త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | ఇరాన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా

FIFA 2026 | వరల్డ్‌కప్‌–2026లో పాల్గొంటున్న ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు ప్రయాణంపై ఆంక్షలకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. ఈ ఏర్పాట్లపై ఇరాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. అమెరికా మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేయబోమని వైట్‌హౌస్‌ టోర్నమెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆండ్రూ గియులియాని స్పష్టం చేశారు.

P

Sports | Published On Jun 21, 2026, 10.16 am IST

FIFA 2026 | ఇరాన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా
Advertisement

FIFA 2026 | వరల్డ్‌కప్‌–2026లో పాల్గొంటున్న ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు ప్రయాణంపై ఆంక్షలకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. ఈ ఏర్పాట్లపై ఇరాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. అమెరికా మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేయబోమని వైట్‌హౌస్‌ టోర్నమెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆండ్రూ గియులియాని స్పష్టం చేశారు. టోర్నీలో భాగంగా ఇరాన్‌ జట్టు జూన్‌ 21న బెల్జియంతో రెండో గ్రూప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణ ఏర్పాట్లపై ఇరాన్‌ చేసిన అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్‌ నిబంధనల ప్రకారం.. ఇరాన్‌ జట్టు మ్యాచ్‌ జరిగే నగరానికి కేవలం 24 గంటల ముందే చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ప్రతి మ్యాచ్‌ ముగిసిన వెంటనే తిరిగి మెక్సికోలోని టిజువానాలో ఉన్న తమ శిక్షణా శిబిరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లపై ఇరాన్‌ ప్రధాన కోచ్‌ అమీర్‌ ఘలెనోయి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రపంచకప్‌లో ఇతర దేశాలతో పోలిస్తే తమ జట్టుకే అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఫిఫాకు అధికారిక ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఇరాన్‌ ప్రకటించింది.

అమెరికా వాదనలు ఇవే..

అమెరికా వైపు నుంచి స్పందించిన గియులియాని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రణాళికను మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. బెల్జియంతో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే మ్యాచ్‌ అనంతరం ఇరాన్‌ జట్టు కేవలం 27 నిమిషాల విమాన ప్రయాణంతో తిరిగి టిజువానాకు చేరుకుంటుందని ఆయన వివరించారు. ఆ తర్వాత సియాటిల్‌లో ఈజిప్టుతో జరిగే చివరి గ్రూప్‌ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై తదుపరి చర్చలు జరుగుతాయని చెప్పారు. ‘పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మా వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. రెండో మ్యాచ్‌ అనంతరం పరిస్థితులను సమీక్షించి, మూడో మ్యాచ్‌కు సంబంధించిన ప్రయాణ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకుంటాం’ అని గియులియాని పేర్కొన్నారు. ఇరాన్‌ జట్టు శిక్షణా కేంద్రాన్ని అరిజోనాలోని టక్సన్‌ నుంచి టిజువానాకు మార్చడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిందని గియులియాని వివరించారు. ‘టక్సన్‌తో పోలిస్తే టిజువానా నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకోవడానికి తక్కువ సమయం పడుతోంది. విమాన ప్రయాణంలో దాదాపు గంట సమయం ఆదా అవుతోంది. తొలి మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లతో మేం సంతృప్తిగా ఉన్నాం’ అని తెలిపారు.

వీసాల అంశంపై వివరణ

ఇరాన్‌ జట్టు వీసాల విషయంలోనూ ఇటీవల వివాదం నెలకొంది. దీనిపై స్పందించిన గియులియాని, ఆటగాళ్లు, కోచ్‌లందరికీ వీసాలు మంజూరు చేశామని చెప్పారు. జట్టు అధికారుల్లో కొందరికి వీసాలు ఇవ్వలేదని అంగీకరించారు. ‘వారి గురించి కొన్ని అభ్యంతరకరమైన సమాచారం మా దృష్టికి వచ్చింది. భద్రతా అంశాలు, పరిపాలనా నిబంధనల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన వివరించారు. ప్రపంచకప్‌ మధ్యలో ఇరాన్‌ ప్రయాణ ఏర్పాట్లపై కొనసాగుతున్న ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
Advertisement