త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | ఐసీసీ నిర్ణ‌యాన్ని బీసీబీ స‌వాల్ చేస్తుందా..? మీడియా క‌మిటీ చైర్మ‌న్ రెస్పాన్స్ ఇదే..!

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వివాదం ముగిసింది. భార‌త్‌కు రాబోమ‌ని బంగ్లాదేశ్ స్ప‌ష్టం చేయ‌డంతో.. ఆ దేశాన్ని త‌ప్పిస్తూ స్కాట్లాండ్‌కు చోటు క‌ల్పించింది ఐసీసీ. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాన్ని బీసీబీ స‌వాల్ చేయ‌నున్న‌ట్లుగా ప్రచారం జ‌రిగింది.

P

Sports | Published On Jan 25, 2026, 5.59 pm IST

T20 World Cup | ఐసీసీ నిర్ణ‌యాన్ని బీసీబీ స‌వాల్ చేస్తుందా..? మీడియా క‌మిటీ చైర్మ‌న్ రెస్పాన్స్ ఇదే..!
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వివాదం ముగిసింది. భార‌త్‌కు రాబోమ‌ని బంగ్లాదేశ్ స్ప‌ష్టం చేయ‌డంతో.. ఆ దేశాన్ని త‌ప్పిస్తూ స్కాట్లాండ్‌కు చోటు క‌ల్పించింది ఐసీసీ. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాన్ని బీసీబీ స‌వాల్ చేయ‌నున్న‌ట్లుగా ప్రచారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై బీసీబీ క్లారిటీ ఇచ్చింది. ఐసీసీ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. శ‌నివారం ఢాకాలో జ‌రిగిన బోర్డు స‌మావేశం త‌ర్వాత బీసీబీ మీడియా క‌మిటీ చైర్మ‌న్ అమ్జ‌ద్ హుస్సేన్ ఈ స‌మాచారాన్ని వెల్ల‌డించారు.

ఈ విషయాన్ని ఐసీసీ వివాద పరిష్కార కమిటీ దృష్టికి తీసుకెళ్లడానికి బీసీబీ సిద్ధమవుతోందని ప‌లు నివేదిక‌లు పేర్కొన్నాయి. కానీ, అలాంటి చర్య తీసుకోలేదని అమ్జ‌ద్ హుస్సేన్ స్పష్టం చేశారు. తాము ఐసీసీ నిర్ణ‌యాన్ని అంగీక‌రించామ‌ని, టోర్నీలో ఆడాల‌నుకుంటే భార‌త్ వెళ్లాల్సి ఉంటుంద‌న్నారు. మ్యాచుల‌ను శ్రీ‌లంక‌కు మార్చ‌లేమ‌ని ఐసీసీ స్ప‌ష్టం చేసింద‌ని, ఈ ప‌రిస్థితుల్లో భార‌త్‌కు వెళ్లి ఆడ‌టం సాధ్యం కాద‌ని.. తాము ప్ర‌త్యేక మ‌ధ్య‌వ‌ర్తిత్వం, చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల్లోకి వెళ్ల‌బోవ‌డం లేద‌న్నారు.

ఐసీసీ గ‌త బోర్డు స‌మావేశంలో భార‌త్‌కు వెళ్ల‌క‌పోతే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడటానికి రాకపోతే, దాని స్థానంలో మరొక జట్టును చేరుస్తామ‌ని చెప్పింది. ఆ త‌ర్వాత బీసీబీ ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రభుత్వం ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఖరిని ఐసీసీకి తెలియ‌జేసింది. దాంతో ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.

అమ్జ‌ద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఐసీసీ బోర్డు స‌మావేశం త‌ర్వాత బంగ్లాదేశ్ కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. భార‌త్‌కు జ‌ట్టును ప్ర‌యాణించేందుకు అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించార‌న్నారు. ప్రభుత్వం అధికారికంగా మాకు నిర్ణ‌యాన్ని తెలియ‌జేసింద‌ని, ఇదే విష‌యాన్ని ఐసీసీకి వెల్ల‌డించామ‌న్నారు. ఐసీసీ 24గంట‌ల్లో త‌మ స్పంద‌న చెప్పాల‌ని కోరింద‌ని.. ప్ర‌స్తుత షెడ్యూల్ ప్ర‌కారం తాము ఆడ‌డం సాధ్యం కాద‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగానే తెలియ‌జేశామ‌న్నారు. ఈ స‌మావేశంలో వ్య‌క్తిగ‌త కార‌ణాల‌ను చూపుతూ బీసీబీ బోర్డు డైరెక్ట‌ర్ ఇష్తియాక్ సాదేక్ రాజీనామా చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement