త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shubman Gill | ఇండోర్ క‌లుషిత నీటి ఎఫెక్ట్‌.. రూ.3 ల‌క్ష‌ల‌తో ఏకంగా వాట‌ర్ ప్యూరిఫైర్‌ను తెచ్చుకున్న గిల్‌..

Shubman Gill | భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇండోర్‌లో జరగనున్న మూడో, తుది వ‌న్డే మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలుపు లేదా ఓటమిపై మాత్రమే కాదు, మైదానం బయట కూడా భారత జట్టు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

S

Cricket | Published On Jan 17, 2026, 1.06 pm IST

Shubman Gill | ఇండోర్ క‌లుషిత నీటి ఎఫెక్ట్‌.. రూ.3 ల‌క్ష‌ల‌తో ఏకంగా వాట‌ర్ ప్యూరిఫైర్‌ను తెచ్చుకున్న గిల్‌..
Advertisement

Shubman Gill | భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇండోర్‌లో జరగనున్న మూడో, తుది వ‌న్డే మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలుపు లేదా ఓటమిపై మాత్రమే కాదు, మైదానం బయట కూడా భారత జట్టు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో బీసీసీఐ ఏమాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. భారతదేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరున్న ఇండోర్, ఇటీవల కలుషిత నీటి కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో, నీటి ప‌రంగా బీసీసీఐ అసాధారణ భద్రతా చర్యలను చేప‌డుతోంది.

హోట‌ల్‌లోనే ప్యూరిఫైర్ ఏర్పాటు..

టీమిండియా ఇండోర్‌లోని ఓ 5 స్టార్ హోటల్‌లో బస చేస్తోంది. అయితే, హోటల్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, టీమ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దాదాపు రూ.3 లక్షల విలువైన ప్రత్యేక వాటర్ ప్యూరిఫికేషన్ యంత్రాన్ని తీసుకొచ్చాడు. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటికే RO ద్వారా శుద్ధి చేసిన నీటిని లేదా ప్యాకేజ్డ్ బాటిల్ వాటర్‌నూ మళ్లీ శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ యంత్రాన్ని గిల్ తన వ్యక్తిగత హోటల్ గదిలోనే ఏర్పాటు చేయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై టీమ్ మీడియా మేనేజర్ స్పందించడానికి నిరాకరించారు. ఇండోర్‌లో ఇటీవల జరిగిన కలుషిత నీటి ఘటనల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారా? లేక వ్యక్తిగత భద్రతా నిబంధనల్లో భాగమా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

విరాట్ కోహ్లి సైతం..

హోటల్, స్టేడియంలో ఇప్పటికే RO వ్యవస్థలు, ప్యాకేజ్డ్ తాగునీటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ, టీమిండియా నీటి విష‌యంలో ఈ అదనపు భద్రతా ఏర్పాట్ల‌ను ఎంచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ తరహా జాగ్రత్తలు భారత జట్టుకు కొత్తకాదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇలాంటి విష‌యాల్లో ముందే ఉంటాడు. అత‌ను త‌న జీవ‌న‌శైలిని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాటిస్తాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లి నీటికి సైతం అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తాడు. కేవ‌లం ప్రీమియం వాట‌ర్‌ను మాత్రమే అత‌ను సేవిస్తాడు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసే ఎవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ నే కోహ్లి తాగుతాడు. ఇలా ప్లేయ‌ర్లు ఎవ‌రికి వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ వ‌హిస్తుంటారు. అయితే గిల్ ఇలా ఏకంగా ఓ వాట‌ర్ ప్యూరిఫైర్‌ను తెచ్చుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌లుషిత నీటికి 23 మంది మృతి..

కాగా ఇండోర్‌లోని భాగీరథపుర ప్రాంతంలో కలుషిత నీటి కారణంగా ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. హైకోర్టులో ప్రభుత్వం 15 మరణాలను అధికారికంగా అంగీకరించినప్పటికీ, 21 కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరిని సాధారణ వార్డుకు మార్చగా, ముగ్గురు ఇంకా వెంటిలేటర్‌పై ఉన్నారు. కాగా ఇండోర్‌లో చివ‌రి వ‌న్డేలో భార‌త్ గెలిచి సిరీస్‌ను గెలుచుకోవాల‌ని, గ‌తంలో టెస్టుల్లో న్యూజిలాండ్ చేతిలో జ‌రిగిన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావిస్తుండ‌గా, మ‌రో వైపు కీల‌క ప్లేయ‌ర్లు లేని కివీస్ టీమ్ ఎలాగైనా ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని చూస్తోంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 18వ తేదీన ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ఇండోర్‌లో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement