్రాయుడు నందిని సిధారెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫర్ చేసిన కోటి రూపాయలను సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన మంజీరా రచయితల సంఘం 40 వ‌సంతాల‌ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయ‌న‌ పాల్గొని ప్ర‌సంగించారు.

సంఘాలు పెట్టడం సులువే కానీ, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని 40 ఏళ్ల పాటు మంజీరా రచయితల సంఘం నిలబడిందంటే అందులోని కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం. నందిని సిద్ధారెడ్డి రాసిన 'నాగేటి సాలల్లో నా తెలంగాణ' పాట ఉద్యమానికి కొత్త ఊపునిచ్చి, ప్రజలను ఉర్రూతలూగించింది.

మంజీరా రచయితల సంఘంతో నాకు రెండు దశాబ్దాలకు పైగా ఎంతో దగ్గరి అనుబంధం ఉంది. ఒక సంఘాన్ని 40 ఏళ్ల పాటు కొనసాగించడం కత్తి మీద సాము లాంటిది. ప్రభుత్వాల ఒత్తిళ్లు, ఆకాశరామన్న లేఖల బెదిరింపులు వచ్చినా.. ఉద్యోగాల నుంచి తీసేస్తామని అధికారులు భయపెట్టినా, రామలింగన్న లాంటి వారిని టాడా చట్టం కింద జైల్లో పెట్టినా భయపడకుండా నిలబడ్డ గొప్ప చరిత్ర మరసం సొంతం.

సిధారెడ్డే గ‌ట్టి స‌మాధానం..

మరసం అంటే కేవలం పుస్తకాలు, కవిత్వానికే పరిమితం కాలేదు. 1992 నాటి మద్యపాన నిషేధ ఉద్యమం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, గుట్కా నిషేధం లాంటి ఎన్నో ప్రజా, సామాజిక సమస్యల మీద పోరాడిన గొప్ప సంస్థ ఇది. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ కవులు, మేధావులు లేరని చిన్నచూపు చూసిన వారికి.. తెలంగాణ రచయితల వేదిక ద్వారా గట్టి సమాధానం చెప్పిన వ్యక్తి నందిని సిధారెడ్డి. నాగేటి సాలల్లో పాట, అమరులకు జోహార్లు అర్పించే పాటలు తెలంగాణ ఉద్యమంలో చరిత్ర సృష్టించాయి.

సిధారెడ్డి కామారెడ్డి ప్రిన్సిపాల్‌గా వచ్చిన ప్రమోషన్‌ను సైతం వదులుకుని సిద్దిపేట మట్టి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం లెక్చరర్‌గానే ఉండిపోయారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. ముఖ్యమంత్రి ఆఫర్ చేసిన కోటి రూపాయలను కూడా కాదనుకుని తన నిబద్ధతను చాటుకున్నారు. నందిని సిద్ధారెడ్డిని తొలి చైర్మన్‌గా నియమించి ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కనీసం సాహిత్య అకాడమీకి చైర్మన్‌ను నియ‌మించ‌లేదు. అకాడమీకి తాళం పడి ఫంక్షనింగ్ ఆగిపోయింది.

నాలో ప‌రిణితి రావ‌డానికి వీళ్లే కార‌ణం..

ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎన్ని సస్పెన్షన్ నోటీసులు వచ్చినా లెక్కచేయకుండా దేశపతి శ్రీనివాస్ అన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. నాలో కూడా రాజకీయ పరిణితి రావడానికి, నా భాష, ఉపన్యాస శైలి మెరుగుపడటానికి సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ అన్న లాంటి వారి కృషే కారణం. సకల జనుల సమ్మెతో దేశ రాజకీయాలను, కేంద్రాన్ని కదిలించిన ఆనాటి 41 రోజుల చారిత్రక ఘట్టం వెనుక దేవి ప్రసాద్ అన్న వ్యూహం, ఆయన పోషించిన ప్రధాన కార్యదర్శి భూమిక ఎంతో గొప్పది.

ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మంజీరా నదిలో చుక్క నీరు వాడుకోవాలన్నా, కనీసం చెక్ డ్యాం కట్టాలన్నా ఆంక్షలు ఉండేవి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మంజీరా నదిపై పదుల సంఖ్యలో చెక్ డ్యాంలు నిర్మించి దాన్ని జీవనదిగా మార్చారు. నేడు సింగూరు జలాలు మెదక్ జిల్లాలో గలగలా పారుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రద్దు చేసిన సాహిత్య అకాడమీని.. తెలంగాణ వచ్చాక కేసీఆరే తిరిగి పునరుద్ధరించారు.

550 మందికి ఉద్యోగాలిచ్చి గౌర‌వించుకున్నాం..

తెలంగాణ వచ్చాకే బతుకమ్మ, బోనాలు రాష్ట్ర పండుగలుగా గుర్తింపు పొందాయి. జయశంకర్ సార్, సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య లాంటి మహనీయులకు దక్కాల్సిన గౌరవం కేసీఆర్ పాలనలోనే దక్కింది. సుమారు 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవించుకున్నాం.

సెల్‌ఫోన్ చూపిస్తూ తినిపించే ప‌రిస్థితొచ్చింది

నేటి డిజిటల్ యుగంలో ఉయ్యాలలో ఊగాల్సిన పిల్లలు ఫోన్లలో ఊగుతున్నారు. చందమామను చూపిస్తూ అన్నం తినిపించే రోజులు పోయి, సెల్ ఫోన్ చూపిస్తూ తినిపించే పరిస్థితి వచ్చింది. దీనివల్ల పుస్తక పఠనం బాగా తగ్గిపోతోంది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రయాణాల్లో కూడా పుస్తకాలు చదువుతారు. మన దగ్గర కూడా పుస్తక పఠనాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, తల్లిదండ్రులపై ఉంది.

అందులో స‌జీవత్వం ఉండ‌దు

ఏఐకి కంటెంట్ ఇస్తే కవితలు, పుస్తకాలు అదే రాసిచ్చే పరిస్థితి వస్తోంది. కానీ ఒక కవి తన సొంత అనుభవంతో, గుండెలోంచి రాసిన కవిత్వంలో ఉండే సజీవత్వం, నిజాయితీ ఏఐలో ఉండదు. రేపటి తరానికి తెలంగాణ ఉద్యమం గురించి, మన పోరాటాల గురించి తెలియాలంటే పుస్తకమే ఆధారం. సమాజంలో జరిగే అణిచివేతపై పోరాడటానికి కవిత, పాట ఒక ఆయుధం. అలాంటి సాహిత్యాన్ని, కవులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement