త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup | ఫిపా వరల్డ్‌ కప్‌లో చారిత్రక ఘట్టం..

FIFA World Cup | ట్యునీషియా–జపాన్ మ్యాచ్ ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో ఓ అరుదైన మైలురాయిగా నిలిచింది. ఈ మ్యాచ్‌తో ప్రపంచ ఫుట్‌బాల్ మహాసంగ్రామం తన 1,000వ మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది. 1930లో ప్రారంభమైన తొలి వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకు అనేక చారిత్రక పోరాటాలకు, దిగ్గజ జట్ల ప్రదర్శన, అద్భుత ఆటగాళ్ల ప్రతిభకు ఈ టోర్నీ వేదికగా నిలిచింది.

P

Sports | Published On Jun 21, 2026, 12.33 pm IST

FIFA World Cup | ఫిపా వరల్డ్‌ కప్‌లో చారిత్రక ఘట్టం..
Advertisement
  • ట్యునీషియా-జపాన్‌ పోరుకు అరుదైన ఘనత
  • మహాసంగ్రామంలో 1000 మ్యాచులు పూర్తి
  • 1930 జులై ప్రపంచకప్‌ పోరు షురూ..

FIFA World Cup | ట్యునీషియా–జపాన్ మ్యాచ్ ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో ఓ అరుదైన మైలురాయిగా నిలిచింది. ఈ మ్యాచ్‌తో ప్రపంచ ఫుట్‌బాల్ మహాసంగ్రామం తన 1,000వ మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది. 1930లో ప్రారంభమైన తొలి వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకు అనేక చారిత్రక పోరాటాలకు, దిగ్గజ జట్ల ప్రదర్శన, అద్భుత ఆటగాళ్ల ప్రతిభకు ఈ టోర్నీ వేదికగా నిలిచింది. 1930 జూలై 13న ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోలో జరిగిన రెండు మ్యాచులతో వరల్డ్‌కప్ ప్రయాణం ప్రారంభమైంది. అమెరికా జట్టు బెల్జియంపై 3-0తో విజయం సాధించగా.. ఫ్రాన్స్ 4-1తో మెక్సికోను ఓడించింది.

అదే మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లూసియన్ లారెంట్ వరల్డ్‌కప్ చరిత్రలో తొలి గోల్ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 1954 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రియా 3-1తో ఉరుగ్వేను మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఓడించగా.. అది టోర్నీ చరిత్రలో 100వ మ్యాచ్‌గా నమోదైంది. 1966లో లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 4-2తో జర్మనీపై గెలిచి తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. జెఫ్ హర్స్ట్ హ్యాట్రిక్ సాధించిన ఆ ఫైనల్ టోర్నీ 200వ మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. 1978 వరల్డ్‌కప్‌లో రెండు మ్యాచ్‌లు ఒకేసారి జరగడంతో 300వ మ్యాచ్ మైలురాయిగా నిలిచింది. 1986లో అర్జెంటీనా 1-0తో ఉరుగ్వేను ఓడించిన మ్యాచ్ 400వగా నిలిచింది. అదే టోర్నీలో డియాగో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 1994లో టోర్నీ 500వ మ్యాచ్ మైలురాయిని చేరుకోగా.. 2002లో ఫ్రాన్స్–ఉరుగ్వే జట్ల మధ్య గోల్‌లేని డ్రాగా 600వ మ్యాచ్‌ ముగిసింది.

2006లో రౌండ్ ఆఫ్-16లో ఫ్రాన్స్ 3-1తో స్పెయిన్‌ను ఓడించిన మ్యాచ్ 700వది. 2014లో జర్మనీ–ఘానా మధ్య 2-2తో ముగిసిన పోరు 800వ మ్యాచ్‌గా నిలిచింది. 2018 వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాపై విజయం సాధించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. అదే మ్యాచ్ టోర్నీ చరిత్రలో 900వగా నిలిచింది. తాజాగా ట్యునీషియా–జపాన్ పోరు 1,000వ మ్యాచ్‌గా చరిత్రలో చోటు దక్కించుకుంది. దాదాపు శతాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు ఇది మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచింది.

Advertisement
Advertisement