త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | బీసీసీఐ ఆర్టీఐ ప‌రిధిలోకి రాదు.. స్ప‌ష్టం చేసిన సీఐసీ..!

BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) మరోసారి స్పష్టం చేసింది. బీసీసీఐ ప్రభుత్వ యాజమాన్యంలో లేదని, ప్రభుత్వ నియంత్రణ కూడా లేదని, అలాగే ప్రభుత్వ నిధులు అందకపోవడంతో దాన్ని ప్రజా అధికార సంస్థగా పరిగణించలేమని వెల్లడించింది.

P

Sports | Published On May 18, 2026, 5.54 pm IST

BCCI | బీసీసీఐ ఆర్టీఐ ప‌రిధిలోకి రాదు.. స్ప‌ష్టం చేసిన సీఐసీ..!
Advertisement

BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) మరోసారి స్పష్టం చేసింది. బీసీసీఐ ప్రభుత్వ యాజమాన్యంలో లేదని, ప్రభుత్వ నియంత్రణ కూడా లేదని, అలాగే ప్రభుత్వ నిధులు అందకపోవడంతో దాన్ని ప్రజా అధికార సంస్థగా పరిగణించలేమని వెల్లడించింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లలో భారత జట్టుకు బీసీసీఐ ఎలా ప్రాతినిధ్యం వహిస్తోంది? ఆటగాళ్ల ఎంపిక ఏ అధికారాల ఆధారంగా జరుగుతోంది? అనే అంశాలపై సమాచారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను సీఐసీ తిరస్కరించింది. ఈ వ్యవహారానికి గతంలోనే చట్టపరమైన మలుపు వచ్చింది. 2018లో అప్పటి సమాచార కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులు బీసీసీఐని ప్రజా అధికార సంస్థగా పరిగణిస్తూ ప్రజా సమాచార అధికారులను నియమించాలని ఆదేశించారు.

అయితే, ఆ నిర్ణయాన్ని బీసీసీఐ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు గత తీర్పులను పరిగణనలోకి తీసుకుని ఈ అంశాన్ని తిరిగి పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర సమాచార కమిషన్‌కు సూచించింది. దీంతో తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సీఐసీ, బీసీసీఐ ఆర్‌టీఐ చట్ట పరిధిలోకి రాదనే నిర్ణయానికి వచ్చింది. సమాచార కమిషనర్ పీఆర్ రమేశ్‌ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన స్వతంత్ర సంస్థ అని తెలిపారు. రాజ్యాంగం, పార్లమెంట్ చట్టం లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ సంస్థ ఏర్పడలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్యం, నియంత్రణ, గణనీయమైన ఆర్థిక సహాయం బీసీసీఐకి లేకపోవడంతో ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 2(h) ప్రకారం దాన్ని ప్రజా అధికార సంస్థగా పరిగణించలేమ‌ని సీఐసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో బీసీసీఐ కార్యకలాపాలపై ఆర్‌టీఐ ద్వారా సమాచారం కోరే అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది.

Advertisement
Advertisement