త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VPN | టెలిగ్రామ్ బ్యాన్ ఎఫెక్ట్‌.. వీపీఎన్‌లకు భారీ డిమాండ్.. ఏంటిది, ఎలా ప‌నిచేస్తుంది..?

VPN | భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత, దానిని ఉపయోగించేందుకు యూజ‌ర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా దేశంలో వీపీఎన్ (VPN) యాప్‌ల డౌన్‌లోడ్‌లు, వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

S

Technology | Published On Jun 19, 2026, 2.33 pm IST

VPN | టెలిగ్రామ్ బ్యాన్ ఎఫెక్ట్‌.. వీపీఎన్‌లకు భారీ డిమాండ్.. ఏంటిది, ఎలా ప‌నిచేస్తుంది..?
Advertisement

VPN | భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత, దానిని ఉపయోగించేందుకు యూజ‌ర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా దేశంలో వీపీఎన్ (VPN) యాప్‌ల డౌన్‌లోడ్‌లు, వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ వీపీఎన్ సేవా సంస్థ ప్రోటాన్ వీపీఎన్ తెలిపిన వివరాల ప్రకారం టెలిగ్రామ్ నిషేధం తర్వాత భారత్‌లో వీపీఎన్ సేవల కోసం డిమాండ్ భారీగా పెరిగిందని తెలిపింది. ఎక్స్ (X) వేదికగా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో గంటవారీ కొత్త రిజిస్ట్రేషన్లు 150 శాతం పెరిగాయి. అలాగే రోజువారీ రిజిస్ట్రేషన్లు 120 శాతం మేర వృద్ధి చెందాయి. ఈ గ‌ణాంకాల‌ను బ‌ట్టి చూస్తే భార‌త్‌లో టెలిగ్రామ్ నిషేధం అనంత‌రం యూజ‌ర్లు ఎక్కువ‌గా వీపీఎన్‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

డార్క్ వెబ్‌గా మారిన టెలిగ్రామ్‌: కేంద్రం

నీట్ ప‌రీక్ష ర‌ద్దు త‌రువాత ఈ నెల 21న రీ ఎగ్జామ్ నిర్వహించ‌నుండ‌గా, 22వ తేదీ వ‌ర‌కు కేంద్రం టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసింది. ప్ర‌శ్నాప‌త్రాల లీక్ వంటి ఘ‌ట‌న‌ల‌ను అరిక‌ట్టేందుకే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అలాగే ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను కూడా నిలిపివేయాల‌ని కేంద్రం ఇప్ప‌టికే ఆ సంస్థ‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌శ్నాప‌త్రాల లీకుల కోసం టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే టెలిగ్రామ్‌పై కేంద్రం తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో కేంద్రం ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించింది. టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్ ప్ర‌స్తుతం డార్క్ వెబ్‌గా మారింద‌ని, సైబ‌ర్ నేరాల‌కు అడ్డాగా త‌యారైంద‌ని పేర్కొంది.

వీపీఎన్‌తో ప‌రిష్కారం..

టెలిగ్రామ్ నిషేధం తర్వాత భారత్‌లో నేరుగా ఈ సేవను వినియోగించడం సాధ్యం కాకపోయినా, వీపీఎన్ ద్వారా దానికి పరిష్కారం కనుగొంటున్నారు. వీపీఎన్ వినియోగదారుడి ఐపీ అడ్రస్‌ను దాచిపెట్టి, నిషేధిత సేవలను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ప్రోటాన్ వీపీఎన్ జనరల్ మేనేజర్ డేవిడ్ పీటర్సన్ తెలిపిన ప్రకారం టెలిగ్రామ్ నిషేధం అనంతరం వీపీఎన్ రిజిస్ట్రేషన్లు వేగంగా పెరిగాయ‌ని అన్నారు. అయితే ప్రస్తుతం పీటర్సన్ ఎక్స్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు సమాచారం. వీపీఎన్ సైన్-అప్‌ల పెరుగుదలతోపాటు, గూగుల్ ట్రెండ్స్ డేటా కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. గత రెండు రోజులుగా టెలిగ్రామ్ వీపీఎన్‌, వీపీఎన్ ఫ‌ర్ టెలిగ్రామ్ త‌దిత‌ర పదాలను పెద్ద సంఖ్యలో వినియోగదారులు సెర్చ్ చేస్తున్నారు. నిషేధిత టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ను మళ్లీ ఉపయోగించేందుకు యూజ‌ర్లు ఆయా మార్గాలను అన్వేషిస్తున్నారని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

వీపీఎన్ అంటే ఏమిటి, ఎలా ప‌నిచేస్తుంది..

వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఇది ఇంటర్నెట్ కనెక్షన్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంది. వినియోగదారుడి అసలు ఐపీ అడ్రస్‌ను దాచిపెట్టి, వీపీఎన్ సర్వర్‌కు చెందిన ఐపీ అడ్రస్‌ను చూపిస్తుంది. దీంతో ఇంటర్నెట్‌లో వినియోగదారుడి జియోలొకేషన్ మారినట్లు కనిపిస్తుంది. అలాగే ఆన్‌లైన్ డేటాను కోడ్ రూపంలోకి మార్చి పంపడం వల్ల హ్యాకర్లు దానిని సులభంగా గుర్తించడం లేదా దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ తోపాటు ఐఓఎస్‌, విండోస్ త‌దిత‌ర ప్లాట్‌ఫామ్‌ల‌లో అనేక వీపీఎన్ యాప్స్ ల‌భిస్తున్నాయి. చాలా యాప్స్‌లో వేగ‌వంత‌మైన వీపీఎన్ కోసం పెయిడ్ ప్లాన్ల‌ను కూడా అందిస్తున్నారు. అయితే పైర‌సీ సినిమాల‌ను వీక్షించేందుకు, డౌన్ లోడ్ చేసేందుకు ఇప్ప‌టికే అధిక శాతం మంది వీపీఎన్‌ల‌ను వాడుతున్నారు. కాగా టెలిగ్రామ్ బ్యాన్‌తో వీపీఎన్ యూజ‌ర్ల సంఖ్య మ‌రింత పెరిగింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Advertisement
Advertisement