త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET 2027 | నీట్ 2027 కోసం ప్రత్యేక ల్యాప్‌టాప్.. ఏసర్-ఇంటెల్-ఇన్ఫినిటీ లెర్న్ ఆధ్వ‌ర్యంలో లాంచ్..

NEET 2027 | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను 2027 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏసర్, ఇంటెల్, శ్రీ చైతన్య విద్యాసంస్థల డిజిటల్ లెర్నింగ్ విభాగం ఇన్ఫినిటీ లెర్న్ కలిసి దేశంలోనే తొలి సమగ్ర నీట్ రెడీ ఎకోసిస్టమ్ ను ప్రారంభించాయి.

S

Technology | Published On Jul 14, 2026, 2.37 pm IST

NEET 2027 | నీట్ 2027 కోసం ప్రత్యేక ల్యాప్‌టాప్.. ఏసర్-ఇంటెల్-ఇన్ఫినిటీ లెర్న్ ఆధ్వ‌ర్యంలో లాంచ్..
Advertisement

NEET 2027 | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను 2027 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏసర్, ఇంటెల్, శ్రీ చైతన్య విద్యాసంస్థల డిజిటల్ లెర్నింగ్ విభాగం ఇన్ఫినిటీ లెర్న్ కలిసి దేశంలోనే తొలి సమగ్ర నీట్ రెడీ ఎకోసిస్టమ్ ను ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యంలో తొలి ఉత్పత్తిగా నీట్ రెడీ ల్యాప్‌టాప్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. నీట్ పరీక్ష డిజిటల్ విధానంలోకి మారుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డిజిటల్ పరీక్ష అనుభవాన్ని ఒకే వేదికపై అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగిన ఈ పరీక్ష 2027 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మారనుంది. దీంతో విద్యార్థులు సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు కంప్యూటర్‌లో పరీక్ష రాయడానికి అవసరమైన డిజిటల్ నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఏఐ ఆధారిత కోర్సులు..

నీట్ అభ్యర్థుల్లో దాదాపు 70 శాతం మంది టియర్-2, టియర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ఈ ప్రాంతాల్లో వ్యక్తిగత కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు హార్డ్‌వేర్‌తోపాటు పూర్తి స్థాయి నీట్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఒకే ప్యాకేజీగా అందిస్తున్నట్లు సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక ల్యాప్‌టాప్‌లో ఏసర్ ఆస్పైర్ సిరీస్‌తోపాటు ఇంటెల్ ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసిన వెంటనే ఇన్ఫినిటీ లెర్న్ రూపొందించిన పూర్తి స్థాయి నీట్ ప్రిపరేషన్ ప్లాట్‌ఫామ్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో శ్రీ చైతన్య అధ్యాపకుల లైవ్, రికార్డెడ్ క్లాసులు, డిజిటల్ స్టడీ మెటీరియల్, ఏఐ ఆధారిత అకడమిక్ అసిస్టెంట్ ఏఐఎన్‌ఏ, అధ్యాయం వారీగా అడాప్టివ్ ప్రాక్టీస్ మాడ్యూల్స్, ఆటోమేటెడ్ పనితీరు విశ్లేషణ, వ్యక్తిగత మెరుగుదల సూచనలు అందుబాటులో ఉంటాయి.

ముఖ్య‌మైన ఫీచ‌ర్లు..

అంతేకాకుండా అధికారిక కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తరహాలోనే ఉండే ప్రత్యేక సీబీటీ సిమ్యులేషన్ పోర్టల్ కూడా ఇందులో ఉంటుంది. టైమ్ పరిమితితో కూడిన మాక్ టెస్టులు, దేశవ్యాప్తంగా ఇతర విద్యార్థులతో పనితీరు పోలిక వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా అసలు పరీక్షకు ముందే విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష వాతావరణాన్ని అనుభవించి డిజిటల్ భయాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీలు తెలిపాయి. ఏసర్ ఆస్పైర్ 3 (ఎ311-45) స్పెసిఫికేషన్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో 11.6 ఇంచుల హెచ్‌డీ ఏసర్ కంఫీవ్యూ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ ఎన్‌4500 ప్రాసెసర్, ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్, 8 జీబీ ర్యామ్ (16 జీబీ వరకు అప్‌గ్రేడ్ సపోర్ట్), 128 జీబీ నుంచి 1 టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

38 వాట్ అవర్ లిథియమ్ అయాన్ బ్యాటరీతో ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. బ్లూటూత్ 5.4, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, యూఎస్‌బీ 3.2 జెన్ 1, యూఎస్‌బీ టైప్-సి, హెచ్‌డీఎంఐ, మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 720పి హెచ్‌డీ వెబ్‌క్యామ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మైక్రోసాఫ్ట్ ప్రెసిషన్ సర్టిఫైడ్ టచ్‌ప్యాడ్, ఏసర్ ఫైన్‌టిప్ కీబోర్డ్, విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ బరువు కేవలం 1 కిలోగ్రామ్ మాత్రమే. స్టీల్ గ్రే కలర్‌లో లభించే ఈ మోడల్‌కు ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది. ధరల విషయానికి వస్తే, 11.6 ఇంచుల ఇన్ఫినిటీ నీట్ క్యాప్సూల్ కోర్స్ మోడల్ ధరను రూ.29,990గా నిర్ణయించారు. 11.6 ఇంచుల ఇన్ఫినిటీ నీట్ ప్రో కోర్స్ మోడల్ రూ.44,990కు లభిస్తుంది. 15.6 ఇంచుల‌ఇన్ఫినిటీ నీట్ ప్రో కోర్స్ మోడల్ ధర రూ.47,990గా ఉంది.

నెల‌కు రూ.2500 ఈఎంఐతో..

ఈ ప్రత్యేక నీట్ రెడీ ల్యాప్‌టాప్‌లు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.2,500 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏసర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కోహ్లీ మాట్లాడుతూ పోటీ పరీక్షలు వేగంగా డిజిటల్ విధానంలోకి మారుతున్నందున సరైన టెక్నాలజీ విద్యార్థుల విజయానికి కీలకమని తెలిపారు. ఇంటెల్ ఆధారిత ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్‌తోపాటు పూర్తి స్థాయి నీట్ ప్రిపరేషన్ ఎకోసిస్టమ్‌ను అందించడం ద్వారా విద్యార్థులు కొత్త తరహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల సీఈఓ అండ్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన మాట్లాడుతూ పెన్ అండ్ పేపర్ పరీక్ష నుంచి కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు మారడం భారత పోటీ పరీక్షల చరిత్రలో కీలక మార్పు అని అన్నారు. విద్యార్థులకు అకడమిక్ ప్రతిభతోపాటు డిజిటల్ ఆత్మవిశ్వాసాన్ని కూడా అందించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఏసర్, ఇంటెల్‌తో కలిసి రూపొందించిన ఈ ఎకోసిస్టమ్ ద్వారా ప్రతి నీట్ అభ్యర్థికి అవసరమైన నైపుణ్యాలు, సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

విశ్వ‌స‌నీయ ప‌రిక‌రాలు అవ‌స‌రం..

ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపక సీఈఓ ఉజ్జ్వల్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నాణ్యమైన విద్య అందుబాటుపై దృష్టి పెట్టిన భారత్‌కు ఇకపై డిజిటల్ పరీక్షల కోసం సమాన అవకాశాలు కల్పించడం తదుపరి లక్ష్యమని అన్నారు. ప్రతిభే విజయం నిర్ణయించాలి కానీ టెక్నాలజీ అందుబాటు కాదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. ఇంటెల్ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ విశ్వనాథన్ మాట్లాడుతూ డిజిటల్ విద్య విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు వేగవంతమైన, విశ్వసనీయమైన పరికరాలు అవసరమని తెలిపారు. ఏఐ ఆధారిత అభ్యాసం, ఆధునిక విద్యా అనుభవాలకు అనుగుణంగా ఇంటెల్ ఆధారిత కంప్యూటర్ల‌ను రూపొందించామ‌ని, ఏసర్, ఇన్ఫినిటీ లెర్న్‌తో కలిసి భవిష్యత్ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement