త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VPN | వీపీఎన్ అంటే ఏమిటి.. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో దీన్ని సేఫ్‌గా ఎలా వాడాలి..?

VPN | ఇంటర్నెట్ వినియోగదారుల్లో గోప్యత (ప్రైవసీ), భద్రత (సెక్యూరిటీ) ప్రధాన ఆందోళనలుగా మారాయి. అలాగే కొన్ని జియో-బ్లాక్ చేసిన వెబ్‌సైట్లు, సేవలు నిర్దిష్ట దేశాలు లేదా ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీ డేటాను రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, సురక్షితమైన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటిగా మారింది.

S

Technology | Published On Aug 1, 2026, 1.00 pm IST

VPN | వీపీఎన్ అంటే ఏమిటి.. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో దీన్ని సేఫ్‌గా ఎలా వాడాలి..?
Advertisement

VPN | ఇంటర్నెట్ వినియోగదారుల్లో గోప్యత (ప్రైవసీ), భద్రత (సెక్యూరిటీ) ప్రధాన ఆందోళనలుగా మారాయి. అలాగే కొన్ని జియో-బ్లాక్ చేసిన వెబ్‌సైట్లు, సేవలు నిర్దిష్ట దేశాలు లేదా ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీ డేటాను రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, సురక్షితమైన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటిగా మారింది. వీపీఎన్‌లు వినియోగదారులకు అనామకంగా వెబ్‌సైట్లను యాక్సెస్ చేసే అవకాశం కల్పించడమే కాకుండా, పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆల్వేస్ ఆన్ వీపీఎన్ ఫీచర్‌ను ప్రారంభించడం వల్ల గోప్యత మరింత మెరుగుపడటంతో పాటు, అనుకోకుండా డేటా బహిర్గతమయ్యే ప్రమాదం కూడా తగ్గుతుంది.

వీపీఎన్ అంటే..

ప్రపంచవ్యాప్తంగా అనేక వీపీఎన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే గూగుల్ ఆండ్రాయిడ్‌లో ఇంట‌ర్న‌ల్‌ వీపీఎన్ మేనేజర్‌ను అందిస్తోంది. దీని ద్వారా థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే వీపీఎన్ కనెక్షన్‌ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సురక్షితంగా వీపీఎన్‌ను ఎలా కనెక్ట్ చేయాలో, అలాగే ఆల్వేస్ ఆన్ వీపీఎన్ ను ఎలా ప్రారంభించాలో టెక్ నిపుణులు వివ‌రిస్తున్నారు. వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) వినియోగదారులు సురక్షితమైన నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించేందుకు సహాయపడుతుంది. ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సర్వర్ల మధ్య ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌ను ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా డేటా నేరుగా సర్వర్లకు వెళ్లకుండా, సురక్షితమైన, ఎన్‌క్రిప్ట్ చేసిన‌ వీపీఎన్ సర్వర్ ద్వారా ప్రయాణిస్తుంది.

వివరాలు బ‌హిర్గ‌తం అవ్వ‌వు..

ముఖ్యంగా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు సైబర్ దాడుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీపీఎన్ ఉపయోగించడం వల్ల డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వీపీఎన్‌కు కనెక్ట్ అయినప్పుడు, మీరు బ్రౌజ్ చేస్తున్న వెబ్‌సైట్ల ఓన‌ర్ల‌కు మీ అసలు ఐపీ అడ్రస్ కనిపించదు. దాని బదులుగా వీపీఎన్ సర్వర్‌కు చెందిన ఐపీ అడ్రస్ మాత్రమే కనిపిస్తుంది. దీంతో మీ ఫోన్, నెట్‌వర్క్, వెబ్‌సైట్ యజమానుల మధ్య అదనపు గోప్యత‌, రక్షణ లభిస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీపీఎన్ సేవ‌ల‌ను ప‌లు యాప్‌లు ప్రీమియం ప్లాన్ల‌కు అందిస్తున్నాయి. కానీ ఫోన్ల‌లో ఇంట‌ర్న‌ల్‌గానే వీపీఎన్ ఉంటుంది. దాన్ని యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు. అందుకు ప‌లు సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది.

ఎలా ఆన్ చేయాలి..

ముందుగా విశ్వసనీయమైన వీపీఎన్ సేవను ఎంచుకుని, అవసరమైన ప్లాన్‌కు సైన్ అప్ చేయాలి. ఆ తర్వాత ఆ సేవా సంస్థ నుంచి వీపీఎన్ లాగిన్ వివరాలను పొందాలి. తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్ష‌న్ పై ట్యాప్ చేయాలి. అనంతరం వీపీఎన్ ఆప్ష‌న్ లోకి వెళ్లి, స్క్రీన్ కుడి ఎగువ మూలలో కనిపించే యాడ్) బటన్‌ను ట్యాప్ చేయాలి. ఇప్పుడు వీపీఎన్ యాప్ అందించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో పాటు అవసరమైన ఇతర వివరాలను నమోదు చేసి, చివరగా సేవ్ బటన్‌ను ట్యాప్ చేయాలి. త‌రువాత సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేసి నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ > వీపీఎన్ విభాగంలోకి వెళ్లాలి. ముందుగా సేవ్ చేసిన వీపీఎన్ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసి కనెక్ట్ బటన్‌పై ట్యాప్ చేస్తే వీపీఎన్ యాక్టివ్ అవుతుంది.

ఆల్వేస్ ఆన్ వీపీఎన్..

ఇక ఆల్వేస్ ఆన్ వీపీఎన్ ను యాక్టివేట్ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ > వీపీఎన్ విభాగంలోకి వెళ్లాలి. మీరు ఉపయోగించాలనుకుంటున్న వీపీఎన్ నెట్‌వర్క్ పక్కన కనిపించే సెట్టింగ్స్ బటన్ పై ట్యాప్ చేయాలి. అక్కడ కనిపించే ఆల్వేస్ఆన్ వీపీఎన్ టోగుల్‌ను ఆన్ చేసి, చివరగా సేవ్ బటన్‌ను ట్యాప్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఎల్లప్పుడూ వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతూ అదనపు భద్రతను అందిస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 14 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌తో పనిచేసే పిక్సెల్ ఫోన్లలో గూగుల్ అందించే ఇంట‌ర్న‌ల్ వీపీఎన్ సేవను ఉచితంగా ఉపయోగించవచ్చు. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో థర్డ్ పార్టీ వీపీఎన్ సేవలను ఉపయోగించాలంటే ఆయా సంస్థల ప్లాన్‌లను డ‌బ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.

ఉచితంగా వీపీఎన్ కావాలంటే..

ఇక ఆండ్రాయిడ్ ఫోన్ వీపీఎన్‌కు విజయవంతంగా కనెక్ట్ అయిన తర్వాత, స్టేటస్ బార్‌లో తాళం చెవి (కీ) గుర్తు కనిపిస్తుంది. ఇది వీపీఎన్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉందని సూచిస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఇంట‌ర్న‌ల్‌గా అచ్చం వీపీఎన్ లాంటి ఓ స‌దుపాయం ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసినా మీరు ఇంట‌ర్నెట్ బ్రౌజ్ చేస్తున్న‌ప్పుడు మీ డేటాకు గోప్య‌త‌, సెక్యూరిటీ ల‌భిస్తాయి. ఇక ఈ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేయాలంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి అందులో సెర్చ్‌లో డీఎన్ఎస్ అనే అక్ష‌రాల‌ను ఎంట‌ర్ చేస్తే ఫ‌లితాల్లో ప్రైవేట్ డీఎన్ఎస్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అందులో వ‌చ్చే స్పెసిఫైడ్ డీఎన్ఎస్ అనే సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. స్పెసిఫైడ్ డీఎన్ఎస్‌పై ట్యాప్ చేయ‌గానే కింద మ‌రొక ఆప్ష‌న్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అందులో ప్ర‌ముఖ క్లౌడ్ స‌ర్వీస్ సంస్థ క్లౌడ్ ఫ్లేర్‌కు చెందిన వ‌న్‌.వ‌న్‌.వన్‌.వ‌న్ (one.one.one.one) అనే ప‌దాల‌ను అలాగే ఫుల్‌స్టాప్‌ల‌తో స‌హా ఎంట‌ర్ చేసి సేవ్ చేయాలి. దీంతో మీ ఫోన్‌లో మీరు వాడే ప్ర‌తి ఇంట‌ర్నెట్ సేవ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. మీ డేటాకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

క్లౌడ్ ఫ్లేర్ స‌ర్వీస్ ఫ్రీగానే..

అయితే క్లౌడ్ ఫ్లేర్ స‌ర్వీస్‌ డీఎన్ఎస్ ద్వారా జ‌రుగుతుంది క‌నుక వీపీఎన్‌లా ఫోన్ స్టేట‌స్ బార్‌లో తాళం చెవి గుర్తు రాదు. కానీ ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రైవ‌సీ కోసం చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్లు ఉప‌యోగించే క్లౌడ్ ఫ్లేర్ ఉచిత డీఎన్ఎస్ స‌ర్వీస్‌. దీన్ని వాడితే థ‌ర్డ్ పార్ట్ వీపీఎన్ యాప్‌ల‌ను డ‌బ్బులు చెల్లించి వాడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. క్లౌడ్ ఫ్లేర్ డీఎన్ఎస్ స‌ర్వీస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రికీ ఉచితంగానే అందుబాటులో ఉంది. దీన్ని ఎవ‌రైనా ఉప‌యోగించుకోవ‌చ్చు. యూజ‌ర్ల‌కు చెందిన డేటా క్లౌడ్ ఫ్లేర్‌కు చెందిన ఎన్‌క్రిప్టెడ్ స‌ర్వ‌ర్ల ద్వారా ప్ర‌యాణిస్తుంది. అందువ‌ల్ల డేటాకు గోప్య‌త‌, ర‌క్ష‌ణ ల‌భిస్తాయి. ఇలా ఆండ్రాయిడ్ ఫోన్‌ల‌లో వీపీఎన్‌, ప్రైవేట్ డీఎన్ఎస్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుని డేటాను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.

Advertisement
Advertisement