త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | దిగ్గజాలకు ఎదురుదెబ్బ.. తొలిమ్యాచ్‌లో దక్కని విజయం..

FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అమెరికా వేదికగా సోమవారం జరిగిన మ్యాచులన్నీ డ్రాగా ముగిశాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావించిన స్పెయిన్, బెల్జియం, ఉరుగ్వే జట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయాయి. కేవలం డ్రాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలిసారిగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన కేప్‌ వెర్డే మాజీ చాంపియన్‌ అయిన స్పెయిన్‌ను 0-0 తేడాతో నిలువరించడం విశేషం. మరోవైపు ఈజిప్ట్‌ను బెల్జియం 1-1తో నిలువరించగా.. ఉరుగ్వే నుంచి సౌదీ అరేబియా కీలక పాయింట్ దక్కించుకుంది.

P

Sports | Published On Jun 16, 2026, 9.57 am IST

FIFA 2026 | దిగ్గజాలకు ఎదురుదెబ్బ.. తొలిమ్యాచ్‌లో దక్కని విజయం..
Advertisement
  • సోమవారం జరిగిన మ్యాచులన్నీ డ్రా
  • సౌదీ అరేబియా-ఉరుగ్వే మ్యాచ్‌ 1-1తో సమం
  • ఇరాన్‌-న్యూజిలాండ్‌ 2-2తో డ్రా
  • బెల్జియం-ఈజిప్ట్‌ మ్యాచ్‌ కూడా 1-1తో డ్రా

FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అమెరికా వేదికగా సోమవారం జరిగిన మ్యాచులన్నీ డ్రాగా ముగిశాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావించిన స్పెయిన్, బెల్జియం, ఉరుగ్వే జట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయాయి. కేవలం డ్రాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలిసారిగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన కేప్‌ వెర్డే మాజీ చాంపియన్‌ అయిన స్పెయిన్‌ను 0-0 తేడాతో నిలువరించడం విశేషం. మరోవైపు ఈజిప్ట్‌ను బెల్జియం 1-1తో నిలువరించగా.. ఉరుగ్వే నుంచి సౌదీ అరేబియా కీలక పాయింట్ దక్కించుకుంది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో ఇరాన్, న్యూజిలాండ్ 2-2తో డ్రా చేసుకున్నాయి. దీంతో సోమవారం జరిగిన నాలుగు మ్యాచ్‌లు కూడా సమంగా ముగిశాయి.

స్పెయిన్‌ను ఆటాడుకున్న కేప్‌ వెర్డే..

స్పెయిన్-కేప్ వెర్డే, ఉరుగ్వే-సౌదీ అరేబియా మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో గ్రూప్-హెచ్‌లోని నాలుగు జట్ల ఖాతాల్లో ఒక్కో పాయింట్ చేరింది. ఇక అన్ని జట్లు తర్వాతి మ్యాచ్‌లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది. స్పెయిన్ వంటి బలమైన జట్టును నిలువరించి కేప్‌ వెర్డే తాము సైతం పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థి జట్లకు సందేశం పంపింది. స్పెయిన్‌ను గోల్స్ చేయకుండా అడ్డుకున్న కేప్ వెర్డే ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా 40 ఏళ్ల గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత ప్రదర్శనతో జట్టును నిలబెట్టాడు. ఈ ఫలితం కేప్ వెర్డేకు తదుపరి దశ అవకాశాలను మరింత బలపరిచింది.

ఉరుగ్వేకు చెమటలు పట్టించిన సౌదీ

ఫిఫా ప్రపంచకప్-2026లో రెండుసార్లు విజేతగా నిలిచిన ఉరుగ్వేకు సౌదీ అరేబియా చెమటలు పట్టించింది. గ్రూప్-హెచ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి దశ వరకు వెనుకబడిన ఉరుగ్వే, మాక్సీ అరౌజో చేసిన కీలక గోల్‌తో పరాజయం నుంచి తప్పించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఉరుగ్వే దూకుడుగా ఆడింది. ఐదో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం దక్కినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. బాక్స్ వెలుపల నుంచి అరౌజో కొట్టిన బలమైన షాట్‌ను సౌదీ గోల్‌కీపర్ మహమ్మద్ అల్ ఒవైస్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం వచ్చిన కార్నర్‌ను కూడా ఉరుగ్వే గోల్‌గా మలచలేకపోయింది. 18వ నిమిషంలో ఉరుగ్వే చేసిన మరో ప్రయత్నం గోల్‌పోస్ట్‌ను తాకి బయటకు వెళ్లింది. 30వ నిమిషంలో వచ్చిన మరో మంచి అవకాశాన్ని కూడా సౌదీ డిఫెన్స్‌ సమర్థంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించిన సౌదీ అరేబియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఒత్తిడి పెంచింది. ఆ దూకుడుకు ఫలితంగా 41వ నిమిషంలో అబ్దులెలాహ్ అల్-అమ్రీ గోల్ సాధించి సౌదీకి ఆధిక్యం అందించాడు. దీంతో తొలిభాగం ముగిసే సమయానికి సౌదీ అరేబియా 1-0తో ముందంజలో నిలిచింది. ద్వితీయార్థంలో ఉరుగ్వే గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఓటమి తప్పదనిపిస్తున్న సమయంలో 80వ నిమిషంలో మాక్సీ అరౌజో గోల్ చేసి ఉరుగ్వేకు ఊరటనిచ్చాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, 2022 ఖతార్ ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా, ఈసారి కూడా పోరాట పటిమ కనబరిచి విలువైన పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇరాన్-న్యూజిలాండ్ పోరు సమం

ఇంగ్లీవుడ్‌లోని లాస్ ఏంజెల్స్ స్టేడియంలో గ్రూప్-జీలో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్, న్యూజిలాండ్ 2-2తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఏడో నిమిషంలో ఎలిజా జస్ట్ గోల్‌ వేయడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం లభించింది. అయితే, 32వ నిమిషంలో రామిన్ గోల్ చేయడంతో ఇరాన్ స్కోర్‌ను సమం చేసింది. తొలిభాగం 1-1తో ముగిసింది. రెండోభాగంలో 55వ నిమిషంలో ఎలిజా జస్ట్ మరోసారి గోల్ చేసి న్యూజిలాండ్‌ను ముందంజలో నిలిపాడు. మొహెబీ హెడ్డర్‌తో గోల్ సాధించి ఇరాన్‌ను మరోసారి గట్టెక్కించాడు. దీంతో స్కోరు 2-2గా మారింది. ఆ తర్వాత ఇరాన్‌కు పలు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. అయినప్పటికీ మ్యాచ్ మొత్తం వెనుకబడిన ప్రతిసారీ వెంటనే కోలుకుంది. ఇరాన్ ప్లేయర్స్‌ తమ అద్భుతమైన పోరాట పటమిను ప్రదర్శించారు.

Advertisement
Advertisement